ఏపీలో మరో సైనిక స్కూల్.. కేతనకొండలో నాలుగో పాఠశాల

ఏపీలో మరో సైనిక స్కూల్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు సైనిక స్కూల్ అంటే ఉత్తరాంధ్రలోని కోరుకొండ సైనిక స్కూలు మాత్రమే అందరికి గుర్తుకు వస్తుంది.;

Update: 2025-05-15 10:11 GMT

ఏపీలో మరో సైనిక స్కూల్ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు సైనిక స్కూల్ అంటే ఉత్తరాంధ్రలోని కోరుకొండ సైనిక స్కూలు మాత్రమే అందరికి గుర్తుకు వస్తుంది. అయితే పదేళ్ల క్రితం చిత్తూరు జిల్లా కలికిరి, నెల్లూరు జిల్లా క్రిష్ణపట్నంలోనూ సైనిక స్కూల్ ఏర్పాటయ్యాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో సైనిక స్కూలును రాష్ట్రానికి కేటాయించింది. ఇరి రాష్ట్రం నడిబొడ్డున ఉన్న విజయవాడలో ఏర్పాటు కానుంది. విద్యాభారతి ఆధ్వర్యంలో ప్రారంభించనున్న సైనిక స్కూల్ ఈ ఏడాది నుంచి ప్రవేశాలు జరగనున్నాయి.

విజయవాడకు సమీపంలోని కేతనకొండలో కొత్తగా సైనిక స్కూల్ ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. వచ్చేనెల నుంచి అడ్మిషన్లు, తరగతులు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం సైనిక స్కూళ్ల సంఖ్య నాలుగుకు చేరనుంది. విద్యాభారతి ఆధ్వర్యంలో నేతాజీ సైనిక స్కూల్ పేరుతో దీనిని ఏర్పాటు చేయనున్నట్లు విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర కార్యనిర్వహణ కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి వెల్లడించారు. సైనిక స్కూల్ ఏర్పాటుకు సంబంధించిన స్థలం, భవన దాత చలసాని బాబూ రాజేంద్రప్రసాద్, నేతాజీ సైనిక స్కూల్ సొసైటీ కార్యదర్శి వాసిరెడ్డి వినోద్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మాజీ చైర్మను డాక్టర్ సీఎల్ వెంకట్రావు కలిసి సైనిక స్కూల్ బ్రోచర్ ను తాజాగా ఆశిష్కరించారు.

ఈ సైనిక స్కూల్ లో ఉభయ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు 67 శాతం కోటా అమలు చేయనున్నారు. లోకల్ కేటగిరీలో ఎక్కువ సీట్లు తెలుగు విద్యార్థులకే కేటాయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మాత్రమే ప్రవేశాలు కల్పిస్తారు. సైనిక స్కూల్ లో ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది అడ్మిషన్లకు ఇప్పటికే పరీక్ష ముగిసింది. ఏటా 6, 9 తరగతిల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తారు.

కాగా, కేతనకొండలో ఏర్పాటు కానున్న నేతాజీ సైనిక స్కూల్ ను జూన్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, బండి సంజయ్ లను ఆహ్వానించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 100 సైనిక స్కూళ్లను నడపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ పాఠశాలలకు 8 ఎకరాల భూమి, భవనాలు చూపించాల్సివుంటుంది. కాగా, కేతనకొండలో ఏర్పాటు కానున్న సైనిక స్కూల్ ఈ ఏడాది ఆరో తరగతిలో మాత్రమే ప్రవేశాలు జరగనున్నాయి.

Tags:    

Similar News