మంత్రి అచ్చెన్నాయుడు శాఖలోనే ఎందుకిలా..? ఫెయిల్యూర్స్ కి కారణం ఎవరు?

రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరత పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో ఎరువులు నిల్వలు ఉన్నాయని చెబుతున్నా రైతుల నుంచి ఆందోళనలు అదే స్థాయిలో కనిపిస్తున్నాయంటున్నారు.;

Update: 2025-09-10 16:30 GMT

ఏపీ సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడుని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మొత్తం 24 మంది మంత్రులు ఉండగా, ఒక్క అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్న మంత్రిత్వశాఖ పలు సంక్షోభాలతో సతమతమవుతోంది. 15 నెలలుగా దూకుడుగా ఉన్న ప్రభుత్వం కూడా అచ్చెన్నాయుడు మంత్రిత్వ శాఖతో డైలమాలో పడిపోతున్నట్లు చెబుతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం గాడి తప్పిందని, తిరిగి సరిదిద్దుతున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం వ్యవసాయం, రైతాంగ సమస్యల విషయంలో ఆత్మరక్షణలో పడిపోతున్నట్లు చెబుతున్నారు. నిరంతరం ప్రభుత్వం పాలన వ్యవహారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షిస్తున్నప్పటికీ, వ్యవసాయ శాఖ నుంచి ఎదురవుతున్న సమస్యలను మాత్రం అధిగమించలేక పోతున్నారని అంటున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడులు, పరిశ్రమలు విషయంలో జోరు చూపిస్తోంది. అదే సమయంలో సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున అమలు చేస్తోంది. కానీ, ప్రధానమైన వ్యవసాయ శాఖ విషయంలో మాత్రం ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దీనికి కారణం ప్రభుత్వపరంగా ముందస్తు వ్యూహం లోపించడమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో అసలు లోపం ఎక్కడ ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత శాఖ పర్యవేక్షిస్తున్న మంత్రి నాయకత్వ లోపమా? లేక అధికారులు సరైన సమయంలో స్పందించడం లేదా? అన్న చర్చ జరుగుతోంది. విపక్షం కూడా ఎక్కువగా ఇదే అంశాలపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో కూటమి నేతలు డైలమాలో పడిపోతున్నారు. వ్యవసాయ శాఖపై ప్రత్యేక ఫోకస్ చేయాలని ప్రభుత్వ పెద్దలకు సూచనలు చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం ఎరువుల కొరత పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాదికి మించిన స్థాయిలో ఎరువులు నిల్వలు ఉన్నాయని చెబుతున్నా రైతుల నుంచి ఆందోళనలు అదే స్థాయిలో కనిపిస్తున్నాయంటున్నారు. ప్రతిపక్షం సైతం ఇదే అంశమై పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ సీజన్ లో ఒకసారి 80 వేల మెట్రిక్ టన్నులు, మరోసారి 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. రబీ సీజన్ కూడా సరిపడేలా యూరియా తెప్పించినట్లు చెబుతుంది. కానీ, క్షేత్రస్థాయిలో యూరియా, ఇతర ఎరువుల కోసం రైతులు బారులు తీరుతున్నారు. దీనికి కారణం వ్యవసాయ శాఖ నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడమే అంటున్నారు. ముందస్తు అంచనాలు ఉంటే ఈ స్థాయిలో కొరత రాకుండా ఉండేదని అంటున్నారు.

గతంలో కూడా వ్యవసాయ శాఖ నుంచి ఇలాంటి వైఫల్యాలు ఎదురైనట్లు చెబుతున్నారు. మిర్చి, పొగాకు, మామిడి, టమాటా, తాజాగా ఉల్లి ధరలు పతనం కూడా వ్యవసాయశాఖ పనితీరు కారణమని విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇతర ప్రాంతాల్లో పంటల లభ్యతను గమనించి ఆ పంటలపై రైతులను అప్రమత్తం చేయాల్సిన వ్యవసాయ శాఖ పట్టించుకోకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. పంట ప్రారంభంలోనే ఏ మేరకు సాగు చేయాలి? డిమాండ్ ఎలా ఉంటుంది అన్న విషయాలపై అవగాహన కలిగిస్తే రైతులు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. దాని వల్ల ఇబ్బందులను అధిగమించే అవకాశాలు ఉంటాయంటున్నారు. కానీ, ప్రభుత్వంలో ఈ విషయమై సరైన దిశానిర్దేశం చేయడం లేదంటున్నారు. సమస్యలు ఉత్పన్నమయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగేవరకు ఆయా అంశాలపై ఎటువంటి సన్నాహాక చర్యలు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ సమస్యలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తుండగా, వ్యక్తిగతంగా సంబంధిత మంత్రి అచ్చెన్నాయుడు ప్రతిష్టపైనా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోని మంత్రుల్లో అచ్చెన్నాయుడు అత్యంత సీనియర్. కేబినెట్ లో తొలిసారి మంత్రులు అయిన వారు ఉన్నప్పటికీ, వారి శాఖలో ఇలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అచ్చెన్నాయుడు పర్యవేక్షిస్తున్న వ్యవసాయ శాఖ ఎంతో కీలకమైనది, ప్రతిష్ఠాత్మకమైనది. అందుకే అనుభవశాలిగా ఆయనకు వ్యవసాయ శాఖ అప్పగించారు. కానీ, అచ్చెన్నాయుడు నాయకత్వంలోనూ సమస్యలు రావడంతో ప్రభుత్వ వర్గాలు తలలు పట్టుకుంటున్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News