కృపారాణి సౌండ్...షర్మిల సైలెంట్ !

ఏపీ కాంగ్రెస్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది.;

Update: 2025-08-05 06:42 GMT

ఏపీ కాంగ్రెస్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది. పీసీసీ చీఫ్ గా ఏణ్ణర్థం క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిలను తప్పిస్తారు అని చాన్నాళ్ళ క్రితం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే మరింత జోరుగా మారి ప్రచారంగా సాగుతున్నాయి. ఏపీ కాంగ్రెస్ లో ఎందరో సీనియర్లు ఉన్నారు కానీ అనూహ్యంగా షర్మిలకు ఈ కీలక పదవి దక్కింది. అయితే ఇపుడు అంతే అనూహ్యంగా ఆమెకు చెక్ చెప్పబోతున్నారా అన్నదే రాజకీయంగా చర్చగా ముందుకు వస్తోంది.

గొంతు పెంచిన ఆమె :

కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అయిన కిల్లి కృపారాణి ఒక్కసారిగా గొంతు పెంచారు. ఆమె ఈ మధ్య కాలంలో అయితే ఎక్కడా మీడియా ముందుకు రాలేదు కానీ సడెన్ గా ఆమె సౌండ్ చేస్తున్నారు. ఆమె చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మీద ధీటైన విమర్శలు చేయడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. పక్కా కాంగ్రెస్ వాదిగా ఆమె మాటలు ప్రకటనలు ఉన్నాయి. ఆమె ఫోకస్ ఏపీలో టీడీపీ కూటమి మీదనే ఉంచారు. చంద్రబాబు పాలననూ బీజేపీకి కలిపి మరీ ఘాటైన విమర్శలు చేశారు.

ఏపీకి కేంద్రం ఏమిచ్చింది :

ఏపీకి కేంద్రం ఏమిచ్చింది, చంద్రబాబు ఏమి తెచ్చారు అని సూటిగానే కృపారాణి ప్రశ్నించారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ ఎంపీల మద్దతు ప్రాణాధారం అయిన సందర్భంలో డిమాండ్ చేసి ఏపీకి సాధించుకోవాల్సిన హక్కులు కానీ ప్రయోజనాలకు కానీ గడచిన పదిహేను నెలలలో ఎక్కడా నెరవేరలేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు ఏపీలో జైలు పధకం మాత్రమే అమలు చేస్తున్నారు అని కూడా ఆమె ఎత్తి చూపారు. అయితే ఈ పధకం వల్ల వైసీపీ టీడీపీ రెండు పార్టీలకు ప్రయోజనం అని సెటైర్లు పేల్చారు.

ఉన్నట్లుండి ఎందుకలా :

ఏపీలో ఉన్నట్లుండి కృపారాణి మీడియా ముందుకు రావడమే కాదు కాంగ్రెస్ అజెండాను ముందు ఉంచి మరీ గట్టిగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం ద్వారా ఏపీ కాంగ్రెస్ ప్రాధాన్యతలు ఏంటో చెప్పదలచారా అన్న చర్చ సాగుతోంది. షర్మిల అయితే జగన్ ని ప్రతీ దానికీ ముడిపెడుతూ విమర్శించేవారు. ఆమె తన ప్రసంగాల్లో ఎక్కువగా జగన్ నే టార్గెట్ చేసేవారు. అయితే కృపారాణి మాత్రం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. దాంతో ఆమె విమర్శలు చేయడం వెనక ఏ పరిణామాలు దాగి ఉన్నాయని అంతా ఆలోచిస్తున్నారు.

అన్ని రకాలుగా ధీటైన నేతగా :

ఏపీలో కాంగ్రెస్ ని సమూలంగా ప్రక్షాళన చేయాలని జాతీయ కాంగ్రెస్ ఆలోచిస్తోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో మహిళా నాయకురాలి నుంచి పీసీసీ చీఫ్ పదవిని తీసుకున్నపుడు మరో మహిళా నాయకురాలికే దానిని ఇవ్వాలని యోచిస్తున్నారు అని అంటున్నారు. పైగా ఉత్తరాంధ్ర వంటి వెనకబడిన ప్రాంతం అందునా ఇంకా వెనకబడిన శ్రీకాకుళం జిల్లా నుంచి బీసీ మహిళకు పట్టం కట్టాలనుకోవడం కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యావంతురాలిగా ఆమె ఉన్నారు. ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అనర్గళంగా ప్రసంగాలు చేయగలరు. ప్రతిపక్షంలో ఉంటూ సరైన రాజకీయ ఎత్తుగడలతో పార్టీని ముందుకు నడిపించగలరు అని అంటున్నారు.

షర్మిల మౌనం వెనక :

ఇదిలా ఉంటే గత కొన్నాళ్ళుగా షర్మిల మౌనంగా ఉన్నారు. ఆమె ఎక్కడా అలికిడి చేయడంలేదు. మరి ఆమె ఎందుకు అలా ఉన్నారన్న దాని మీద కూడా చర్చ సాగుతోంది. జాతీయ నాయకత్వం నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. మరో వైపు చూస్తే పీసీసీ చీఫ్ పదవి విషయంలో జరుగుతున్న ప్రచారం అపోహ మాత్రమే అని కృపారాణి అంటున్నారు. ఇక షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెది అని కూడా అన్నారు మొత్తానికి చూస్తే కృపారాణి మాట్లాడుతున్నారు. షర్మిల మౌనంగా ఉంటున్నారు. సో జాతీయ కాంగ్రెస్ ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా అన్నదే అంతా చూస్తున్నారు.

Tags:    

Similar News