‘చిన్నచిన్న సమస్యలు ఉన్నాయి’ - కూటమిపై లోకేశ్ కామెంట్స్
కూటమిలో విభేదాలు ఉన్నాయా? అంటే ఔను అని చెప్పడానికి ఎవరైనా కాస్త తటాపటాయిస్తున్నారు.
కూటమిలో విభేదాలు ఉన్నాయా? అంటే ఔను అని చెప్పడానికి ఎవరైనా కాస్త తటాపటాయిస్తున్నారు. ఎందుకంటే కూటమిలోని మూడు పార్టీల నేతలు విభేదాలకు తావులేకుండా పనిచేస్తామని, భవిష్యత్తులోనూ కలిసిపోటీ చేస్తామని పదేపదే స్పష్టం చేస్తున్నారు. కూటమి కీలక నేత, డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే అంశంపై తాజాగా మాట్లాడారు. కూటమి బలంగా ఉండాలని ఆశిస్తున్నానని పవన్ వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రి లోకేశ్ కూడా కూటమి పార్టీల మధ్య అవగాహనపై స్పందించారు. కూటమిలో చిన్నచిన్న సమస్యలు ఉంటాయని, వాటిని నాలుగు గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకుంటామని వెల్లడించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కొన్నాళ్లుగా తన ప్రతి కార్యక్రమంలో చెబుతున్నట్లే రాప్తాడు సభలోనూ కూటమిలో అందరూ కలిసిమెలిసి పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ కోటి ఆరు లక్షల మంది సభ్యులు ఉన్న కుటుంబమని లోకేశ్ అభివర్ణించారు. ఇంత పెద్దకుటుంబంలో పవన్ అన్న కూడా చేరారు. బీజేపీ కూడా తెలుగుదేశం కుటుంబమే.. కుటుంబం అన్నాక చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. వాటిని నాలుగు గోడల మధ్య కూర్చుని పరిష్కరించుకుంటాం అంటూ లోకేశ్ వివరించారు.
స్థానిక ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సమయంలో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి లోకేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. స్థానిక సంస్థలలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలన్న అంశంపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ ఆశావహులు ఎక్కువగా ఉన్నచోట జనసేన పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుందన్న ప్రచారంతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోతోంది. అయినప్పటికీ ఎవరూ బహిరంగంగా మాట్లాడకుండా కూటమి అగ్రనేతలు నిలువరిస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కూటమిగా పోటీ చేస్తామని అటు పవన్, చిన్నచిన్న సమస్యలు ఉన్నా సర్దుకుంటామని లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని పంపినట్లుగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడా నేతలు త్యాగాలు చేసినట్లు స్థానిక ఎన్నికల్లో కూడా కొందరు పోటీ నుంచి తప్పుకోడానికి రెడీగా ఉండాలని ఇరు పార్టీల నాయకులు సంకేతాలు పంపుతున్నట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురం సభలో పవన్, రాప్తాడులో మంత్రి లోకేశ్ వేరువేరుగా చెప్పినా, ఇద్దరి అంతిమ లక్ష్యం ఒకేమాదిరిగా కనిపిస్తోందని అంటున్నారు. కూటమిలో తగాదాలకు తావివ్వకుండా పరస్పర గౌరవంతో నడుచుకుంటామని ఇద్దరు నేతలు పదేపదే చెబుతున్నారని గుర్తు చేస్తున్నారు. దీంతో కూటమిలో చీలిక తేవాలని ప్రయత్నిస్తున్న ప్రత్యర్థులు ఇతర మార్గాలు చూసుకోవాల్సిందేనని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.