పాలు తాగవు...పగబట్టవు !
| నాగుల చవితి సందర్భంగా పాములకు పాలు పోయడం వెనుక శాస్త్రీయ నిజాలపై చర్చ జరుగుతోంది. పాములకు పాలు జీర్ణం చేసే వ్యవస్థ ఉండదని, అవి మాంసాహారులని నిపుణులు చెబుతున్నారు. బలవంతంగా పాలు తాగించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పాములను పూజించడంతో పాటు వాటికి హాని కలగకుండా చూడాలని సూచిస్తున్నారు.
నాగు పాము పగ పన్నెండేళ్ళు అని ఒక నానుడి ఉంది. అది నిజమా అంటే కాదనే అంటారు జంతు జీవ శాస్త్ర నిపుణులు. అయితే పాములు అన్నవి అనేక జాతులలో విషంతో కూడుకున్నవి ఉంటాయి. దాంతో పాము అంటే ఒక రకమైన భయం ఉంటుంది. అలాగే పాములకు సంబంధించిన కధలు చిన్నప్పటి నుంచి చెబుతూ వస్తూంటారు. అలా పాములు అంటే ఒక భయంతో కూడిన భావన ఏర్పడుతోంది. ఇక పురాణాలలో సైతం పాముల ప్రస్తావన ఉంది. పరమ శివుని మెడలో ఆభరణంగా పాము ఉంటుంది. అలాగే నాగుల చవితి అని ప్రత్యేకంగా పండుగ చేసుకుంటారు. ఇవన్నీ కూడా పాముల పట్ల భక్తిని కూడా పెంచుతున్నాయి.
పుట్టలో ఉంటాయా :
నిజానికి పాములు ఉండే పుట్టలు వేరు. అక్కడకు వెళ్ళి పాలు పోస్తే అవి తాగవు సరి కదా బుస్సున పైకి లేచి బుసలు కొడతాయని నాస్తిక వాదులు చెబుతున్నారు. పాములు పాలు తాగుతాయని ఎవరు చెప్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. పాములకు పాలలో ఉండే లాక్టోజ్ ని జీర్ణించుకునే జీర్ణ వ్యవస్థ లేదని వారు చెబుతున్నారు. సరీ సృపాలు వర్గానికి చెందినవి అని అంటున్నారు. సరీసృపాలు అంటే నేలపై పాకుతూ కదిలే వెన్నెముక గల జీవుల వర్గం అన్న మాట. అందువల్ల పాములు పాలు తాగే క్షీరదాలు కావని అంటున్నారు. పైగా పాములు మాంసాహారులని అవి తినే ఆహారం ఎలుకలు, ఓల్ఫ్ అంటివి ఉంటాయని చెబుతున్నారు. అంతే కాకుండా పాములకు పాలు బలవంతంగా తాగిస్తే వాటికి తీవ్రమైన జీర్ణ సంబంధ సమస్యలతో పాటు శ్వాస కోస సంబంధిత సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు.
నిజంగా ఉంటాయా :
ఇక పాములు పుట్టలో నిజంగా ఉంటాయా అంటే అవి ఉండే పుట్టలు వేరు అని అంటున్నారు జంతు జీవ శాస్త్ర నిపుణులు. అక్కడికి వెళ్ళి పుట్టలో పాలు పోసే సాహసం ఎవరూ చేయరని అంటున్నారు. కృత్రిమ పుట్టలలోనే అత్యధిక శాతం పాలు పోస్తారు అని నాగుల చవితి వేళ ఈ విధంగా కృతిమ పుట్టలు తయారు చేసి సొమ్ము చేసుకునే వారికే కాసుల పంట అని అంటున్నారు. పాములకు భక్తితో డబ్బులు గుడ్లు వేస్తే వాటిని ఈ కృత్రిమ పుట్టలు తయారు చేసే వారు తీసుకుని సొమ్ము చేసుకుంటారు అని అంటున్నారు.
జనవాసాలలోకి :
ఇక పాములు నిజంగా ఉండే పుట్టల వద్దకే వెళ్ళి పాలు పొస్తే ఏమవుతుంది అంటే అక్కడ పాలను చీమలు ఇతర క్రిమికీటకాలు చేరి పోతాయని దాంతో పాములు తన నివాసం వద్ద ఉండలేక జనవాసాల్లోకి వచ్చి పడతాయని కూడా అంటున్నారు. అందువల్ల ఏ విధంగా చూసినా పాములకు పాలు పోయడం అన్నది మూఢ నమ్మకమే తప్ప ఉపయోగం ఉండదని నాస్తికులు వాదిస్తున్నారు. ఇది ఒక రకంగా మూఢత్వం అని కూడా వారు తేల్చేస్తున్నారు.
హిందూత్వంలోనే :
అయితే పాములకు పాలు పోయడం అన్నది హిందూత్వంలో ఉన్న ఒక అందమైన భావనగా చెబుతున్నారు. చెట్టు పుట్ట గుట్ట, ఆఖరికి విషం చిమ్మే పాములను కూడా ఆదరించి పూజించమని చెప్పేదే హిందూత్వం అని హైందవ విశ్వాసులు చెబుతున్నారు. ఇది ప్రకృతి పట్ల సమస్త జీవ రాశుల పట్ల చూపించే ప్రేమకు తార్కాణం అని అంటున్నారు అంతే కాకుండా ప్రకృతి అంటే కేవలం మనిషి మాత్రమే కాదని 84 లక్షల జీవరాశుల సంగమం అని అన్నీ ఉంటేనే ప్రకృతి సమగ్రంగా ఉంటుందని అపుడు విపత్తులు కూడా రాకుండా ఉంటాయని అంటున్నారు. ఈ విధంగా ధర్మ సూక్షం తో పాటు ప్రకృతిని సాటి జీవులను పరిరక్షించే సూత్రం ఇమిడి ఉందని చెబుతున్నారు. ఏది ఏమైనా నాగుల చవితిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు, ఆ రోజున ఉపవాసాలు కూడా చేస్తారు. దీపావళి వెళ్ళిన నాలుగు రోజుల తరువాత వచ్చే ఈ వేడుక కార్తీక మాసంలో ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టంగా ఉంటుంది.