పూరీ గోపురంపై పవిత్ర జెండా...ప్రతీ రోజూ సాహసమే !

ఒడిషాలో సుప్రసిద్ధ పూరీ క్షేత్రం గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ జనాలకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి.

Update: 2026-10-30 03:28 GMT

ఒడిషాలో సుప్రసిద్ధ పూరీ క్షేత్రం గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇప్పటికీ జనాలకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కళ్ళకు కనిపించే సాహసాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి ప్రతీ రోజూ పూరీ జగన్నాథ ఆలయ గోపురంపై ఉన్న పవిత్ర పతాకాన్ని మార్చడం. సర్వకాల సర్వావస్థలలో కూడా ఈ పతాకం మార్చాల్సిందే. ఏ ఒక్క రోజు మార్చకపోయినా ఆలయాన్ని మూసేయాల్సి ఉంటుంది. అందుకే బోరున భారీ వానలు కురిసినా అలాగే చలి కాలం అయినా మరేమి జరిగినా ఠంచనుగా ఒకే సమయానికి ఎత్తైన ఆలయ శిఖరం ఎక్కి జెండాను పాతది తీసి కొత్తది కడతారు. ఈ ప్రక్రియ అంతా ఒక పెద్ద సాహసం. ఎటువంటి భద్రతా పరికరాలను ఉపయోగించకుండానే 214 అడుగుల ఆలయ శిఖరాన్ని ఎక్కడం అంటే మహాద్భుతం అనే అంటారు చూసి తరించిన వారు.

చూనారా సేవకులు మాత్రమే :

ఈ ఆలయ గోపురం వద్దకు చేరుకుని పవిత్ర పతాకాన్ని మార్చే అవకాశం సంప్రదాయం ప్రకారం చూనారా సేవకులు మాత్రమే ఉంది. అది కూడా ప్రతిరోజూ సాయంత్రం సమయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. చలికాలంలో అయితే అయిదు గంటలకు ఎండాకాలంలో ఆరు గంటలకు చునారా అనే ప్రత్యేక అర్చక కుటుంబానికి చెందిన సేవకులు మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఎటువంటి తాడు లేదా రక్షణ కవచాలు అసలు వినియోగించరు, కేవలం తమ చేతుల బలం, కాళ్ళలో ఉన్న పట్టుతోనే నిలువుగా నిటారుగా ఉన్న 214 అడుగుల ఎత్తున్న ఆలయ గోపురాన్ని పాదాలకు ఏవీ ధరించకుండా ఎక్కుతారు. ఇది గొప్ప కార్యక్రమం అయినా వారు చాలా నిశ్శబ్దంగా పవిత్ర విధిగా చేసుకుంటూ వెళ్తారు. చూసేవారికి మాత్రం అబ్బురపరుస్తుంది, అంతే కాదు వారికి ఏమైనా అవుతుందా అని భయం కూడా ఒక్కోసారి కలుగుతుంది. కానీ చూనారా సేవకులు దేవుడిని నమ్ముతారు. దైవ కార్యం ఆయనే తమ చేత చేయిస్తారు అని వారు దీనిని పూనుకుంటారు. అందుకే శతాబ్దాలుగా ఆ కార్యక్రమం జరుగుతున్నా ఒక్క రోజు కూడా ప్రమాదం అన్నది అయితే సంభవించలేదని చెబుతారు.

800 ఏళ్ళ నుంచి :

ఇక చూస్తే ఇది ఈ రోజు నాటిది కాదు, ఈ ఆచారం గత 800 సంవత్సరాలకు పైగా నిరంతరాయంగా సాగుతోందని ఆలయ నిర్వాహకులు చెబుతారు. ఇక ఈ ఆలయ గోపురంపై ఉన్న నీల చక్రానికి కట్టే ఈ పవిత్ర జెండాను పతితపావన బానా అని పిలుస్తారు. దాదాపుగా ఇరవై అడుగుల పొడవు ఉండే ఈ త్రికోణాకార జెండాను జగన్నాథుడి స్వరూపంగా అత్యంత భక్తితో భావిస్తారు. ఇక ఈ పతాకాన్ని ఒకవేళ ఏ రోజైనా మార్చడం కుదరకపోయినా ఒక వేళ మరచిపోయినా ఆలయ సంప్రదాయం ప్రకారం ఏకంగా 18 సంవత్సరాల పాటు ఆలయ తలుపులు మూసివేయవలసి ఉంటుంది అనే బలమైన నమ్మకం ఇక్కడ ఉంది. అందుకే ఎలాంటి తుఫానులు, కష్ట కాలం వచ్చినా ఈ ఆచారం ఆగనే ఆగదని చెబుతారు.

పాత జెండా ప్రసాదంగా :

మరి ప్రతీ రోజూ కిందకు తీసుకుని వచ్చే పాత జెండాను ఏమి చేస్తారు అన్న సందేహం కలుగవచ్చు. అయితే కళ్లకు అద్దుకుని మరీ పాత జెండాను చూనారా సేవకులు కిందకు తీసుకుని వస్తారు. ఆ మీదట పాత జెండాను చిన్న ముక్కలుగా చేసి భక్తులకు పవిత్ర ప్రసాదంగా ఆలయంలో విక్రయిస్తారు. భక్తులు కూడా ఈ పాత జెండా తీసుకోవడానికి పోటీ పడతారు. అది తమ ఇంట్లో ఉంచుకుంటే శుభం జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకంగా ఉంది.



Tags: