కొత్త పార్టీలు...వారికి అదో తుత్తి !
| రాజకీయాల్లో సీఎం కావాలనే ఆశతో చాలామంది కొత్త పార్టీలు పెడుతున్నారు. ఎన్నికల్లో గెలిచే బలం, ప్రజాదరణ లేకపోయినా పార్టీ అధినేతలుగా, సీఎం రేసులో ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే పార్టీ పెట్టినంత మాత్రాన నాయకులు కాలేరు, ముఖ్యమంత్రులూ కాలేరని రాజకీయ పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.
ఆచరణ ఎపుడూ కష్టమే. ఆశ మాత్రం చాలా సులువు. అలాగే ఊహలు ఇంకా తీయగా హాయిగా ఉంటాయి. ప్రతీ వారికీ అగ్ర పీఠం మీదనే మోజు ఉంటుంది. తాము అందలాలు అందుకోవాలని ఆశ పడని వారు ఎవరూ ఉండరేమో. ఇక రాజకీయాల్లో ఆ మాత్రం పేరు తెచ్చుకున్న వారి అందరి కన్నూ టాప్ చైర్ మీదనే ఉంటుంది. దేశంలో ప్రధాని పదవి మీద మోజు ఉన్నా అది అందుకోవడం చాలా కష్టమైన వ్యవహారం. అందుకే రాష్ట్రాలలో సీఎం పదవుల మీద కర్చీఫ్ వేసే వారు ఎక్కువగా ఉంటారు. రాష్ట్రాలలో కీలక పదవులు అందుకోవడం తొంబై శాతం రాజకీయ నాయకులకు తమ జీవిత కాల లక్ష్యంగా ఉంటుంది. అంతే కాదు దానిని కనుక సాధిస్తే తమ టోటల్ పొలిటికల్ లైఫ్ సూపర్ హిట్ అని భావిస్తారు. కానీ సీఎం పోస్ట్ కూడా దక్కడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో మంది ఉంటే కోటికి ఒక్కరికి చాన్స్ వస్తుంది.
అందుకే పార్టీలు :
ఈ నేపధ్యంలో సీఎం కాకపోవచ్చేమో కానీ సీఎం క్యాండిడేట్ గా అనిపించుకోవడం కూడా సగం గౌరవమే కదా అన్నది రాజకీయ భ్రాంతిలో మునిగి తేలే వారి ఆలోచనలుగా ఉంటాయి. అందుకే పోయేది ఏముంది అంటూ పార్టీలు పెడతారు. కాస్తా ఒక పార్టీలో పనిచేసిన అనుభవం ఉంటే చాలు కొత్త పార్టీలకు తెర తీస్తారు. నిజానికి పార్టీ పెట్టడం చాలా ఈజీ. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఎన్నో రిజిస్టర్ అయిన పార్టీలు ఉంటాయి. అలా పుట్టే పార్టీలతో వేలల్లో జాబితా అక్కడా ఉంటుంది. ఇలా పార్టీలు పెట్టిన వారికి రాజకీయ లాభం ఏమిటి అంటే తాను పార్టీ అధినేతలు కావడం. అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు కావడం, సీఎం రేసులో తామూ ఉన్నామని అనిపించుకోవడం. ఇలా ఆత్మానందం భజగోవిందం అన్న తరహాలో పార్టీలు పెడుతున్న వారే ఎక్కువ మంది ఉన్నారు.
ఓటేసేది ఎవరు :
పార్టీలు పెడుతున్నారు ఓకే. కానీ ఈ పార్టీలను వాటి అధినేతలను చూసి ఓటేసేది ఎవరు అన్నదే ప్రశ్న. అలాగని పార్టీలు పెట్టకూడదా అంటే ఇది ప్రజాస్వామ్యం. ఎవరిని తోచిన విధంగా వారు చేసుకోవచ్చు. పార్టీలు పెట్టవచ్చు. నాయకులుగా చలామణీ కావచ్చు. మీడియాలో బేబీలుగా వెలిగిపోవచ్చు. దర్జాగా తమ సొంత కార్లలో వీఐపీ హోదాలలో కలియ తిరగవచ్చు. ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు, నిందించవచ్చు. ఏమైనా చేయవచ్చు. మరి ఇన్ని సదుపాయాలు ఉన్నాయి కాబట్టే ఊ అంటే చాలు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు. తమ సామర్థ్యం కానీ తమ ఇమేజ్ కానీ తమ బలం కానీ ఏవీ చూసుకోవడం లేదు, కనీసం జీవిత కాలంలో ప్రత్యక్ష ఎన్నికల్లో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలవని వారు కూడా పార్టీలు పెడుతున్నారు అంటే మన ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అర్థం అవుతోంది కదా.
అందని పదవి పుల్లన :
అయితే పార్టీలు పెట్టిన వారు ఎలా నడుపుతారు అన్నది పెద్ద ప్రశ్న. పార్టీని నడపటం ఆషామాషీ వ్యవహారం కానే కాదు, అంతే కాదు ఎంతో కష్టంతో కాసులతో కాలంతో కూడుకున్న వ్యవహారం. కానీ పార్టీలు పెట్టే వారికి ఇవేమీ కనిపించవు. తమ ఉత్సాహం ముందు అన్నీ తీసికట్టుగానే భావిస్తారు. అందుకే జై అంటూ జెండాను ఆవిష్కరిస్తారు. అజెండా అంటూ తమకు తోచినవి వల్లె వేస్తారు. పైగా ముఖ్యమంత్రి పదవి అంటే తమకు అవసరం లేనట్లు మాట్లాడుతారు. నిజంగా అంతటి అవకాశం వస్తే వదిలేసుకునే అమాయకులు ఎవరు ఉన్నారు. కానీ తామే గెలవమని తెలిసిన చోట నిలబడి మరీ వేదికల మీద ఉపన్యాసాలు దంచేస్తారు. అందని పదవి పుల్లన అన్నట్లు తమకు సీఎం పోస్టు వద్దే వద్దు అంటారు. ఎవరు ముందుకు వచ్చి తీసుకోమన్నారో వారికే తెలియాలి. ఇలా పార్టీల పెడుతున్న వారి పూనకాలు రాజకీయ విన్యాసాలు అన్నీ కూడా ఒక్కోసారి హాస్యపూరితంగా మరోసారి ఎబ్బెట్టుగా ఇంకోసారి అమాయకంగా కూడా కనిపిస్తూంటాయి. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే పార్టీలు పెడితే నాయకులు కాలేరు, ముఖ్యమంత్రులూ కాలేరు. అదేదో పాత సినిమాలో హాస్య నటుడు ఏవీఎస్ అన్నట్లుగా వారికి అదో తుత్తి. అంతకు మించి మాట్లాడేందుకు కూడా అందులో లేదు కూడా.