ఏపీ బీజేపీలో ఇక ఎవరికీ రాజ్యసభ యోగం లేనట్లే..?!

కూటమి ప్రభుత్వం అధికారంలో పదవుల్లో వాటాతో తమ ఫేట్ మారుతుందని కలలు కన్న కమలం నేతల ఆశలపై ఢిల్లీ పెద్దలు నీళ్లు పోశారంటున్నారు.;

Update: 2025-04-24 01:30 GMT

కేంద్రంలో అధికారం, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం అన్న ఆనందం ఏపీ బీజేపీలో పెద్దగా కనిపించడం లేదంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో పదవుల్లో వాటాతో తమ ఫేట్ మారుతుందని కలలు కన్న కమలం నేతల ఆశలపై ఢిల్లీ పెద్దలు నీళ్లు పోశారంటున్నారు. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన పలువురు నేతలు.. అధిష్టానం ఆలోచన భిన్నంగా ఉందనే సమాచారంతో నీరుగారిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి చెందిన ఏ బీజేపీ నేతకు సమీప భవిష్యత్తులో రాజ్యసభ యోగం లేనట్లేనని అంటున్నారు.

గత ఎన్నికల ముందు పొత్తు పొడుపుతో ఏపీ బీజేపీలో చాలా మంది నేతల జాతకాలు మారిపోయానే అభిప్రాయం ఎక్కువగా ఉంది. ఆ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో సొంతంగా గెలిచే అవకాశం లేకపోవడం, టీడీపీ, జనసేన ఓట్లు పక్కాగా బదిలీ జరగడంతో గత ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది ఏపీ బీజేపీ. ఆ పార్టీ చరిత్రలో ఏపీలో ఎప్పుడూ ఇంత సంఖ్యలో ప్రాతినిధ్యం లేకపోవడం కూడా గొప్ప విషయంగా చెబుతున్నారు. అయితే పొత్తు ధర్మం పేరుతో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లే కాకుండా ఏ నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన మూడు పార్టీ వారికి తగిన అవకాశాలు ఇవ్వాలనే ప్రతిపాదనను కూటమి పార్టీలు తూ.చ. తప్పకుండా పాటిస్తుండటంతో బీజేపీ నేతలు పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏపీలో కమలదళానికి పదవుల విషయంలో కూటమి సిద్ధంగా ఉన్నా, ఆ పార్టీ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే వారిని టెన్షన్ పెడుతోందని అంటున్నారు.

తాజాగా జరగనున్న రాజ్యసభ స్థానాన్ని కూటమి ప్రభుత్వం బీజేపీకి వదిలేసిందని చెబుతున్నారు. ఈ స్థానాన్ని ఏపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు ఆశించారని అంటున్నారు. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితోపాటు మరికొందరు నేతలు రాజ్యసభ వస్తుందని ఆశించారు. ఇప్పటికే ఆర్.క్రిష్ణయ్య రూపంలో ఒక స్థానాన్ని వదులుకున్న టీడీపీ.. మళ్లీ మరో స్థానాన్ని ఇవ్వడంపై పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి వస్తున్నా, ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు కోరుకుంటూ బీజేపీకే వదిలేసింది. దీంతో తమ ఎన్నిక లాంఛనమేనని ఏపీకి చెందిన కమలం నేతలు చాలా పగటి కలలు కన్నారు. నేడో రేపో తమ పేరు ప్రకటిస్తారని అభిమానుల వద్ద ప్రచారం చేసుకున్నారని కూడా చెబుతున్నారు. అయితే తాము ఒకటి తలిస్తే అధిష్టానం మరోలా తలచిందని తాజా ప్రచారంతో టెన్షన్ పడుతున్నారని అంటున్నారు.

ఏపీలో రాజ్యసభ స్థానాన్ని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు ఇవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయినా స్థానిక నేతలు మాత్రం తమ ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నారు. అయితే నామినేషన్లకు గడువు దగ్గరపడటంతో తాజాగా తమిళనాడుకు చెందిన అన్నామలైతో పాటు తెలంగాణకు చెందిన మంద క్రిష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. దీంతో ఏపీ బీజేపీ నేతలకు తలుపులు మూసుకుపోయినట్లు చెబుతున్నారు. ఏపీ నేతలుకన్నా, ఈ ముగ్గురి ఎంపిక పార్టీకి కలిసి వస్తుందని ఢిల్లీ పెద్దలు ఆశిస్తున్నారని అంటున్నారు. తమిళనాడు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్నామలై, తెలంగాణలో పార్టీ అవసరాల నిమిత్తం మంద క్రిష్ణ మాదిగల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో ఏపీ బీజేపీ నుంచి సమీప కాలంలో ఎవరికీ అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే ఒక రాజ్యసభ, మరో ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం, ఇప్పుడు ఇంకొక రాజ్యసభ స్థానాన్ని ఇవ్వనుండటంతో బీజేపీ నేతలకు దాదాపు పెద్దల సభ యోగం లేనట్లేనని టాక్ వినిపిస్తోంది. దీంతో ఆశావహులు పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News