సిలికాన్ వ్యాలీలో ఒక నిశ్శబ్ద నిష్క్రమణ.. మకాం మార్చేసిన జుకర్ బర్గ్

అమెరికా టెక్ సామ్రాజ్యానికి గుండెకాయ వంటి సిలికాన్ వ్యాలీలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది.;

Update: 2026-02-12 09:30 GMT

అమెరికా టెక్ సామ్రాజ్యానికి గుండెకాయ వంటి సిలికాన్ వ్యాలీలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోంది. అది ఆవిష్కరణల విప్లవం కాదు.. 'నిష్క్రమణ' విప్లవం. తాజాగా మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ తన నివాసాన్ని కాలిఫోర్నియా నుండి ఫ్లోరిడాకు మార్చడం కేవలం వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదు.. అది మారుతున్న అమెరికా ఆర్థిక ముఖచిత్రానికి నిదర్శనం.

- పన్నుల భారమా? స్వేచ్ఛా కోణమా?

కాలిఫోర్నియా రాష్ట్రం అత్యధిక ఆదాయపు పన్ను రేట్లకు దాదాపు 13.3% పెట్టింది పేరు. జుకర్‌బర్గ్ వంటి బిలియనీర్ల విషయానికి వస్తే వారి సంపదలో ఒక శాతం మార్పు కూడా వందల మిలియన్ల డాలర్ల వ్యత్యాసాన్ని చూపిస్తుంది. మరోవైపు ఫ్లోరిడాలో రాష్ట్ర ఆదాయపు పన్ను సున్నా. ఈ భారీ వ్యత్యాసమే సంపన్నులను 'సన్ షైన్ స్టేట్' వైపు పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే ఎలోన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి దిగ్గజాలు ఇదే బాటలో నడిచారు. ఇప్పుడు జుకర్‌బర్గ్ కూడా ఆ జాబితాలో చేరడం గమనార్హం.

- కాలిఫోర్నియాకు హెచ్చరిక గంట

ఈ పరిణామం కాలిఫోర్నియా ప్రభుత్వానికి ఒక స్పష్టమైన హెచ్చరిక. అగ్రశ్రేణి సంపన్నులు వెళ్లిపోవడం వల్ల రాష్ట్ర ఖజానాకు అందే పన్ను ఆదాయం భారీగా తగ్గుతుంది. కేవలం యజమానులే కాదు.. వారి వెంటే కంపెనీల ప్రధాన కార్యాలయాలు.. కీలక నిపుణులు కూడా తరలి వెళ్లే ప్రమాదం ఉంది. కఠినమైన నిబంధనలు.. పెరుగుతున్న జీవన వ్యయం వ్యాపార విస్తరణకు అడ్డంకిగా మారుతున్నాయి.

ఫ్లోరిడా.. కొత్త 'వ్యాపార స్వర్గం'

తక్కువ నియంత్రణలు, అనుకూలమైన రియల్ ఎస్టేట్ మార్కెట్, వ్యాపార అనుకూల విధానాలతో ఫ్లోరిడా కొత్త టెక్ హబ్‌గా అవతరిస్తోంది. ముఖ్యంగా మియామి, పామ్ బీచ్ ప్రాంతాలు బిలియనీర్ల కొత్త చిరునామాలుగా మారుతున్నాయి.

బిలియనీర్ల వలసను కేవలం "డబ్బు ఆదా" చేసుకునే ప్రయత్నంగా మాత్రమే చూడలేం. ఇది రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని సూచిస్తోంది. సంపన్నుల నుండి పన్నులు వసూలు చేయడం అవసరమే.. కానీ ఆ పన్నుల భారం వారు రాష్ట్రమే విడిచిపోయేలా ఉండకూడదు. మరిన్ని రాష్ట్రాలు ఫ్లోరిడా నమూనాను అనుసరిస్తే, భవిష్యత్తులో అమెరికా ఆర్థిక కేంద్రం పశ్చిమ తీరం నుండి తూర్పు తీరానికి పూర్తిగా మారే అవకాశం ఉంది.

Tags:    

Similar News