పాక్ కు బ్యాడ్ న్యూస్.. భారత్ వాయుసేన పొదిలో కీలక అస్త్రాలు!

గత కొంతకాలంగా భారత తన అస్త్రాలను బలోపేతం చేసునే దిశగా కీలక అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే.;

Update: 2026-02-12 10:01 GMT

గత కొంతకాలంగా భారత తన అస్త్రాలను బలోపేతం చేసునే దిశగా కీలక అడుగులు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రవేశపెట్టబడిన కేంద్ర వార్షిక బడ్జెట్ లోని కేటాయింపులు అందుకు తాజా ఉదాహరణ. ఈ క్రమంలో మరో కీలక అడుగు పడింది. ఇందులో భాగంగా... డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సుమారు రూ.3.25 లక్షల కోట్ల అంచనా వేసిన ఒప్పందంలో 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో గ్రీన్ సిగ్నల్ అందింది!

అవును... గత ఏడాది జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ కు వణుకు పుట్టించిన, నేరుగా ఇస్లామాబాద్ ను తాకినట్లు చెబుతోన్న రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా... రూ.3.25 లక్షల కోట్ల వ్యవయంతో 114 రాఫెల్ యుద్ధవిమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్ తో జరిగే ఈ అతిపెద్ద రక్షణ ఒప్పందనికి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించినట్లు తెలుస్తోంది.

దీంతో భారత రక్షణ రంగంలో ఇదో కీలక మైలురాయి అని అంటున్నారు. ఈ నేపథ్యంలో రానున్న ఈ 114 రాఫెల్ యుద్ధవిమానాలలో 88 సింగిల్ సీట్, 26 ట్విన్ సీట్ వేరియంట్లు భారత వాయుసేనలో విధులు నిర్వహించనున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ ఈ నెల 18న భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో... ఈ ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్థానికంగా తయారీ, అసెంబ్లీ వంటి వాటి కోసం ఫ్రాన్స్ కు చెందిన రాఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్ తోనూ భాగస్వామ్యం కుదరనుందని అంటున్నారు!

మరోవైపు... భారత నావికాదళం కోసం ఆరు దీర్ఘ శ్రేణి సముద్ర నిఘా విమానాలు, పీ-8ఐ కొనుగోలుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఇదే సమయంలో.. భారత వైమానిక దళం ఇప్పటికే 12.. పీ-8ఐ విమానాలను నడుపుతోంది. దీంతో.. ఈ ఆరు విమానాలను ఇప్పటికే ఉన్న పన్నెండింటితో జోడించనున్నారని అంటున్నారు. భారత్ - యూఎస్ మధ్య ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందం తర్వాత జరిగే ఈ మొదటి రక్షణ ఒప్పందం విలువ రూ.27,000 కోట్లుగా అంచనా వేయబడింది!

వాస్తవానికి భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రాఫెల్ యుద్ధ విమానాలు ఉండగా... ఈ తాజా డెలివరీలు అన్నీ పూర్తయిన తర్వాత... భరత వైమానిక దళ అమ్ములపొదిలో ఈ రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 150కి చేరుతుంది. ఇదే క్రమంలో భారత నౌకా దళం వద్ద ఉన్న 26 రాఫెల్-ఎం జెట్ లను కూడా కలుపుకుంటే.. మొత్తం ఇన్వెంటరీ 176కు చేరుకుంటుంది! ఇది భారత్ ముందు తోక జాడించే పాక్ కు కచ్చితంగా బ్యాడ్ న్యూసే!

కాగా... రాఫెల్ వివిధ పాత్రలకు అనుగుణంగా బహుళ వేరియంట్లలో ఉంటుంది. ఇందులో భాగంగా.. "రాఫెల్ - సి" అనేది వైమానిక ఆధిపత్యం, దాడి మిషన్ల కోసం ఆప్టిమైజ్ చేయబడిన సింగిల్ సీట్ ల్యాండ్ బేస్డ్ ఫైటర్ కాగా.. "రాఫెల్ - బి" అనేది ట్విన్ సీట్ల ల్యాండ్ బేస్డ్ వేరియంట్. ఇది రెండో సభ్యుడికి ఆవకాశం కల్పిస్తోంది. డీప్ స్ట్రైక్స్, న్యూక్లియర్ డిటరెన్స్ వంటి మిషన్లలో ఇది కీలక భూమిక పోషిస్తుంది. ఇక "రాఫెల్ - ఎం" అనేది నావికా వెర్షన్!

Tags:    

Similar News