హైడ్రా అనేది ఒక మహా యుద్ధం.. ఇందులో కొందరు బలి కాక తప్పదు : హైడ్రా రంగనాథ్

ఇప్పటివరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని, వాటి విలువ లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

Update: 2026-08-01 05:12 GMT

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో ప్రముఖ యూట్యూబర్ నిర్వహించిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువులు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా చర్యలపై ఒకవైపు ప్రశంసలు వస్తుండగా.. మరోవైపు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఇంటర్వ్యూలో హైడ్రా ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం, అక్రమ నిర్మాణాల తొలగింపులో అనుసరిస్తున్న విధానాలు, ప్రజల నుంచి వస్తున్న విమర్శలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అనేక కీలక అంశాలపై రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్‌లో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటివరకు వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి రక్షించామని, వాటి విలువ లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

అయితే ఇంటర్వ్యూలో యూట్యూబర్ అడిగిన కొన్ని ప్రశ్నలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోగా.. అదే పరిధిలో ఉన్న తెలంగాణ సెక్రటేరియట్ సహా ఇతర ప్రభుత్వ భవనాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణ శాసనసభ భవనం కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందనే వాదనను ప్రస్తావిస్తూ.. అలాంటి పరిస్థితిలో దానిపైనా చర్యలు తీసుకుంటారా? అని ప్రశ్నించగా రంగనాథ్ నేరుగా సమాధానం ఇవ్వకుండా, అలాంటి పరిస్థితులు వేరుగా ఉంటాయని మాత్రమే వ్యాఖ్యానించారు.

అదే సమయంలో అక్రమంగా భూములు విక్రయించిన వ్యక్తులపై కాకుండా వాటిని కొనుగోలు చేసి ఇళ్లు నిర్మించుకున్న వారిపైనే ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలపై కూడా రంగనాథ్ స్పందించారు. భూములను అక్రమంగా విక్రయించిన వారిపై కేసులు నమోదు చేశామని, వారి పాత్రపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. కేవలం ఇళ్లు కట్టుకున్న వారిపైనే చర్యలు తీసుకుంటున్నామన్న ఆరోపణలు పూర్తిగా నిజం కాదని పేర్కొన్నారు.

సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంశంపై కూడా ఆయన వివరణ ఇచ్చారు. 2014లో నిర్మాణం పూర్తైన తర్వాత ఆ భవనం విషయంలో కోర్టు స్టే కారణంగా చాలా సంవత్సరాలు కొనసాగిందని, అనంతరం హైడ్రా చర్యల్లో భాగంగా అక్రమ నిర్మాణాన్ని తొలగించామని తెలిపారు.

నాలాలు, చెరువులు, జలవనరుల పరిరక్షణ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కొన్ని సందర్భాల్లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకునే అధికారం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు. ఆక్రమణల తొలగింపు సమయంలో రాజకీయ, సామాజిక ఒత్తిడులు ఎదురైనా చట్టబద్ధంగా విధులు నిర్వర్తించామని చెప్పారు.

‘‘హైడ్రా అనేది ఒక మహా యుద్ధం అనేది.. ఈ యుద్ధంలో కొంతమంది తప్పకుండా బలి అవుతారు. వాళ్లందరికీ సారీ చెప్పాల్సిందే.. కొన్ని కావాలంటే కొందరికి నష్టం తప్పుదు’’ అంటూ హైడ్రా కమిషనర్ ఈ కూల్చివేతల వివాదాలపై వివరణ ఇచ్చారు.

మొత్తానికి ఈ ఇంటర్వ్యూలో అడిగిన నేరుగా ప్రశ్నలు, వాటికి రంగనాథ్ ఇచ్చిన సమాధానాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. హైడ్రా పనితీరు, అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలపై ఈ ఇంటర్వ్యూ మరోసారి ప్రజల్లో చర్చను రేకెత్తించింది. కొందరు హైడ్రా చర్యలను సమర్థిస్తుండగా.. మరికొందరు ఎంపిక చేసిన లక్ష్యాలపైనే చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇంటర్వ్యూ తెలంగాణ రాజకీయ, పరిపాలనా వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News