"తగ్గేదేలే" అంటున్న అంబటి : పుష్ప స్టైల్లో ఘాటు రిప్లై, వీడియో వైరల్

పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలు తెచ్చుకున్న మాజీ మంత్రి అంబటి గురువారం రాజమండ్రి జైలు నుంచి విడుదల కావాల్సివుంది.;

Update: 2026-02-12 09:04 GMT

వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు తగ్గేదేలే అంటున్నారు. గురువారం జైలు నుంచి విడుదల కావాల్సివుండగా, పోలీసులు మరో పీటీ వారెంటు దాఖలు చేసి సత్తెనపల్లి కోర్టుకు తరలించారు. రాజమండ్రి జైలు నుంచి సత్తెనపల్లి కోర్టుకు వచ్చిన మాజీ మంత్రి అంబటి కోర్టు ఆవరణలో బస్సు నుంచి పుష్ప స్టైల్ లో స్పందించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంబటి కోసం వైసీపీ కార్యకర్తలు జైలు ఆవరణలో వేచివుండగా, పోలీసు బస్సులో కోర్టుకు వచ్చిన అంబటి కార్యకర్తలను చూసి చేతులు ఊపి తాను ధైర్యంగా ఉన్నానని సంకేతాలిచ్చారు. అంతేకాకుండా పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటానని చెప్పేందుకు ఫుష్ఫ సినిమా మేనరిజాన్ని ప్రదర్శించారని అంటున్నారు.

పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిలు తెచ్చుకున్న మాజీ మంత్రి అంబటి గురువారం రాజమండ్రి జైలు నుంచి విడుదల కావాల్సివుంది. అయితే 2023లో సత్తెనపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో పీటీ వారెంటు జారీ చేయడంతో అంబటి విడుదల వాయిదా పడింది. ఈ నెల 22లోపు ఎప్పుడైనా ఆయనను కోర్టులో హాజరుపరచాలని సత్తెనపల్లి కోర్టు బుధవారం పోలీసులకు సూచించింది. అయితే అంబటికి రెండు కేసుల్లో బెయిలు రావడంతో గురువారం విడుదల చేయాల్సివుంది. కానీ, సత్తెనపల్లి కోర్టు జారీ చేసిన వారెంటుతో పోలీసులు గురువారం ఉదయం బెయిలు పేపర్లు దాఖలుకు ముందే జైలులో అదుపులోకి తీసుకుని సత్తెనపల్లి తరలించారు.

ఇక సత్తెనపల్లి కోర్టు ఆవరణలో అంబటి ప్రదర్శించిన తీరు చర్చనీయాంశంగా మారింది. పుష్ప సినిమా మేనరిజంతో అభిమానులకు ధైర్యం చెప్పారు అంబటి. తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా ఫర్వాలేదన్నట్లు ఆయన సంకేతాలిచ్చారని అంటున్నారు. మాజీ మంత్రి అంబటిపై మొత్తం 52 కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 కేసులు నమోదు చేశారు. ఇవన్నీ జనవరి 31 నుంచి ఏడు రోజుల వ్యవధిలో నమోదు చేసినవే. ఇదే కేసులో గుంటూరులోని నల్లపాడు పోలీసులు అంబటిని అరెస్టు చేశారు. మిగిలిన కేసులలో 41ఏ నోటీసు జారీ చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది.

ఇక మిగిలిన కేసుల్లో అంబటిపై పీటీ వారెంట్లు జారీ చేస్తూ ఆయనను జైలు నుంచి విడుదల కాకుండా అడ్డుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే రెండు కేసుల్లో ఆయనకు బెయిలు మంజూరైంది. తాజాగా సత్తెనపల్లి కోర్టులో ఇంకో వారెంటుపై హాజరుపరిచారు. ఈ కేసులో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు అంబటిని ఇప్పట్లో బయటకు వదలకుండా ఆయనపై పెండింగులో ఉన్న అన్ని కేసుల్లో పీటీ వారెంట్లు జారీ చేయాలనే వ్యూహంతో ప్రభుత్వం పనిచేస్తోందని అంటున్నారు. అయితే ఈ కేసుల వేటను ఎదుర్కోడానికి తాను సిద్ధమని అంబటి సంకేతాలు పంపుతున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి అంబటి వర్సెస్ పోలీసుల ఎపిసోడ్ కు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాల్సివుంది.



Tags:    

Similar News