''పార్టీ లేకపోతే నువ్వు జీరో" ఎమ్మెల్యే కొలికిపూడికి ఫైనల్ వార్నింగ్.. సీఎం సీరియస్!

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.;

Update: 2026-02-12 08:49 GMT

తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద వైఖరితో పార్టీకి తలనొప్పులు తెస్తున్న ఎమ్మెల్యే కొలికపూడి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. ఇదే ఆఖరి అవకాశమని తీరు మార్చుకోకపోతే వేటు తప్పదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ద్వారా ఎమ్మెల్యే కొలికపూడికి క్లాస్ పీకినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం అసెంబ్లీ లాబీల్లో ఈ అంశంపైనే హాట్ డిబేట్ నడుస్తోంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను విమర్శిస్తూ పరోక్షంగా తన వాట్సాప్ స్టేటస్ లో కామెంట్లు పెట్టారని కొలికపూడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు.

అసెంబ్లీ లాబీలో తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్‌తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం ‘పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ కొలికపూడి వాట్సాప్ స్టేటస్ పెట్టడంపై టీడీపీ కార్యకర్తలలో కలకలం రేగింది. ఎప్పటికప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలపై విమర్శలతో విరుచుకుపడే ఎమ్మెల్యే కొలికపూడి.. ఈ సారి పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబునే టార్గెట్ చేసినట్లు చెబుతున్నారు. ఆయన వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్లను తీసి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని అంటున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని పార్టీ క్రమశిక్షణ సంఘం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఫార్సు చేసింది. ఎమ్మెల్యేగా గెలిచిన 20 నెలల్లో మూడు నాలుగు సార్లు పార్టీ అంతర్గత విచారణ ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే కొలికపూడి. ఆయన వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే ఆయన విషయంలో అధినేత చంద్రబాబు కాస్త మెతక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు కొలికపూడి నేరుగా చంద్రబాబునే టార్గెట్ చేయడంతో అధిష్టానం సీరియస్ అయిందని అంటున్నారు.

రెండు రోజుల క్రితం కొలికపూడి పెట్టిన వాట్సాప్ స్టేటస్ పార్టీ పరువును తీసేదిగా ఉందని ఫిర్యాదులు రావడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని అంటున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యేతో మాట్లాడి ఫైనల్ వార్నింగ్ ఇవ్వాలని సీఎం సూచించినట్లు సమాచారం. ఇక సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అసెంబ్లీలో ఎమ్మెల్యే కొలికిపూడితో మాట్లాడి తీవ్ర హెచ్చరికలు జారీచేశారని అంటున్నారు. పార్టీ లేకపోతే వ్యక్తిగతంగా జీరో అనే విషయం గుర్తించి ప్రవర్తించాలని ఎమ్మెల్యే కొలికపూడికి హితవు పలికినట్లు చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరని, తప్పులు చేసుకుంటూ పోతే పార్టీ కూడా ఎమ్మెల్యేగా గుర్తించటం మానేస్తుందని ఎమ్మెల్యే కొలికపూడిని అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారని చెబుతున్నారు.

అయితే అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చెప్పిన అన్ని అంశాలను విన్న ఎమ్మెల్యే కొలికపూడి తన వాట్సాప్ స్టేటస్ పై వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అనుభవరాహిత్యంతోనే పొరపాట్లు జరుగుతున్నాయని, ఇకపై సరిదిద్దుకుంటానని కొలికపూడి చెప్పినట్లు సమాచారం. పార్టీలో సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కొలికిపూడి కోరారని అంటున్నారు. అయితే ఎమ్మెల్యే కొలికపూడి వివరణపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాల్సివుంది. ఇప్పటికే కొలికపూడికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఇక ఆయనను ఉపేక్షించొద్దని సొంత నియోజకవర్గం తిరువూరుకు చెందిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు.

Tags:    

Similar News