రూ.300 పెట్టి కొంటే రూ.634 కోట్లు వచ్చాయి.. ఇది లాటరీ కాదు బాస్!
తాజాగా చెప్పుకోబోయే వ్యక్తికి మాత్రం ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది అని చెప్పినా అతిశయోక్తి కాదేమో!;
సాధారణంగా ఎవరికైనా ఆర్థికంగా అన్నీ బాగా కలిసి వస్తుంటే.. ఉద్యోగం, వ్యాపారం, వివాహం అన్నింట్లోనూ శుభాలు జరుగుతుంటే అయినవాళ్లు సరదాగానో, కానివాళ్లు పుసుకోలుతనంతో "వీడికి అదృష్టం దరిద్రం పట్టినట్లు పట్టింది!" అని అంటుంటారు. మిగిలినవాళ్ల సంగతేమో కానీ.. తాజాగా చెప్పుకోబోయే వ్యక్తికి మాత్రం ఆ డైలాగ్ సరిగ్గా సరిపోతుంది అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! కారణం... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమాని అలా జరిగిపోయింది.
అవును... మలేషియాకు చెందిన టెక్ వ్యవస్థాపకుడు అర్స్యాన్ ఇస్మాయిల్ 10 ఏళ్ల వయసులో, 1993వ సంవత్సరంలో కేవలం 100 డాలర్లు (అప్పట్లో అది సుమారు రూ.300)కు “ఏఐ.కామ్” అనే డొమైన్ ను కొనుగోలు చేశారు. అయితే ప్రస్తుతం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కాలం కావడంతో ఆ “ఏఐ.కామ్” డొమైన్ ను 70 మిలియన్ డాలర్లు (అంటే సుమారు 634 కోట్ల రూపాయలకు “క్రిప్టో.కామ్” సీఈఓ క్రిస్ మార్స్ జాలెక్ కు విక్రయించారు. దీంతో.. ఇది ఇంటర్నెట్ ప్రపంచంలో సరికొత్త సంచలనంగా మారింది.
వాస్తవానికి ఈ డొమైన్ ను గత ఏడాది ఏప్రిల్ లోనే మార్స్ జాలెక్ కు పూర్తిగా క్రిప్టో కరెన్సీలో చెల్లించిన లావేదేవీలలో విక్రయించగా.. పలు నివేదికలు 70 మిలియన్ డాలర్ల సంఖ్యను ధృవీకరిస్తున్నాయి. దీంతో.. ఇప్పటివరకు అత్యంత ఖరీదైన బహిరంగంగా వెళ్లడించబడిన డొమైన్ నేమ్ అమ్మకం అని చెబుతున్నారు. అంతకంటే ముందు.. 2010లో కార్ ఇన్సూరెన్స్ డాట్ కామ్ అనే డొమైన్ ను కోసం 49.7 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు ఫిన్ టెక్ మలేషియా నివేదించింది.
కాగా... 1993లో ఆర్స్యాన్ ఇస్మాయిల్ తన తల్లి క్రెడిట్ కార్డును ఉపయోగించి ఈ ఏఐ.కామ్ డొమైన్ ను సొంతం చేసుకున్నాడు. అలా అని అప్పట్లోనే, ఆ వయసులోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అంచనా వేసేశాడా అనుకుంటే పొరబాటే! అతను ఈ డొమైన్ కొనడానికి కారణం అతని పేరు. ఇందులో మొదటి అక్షరాలతో సరిపోలినందుకే ఏ (ఆర్స్యాన్) ఐ (ఇస్మాయిల్) ను ఎంచుకున్నాడని మలేషియా మీడియా నివేదించింది. ఏది ఏమైనా.. ఇది సంచలనంగా మారింది.