ట్రంప్ కి షాకిచ్చిన అమెరికా హౌస్... పోస్టులు పట్టించుకోలేదా..!

అవును... అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అటు ప్రపంచదేశాలతో పాటు ప్రధానంగా కెనడాపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2026-02-12 11:30 GMT

తనదైన మార్కు నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు షాకులిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా యూఎస్ హౌస్ షాకిచ్చింది. ఇందులో భాగంగా.. కెనడియన్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలను రద్ధు చేయడానికి అనుకూలంగా అమెరికా ప్రతినిధుల సభ ఓటు వేసింది. గత ఏడాది కెనడాపై ట్రంప్ విధించిన సుంకాలను ముగించాలని కోరుకునే తీర్మానం 219 - 211తో గెలిచింది. ఈ క్రమంలో ఆరుగురు రిపబ్లికన్లు డెమోక్రాట్లతో చేరారని అంటున్నారు.

అవును... అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అటు ప్రపంచదేశాలతో పాటు ప్రధానంగా కెనడాపై ఎక్కువ కాన్సంట్రేషన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశంపై వరుస సుంకాలను విధించారు. ప్రధానంగా ఇటీవల చైనాతో కెనడా ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందానికి ప్రతిస్పందనగా 100% దిగుమతి సుంకంతో బెదిరించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో తాజా తీర్మానం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు హౌస్ లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ఇందులో భాగంగా... టారిఫ్స్ కి వ్యతిరేకంగా ఓటు వేసే ఏ రిపబ్లికన్ అయినా ఎన్నికల సమయంలో వచ్చే పరిణామాలను తీవ్రంగా ఎదుర్కొంటారు అని అన్నారు. ఇదే సమయంలో.. సుంకాలు మనకు ఆర్థిక భద్రతను అందిస్తాయని.. ఈ ప్రత్యేకమైన హక్కును నాశనం చేయడానికి ఏ రిపబ్లికన్ బాధ్యత వహించకూడదని మరో పోస్టులో నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా స్పందించిన డెమోక్రాట్ గ్రెగోరీ మీక్స్... మిత్రదేశాలపై సుంకాలను ట్రంప్ ఆయుధంగా మార్చారని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచారని.. ఈ సుంకాలే కెనడాతో అమెరికాకున్న సంబంధానికి హాని కలిగించాయని.. వారిని చైనాకు దగ్గర చేశాయని.. అవి అమెరికాలో ధరల పెరుగుదలకు కారణమయ్యాయని తెలిపారు. మరోవైపు.. తమ పోరాటం ఆగదంటూ ఓటింగ్ కు ముందు మరో డెమోక్రాట్ మీక్స్ అన్నారు.

వాస్తవానికి యూఎస్ హౌస్ లో రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీయే ఉన్నప్పటికీ.. ఈ తరహా నిర్ణయం వెలువడుతుందని చాలామంది భావించలేదని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఆరుగురు రిపబ్లికన్లు.. డెమోక్రాట్ల ఐక్య కూటమికి అనుకూలంగా ఓటు వేయడంతో.. ఈ తీర్మానం పాసైంది. తర్వాత.. ఈ బిల్లు ఇప్పుడు సెనేట్ కు వెళ్తుంది.. అక్కడ కూడా రిపబ్లికన్లు మెజారిటీ కలిగి ఉన్నారు!!

కాగా... హౌస్ తీర్మానం పాస్ చేసినా, సెనేట్ అంగీకరించినా.. ట్రంప్ సంతకం లేకుండా ఇది చట్టంగా మారదు.. ప్రెసిడెంట్ ఆమోదం తప్పనిసరి. దీంతో... తన సుంకాల ఎజెండాను రద్దు చేయమని పిలుపునిచ్చే ఏ బిల్లునైనా ట్రంప్ వీటో చేయడం దాదాపు ఖాయమే! ఫలితంగా ఇది ఎప్పటికీ చట్టంగా మారే అవకాశం లేదు! కాకపోతే.. మధ్యంతర ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ తరహా ఫలితాలు, సభ్యుల నిర్ణయాలు ఆసక్తిగా మారాయి!

Tags:    

Similar News