జనసేనకు అతి పెద్ద మద్దతు వారే !
ఏపీలో జనసేన రాజకీయంగా నానాటికీ బలపడుతోంది. జనసేన చుట్టూ అల్లుకుంటున్న వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి.
ఏపీలో జనసేన రాజకీయంగా నానాటికీ బలపడుతోంది. జనసేన చుట్టూ అల్లుకుంటున్న వర్గాలు కూడా గట్టిగానే ఉన్నాయి. పవన్ కి ఉన్న రాజకీయ నిబద్ధత, సిద్ధాంతాల పట్ల అంకితభావం వారిలోనూ అధికంగా కనిపిస్తోంది. ఏదో నాటికి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయి తీరుతారు అన్నది పవన్ ని జనసేనను నమ్మిన వారిలో వేయి రెట్లు కనిపిస్తోంది. వారు ఏ వాదనకూ తగ్గిపోవడం లేదు, ఏ విధంగానూ కృంగిపోవడం లేదు, పవన్ ఏమి చేసినా అందులో సరైన వ్యూహమే ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. దాంతో జనసేన క్రమంగా ఏపీ రాజకీయాల్లో విస్తరించుకుంటూ పోతోంది.
బలమైన వర్గంలో :
ఇదిలా ఉంటే ఏపీలో దాదాపుగా పాతిక శాతం దాకా జనాభా ఉన్న బలమైన సామాజిక వర్గం ఉంది. ఈ సామాజిక వర్గం తలచుకుంటే రాజకీయ తరాజు అటూ ఇటూ ఊగుతూ ఉంటుంది. అలా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి ఈ వర్గం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పుతూ వస్తోంది. ఇక 1982లో టీడీపీ ఏర్పాటు అయ్యాక రెండు పార్టీల వ్యవస్థ వచ్చాక ఈ సామాజిక వర్గం అత్యంత నిర్ణయాత్మకమైన శక్తిగా మారింది. ప్రతీ ఎన్నికల్లోనూ తన తీర్పు ద్వారా విలక్షణతను చాటుకుంటోంది. అలాంటిది ఈ వర్గం పెట్టిన కాల పరీక్షలో నెగ్గిన జనసేన అతి పెద్ద జనాభాకు ఒక ఆలంబనగా మారుతోంది అని విశ్లేషిస్తున్నారు.
మెజారిటీ జనసేనకే :
కాపులలో మెజారిటీ ఈ రోజుకీ జనసేనకే జై కొడుతున్నారని అంటున్నారు. అందులో కూడా యువత అయితే అత్యధిక శాతం ఉంటే నడి వయసు వారు సగం పైగా ఉన్నారు. ఇక పెద్ద తరం మాత్రం భిన్నంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ప్రతీ ఎన్నికల్లోనూ కోత్త ఓట్లు యూత్ కీలకం కాబట్టి జనసేన మద్దతు అంతకంతకు పెరుగుతోంది అనడానికి ఇదే ప్రాతిపదిక అని అంటున్నారు. దాంతోనే జనసేన ధీమాగా ఉంది అని అంటున్నారు. తమ బలం గతానికి ఇప్పటికీ పెరిగింది అని జనసేన చెప్పుకోవడం వెనక ఈ ధీమా ఉందని అంటున్నారు.
అదనపు మద్దతుగా :
ఇక కేవలం కులం అండతోనే జనసేన ఉంది అనుకుంటే పొరపాటు. కులం దాటి మరీ యువత జనసేన పట్ల ఆకర్షితులు అయి ఉన్నారు. అలాంటి యూత్ లో కూడా జనసేన బలం మెల్లగా పెరుగుతోంది. అన్ని రకాల వర్గాలు ఉన్న యువతలో జనసేనకు ప్రాధాన్యత అధికం అవుతోంది అని అంటున్నారు. ఈ విషయంలో మిగిలిన పార్టీల కంటే జనసేన ముందు ఉంది అని అంటున్నారు. ఏపీలో మహిళల విషయంలో కూడా ఓటింగ్ కీలకంగా ఉంటుంది. వారి తీర్పు కూడా ఎంతో ముఖ్యంగా ఉంటుంది. ఈ మహిళా విభాగంలో కూడా యువతరం నడి వయసు వారు అంతా జనసేన పట్ల మక్కువ చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇలా చూస్తే కనుక జనసేనకు సామాజిక వర్గం ఒక ప్రధాన ఓటు షేర్ గా ఉంటే యువత మహిళ కూడా అదనపు బలంగా కనిపిస్తున్నారు. వీరంతా పోలరైజ్ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది.
ఇది అడ్వాంటేజ్ గా :
ఇక ఏపీలో తటస్థులు కానీ విద్యావంతులు మేధావులు ఇలా విభిన్న వర్గాలలో చూస్తే జనసేన కొత్త పార్టీగా ఉంది. ఏపీలో ఇప్పటిదాకా పాలించని పార్టీగా చూస్తున్నారు. అందువల్ల ఆ పార్టీకి ఒక్క చాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించే వారు పెరగడం కూడా జనసేనకు మరింత అడ్వాంటేజ్ గా మారబోతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో ఏపీలో జనసేన విస్తరణ అన్నది చాప కింద నీరుగా జరిగిపోతోంది. ఆ పార్టీ వ్యూహాలు తీసుకునే నిర్ణయాలు బట్టే జనసేన భవిష్యత్తు ఎంత బలంగా ఉండేది ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.