చిన్న శ్రీను వియ్యంకుడు అడుగులు ఎటు వైపు ?

విజయనగరం వైసీపీ రాజకీయాలు ప్రస్తుతం గరం గరంగా మారాయి. చిన్న శ్రీను సరిగ్గా వారం క్రితం రేపిన కలకలం ఇంకా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది.

Update: 2026-09-14 03:27 GMT

విజయనగరం వైసీపీ రాజకీయాలు ప్రస్తుతం గరం గరంగా మారాయి. చిన్న శ్రీను సరిగ్గా వారం క్రితం రేపిన కలకలం ఇంకా పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. చిన్న శ్రీను వైసీపీలో 11 ఏళ్ళుగా పనిచేస్తూ జిల్లా మొత్తం సింగిల్ హ్యాండ్ తో లీడ్ చేసిన నేత కావడం విశేషం. అందుకే అంతగా వైసీపీలో కలవరం రేగుతోంది. ఇక చిన్న శ్రీనుకి ఆల్టర్నేషన్ ఎవరు అన్నది కూడా పెద్ద చర్చ సాగింది. అయితే చిన్న శ్రీను ఇలా పార్టీని వీడగానే అలా వైసీపీ హడావుడిగా మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ని విజయనగరం జిల్లా అధ్యక్షుడిని చేసింది. ఒక విధంగా చాలా చురుకుగానే వైసీపీ రియాక్ట్ అయింది అని అంటున్నారు.

పెద్ద బాధ్యతతోనే :

ఇక బెల్లాన చంద్రశేఖర్ కి ఈ క్లిష్ట సమయంలో పెద్ద బాధ్యతనే పార్టీ పెట్టింది అని అంటున్నారు. జిల్లా వైసీపీలో చిన్న శ్రీను పార్టీని వీడడం మీద మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. ఆయన వల్ల పార్టీకి ఏ మేరకు నష్టం అంటే ఇదమిద్దంగా ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. దే సమయంలో చిన్న శ్రీనుతో కలిసి తిరిగిన నాయకులు అంతా ఇపుడు అయోమయంలో పడుతున్నారు. తాము ఏ వైపు ఉండాలో తేల్చుకోలేని పరిస్థితి ఉంది. ఇక వైసీపీలో తమకు పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారు అన్నది కూడా వారికి సందేహంగా ఉంది. అలాగే వైసీపీలో ఉండాలని ఉంది, చిన్న శ్రీను నాయకత్వం కావాలని ఉంది. ఈ నేపధ్యంలో బెల్లాన చంద్రశేఖర్ కి బాధ్యతలు అప్పగించడం వల్ల అందరినీ ఒకే త్రాటి పైకి తేవడం ఆయనకు కత్తి మీద సవాల్ అవుతుందని అంటున్నారు

బడ్డుకొండకు రూట్ క్లియర్ :

ఇక చిన్న శ్రీను వియ్యంకుడు అయిన నెల్లిమర్ల వైసీపీ ఇంచార్జి బడ్డుకొండ అప్పలనాయుడుని ఆ బాధ్యతల నుంచి అధినాయకత్వం తప్పించి ఆయన ప్లేస్ లో ఒక జెడ్పీటీసీ గా ఉన్న సన్యాసినాయుడు కు పట్టం కట్టింది. దాంతో బడ్డుకొండ ఫ్యూచర్ ఏమిటి అన్నది చర్చకు వస్తోంది. నిజానికి ఆయన వైసీపీలో ఉండాలని అనుకుంటున్నారు. ఎందుకంటే టీడీపీలోకి వెళ్ళింది చిన్న శ్రీను మాత్రమే అని అంటున్నారు. ఆయనకు అక్కడ పరిస్థితి ఏమిటో చూసిన తరువాతనే తన తరువాత అడుగులు ఆయన వేస్తారు అని అంటున్నారు. అయితే వైసీపీ అలెర్ట్ అయి ఆ చాన్స్ ఆయనకు ఇవ్వలేదు, ముందే ఆయన డెసిషన్ ని తీసుకోవాల్సిన అనివార్యతను కల్పించింది.

టీడీపీతోనే అంటూ :

ఇక బడ్డుకొండ రాజకీయ జీవితం టీడీపీతోనే అన్న మాట కూడా వినిపిస్తోంది. సొంత వియ్యంకుడు అయిన చిన్న శ్రీను బాటలోనే ఆయన నడుస్తారు అని అంటున్నారు. వైసీపీలో సామాన్య కార్యకర్తగా ఉండడం కంటే టీడీపీలో చేరి కూటమిలో తానూ భాగస్వామ్యం కావడం తన కుమారుడు ప్రదీప్ రాజకీయ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడం ఆయనకు ముందున్న మార్గాలు అని అంటున్నారు. అయితే నెల్లిమర్లలో బడ్డుకొండ కూటమిలో చేరినా పెద్దగా ప్రయోజనం అయితే లేదని అంటున్నారు. అక్కడ టీడీపీ ఇంచార్జ్ గా సీనియర్ నేత కర్రోతు బంగారు రాజు ఉన్నారు. అలాగే జనసేన తరఫున ఎమ్మెల్యే లోకం మాధవి ఉన్నారు. రెండు పార్టీలూ గట్టిగా ఉన్నాయి. కావాల్సినంత నాయకత్వం ఆ పార్టీలలోనే ఉంది. దాంతో ఆయన టీడీపీలోకి వెళ్తే ఏమిటి ప్రయోజనం అన్నది కూడా పెద్ద చర్చగా వస్తోంది. కానీ వైసీపీలో ఉండడం ఇపుడు ఆయనకు ఇబ్బందికరమే అని అంటున్నారు. దాంతో ఆయన అడుగులు ఎటు వైపు అన్న చర్చ గట్టిగానే జిల్లా రాజకీయాల్లో సాగుతోంది.

Tags:    

Similar News