2 ఖండాలు 14 దేశాలు 48000 కి.మీలు.. ప్ర‌పంచంలో అత్యంత పొడ‌వైన ర‌హ‌దారి ఇదే!

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా ప్రసిద్ధి చెందిన `పాన్-అమెరికన్ హైవే` రెండు ఖండాలను కలుపుతూ సాగే అద్భుతమైన రోడ్డు నెట్‌వర్క్.

Update: 2026-09-13 22:30 GMT

ప్రపంచంలోనే అత్యంత పొడవైన రహదారిగా ప్రసిద్ధి చెందిన `పాన్-అమెరికన్ హైవే` రెండు ఖండాలను కలుపుతూ సాగే అద్భుతమైన రోడ్డు నెట్‌వర్క్. ఉత్తర అమెరికాలోని అత్యంత ఉత్తర ప్రాంతమైన అలాస్కాలోని ప్రుధో బే నుండి ప్రారంభమై.. దక్షిణ అమెరికాలోని అత్యంత దక్షిణ అంచున ఉన్న అర్జెంటీనాలోని ఉషువాయా నగరం వరకు ఈ రహదారి విస్తరించి ఉంది. సుమారు 30,000 నుండి 48,000 కిలోమీటర్ల మేర సాగే ఈ భారీ రహదారి సుమారు 14 దేశాల గుండా ప్రయాణిస్తూ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది.

ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆర్కిటిక్ టండ్రా, ఎడారులు, ఆండీస్ పర్వత శ్రేణులు.. దట్టమైన ఉష్ణమండల వర్షారణ్యాలు వంటి వైవిధ్యమైన భౌగోళిక ప్రాంతాలు ఎదురవుతాయి. గంటకు 60 మైళ్ల స్థిరమైన వేగంతో ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తే కేవలం రెండు వారాల్లోనే (సుమారు 316 గంటలు) ఈ ప్రయాణం పూర్తి చేయవచ్చని సైద్ధాంతికంగా లెక్కగట్టినా వాస్తవంలో ఇది అసాధ్యం. పర్వతాలు, నగరాలు, వేగంలో లిమిటేష‌న్స్, ఆహారం తినే స‌మ‌యం- విశ్రాంతి అవసరాల కారణంగా ఈ ప్రయాణం పూర్తి చేయడానికి చాలా నెలల సమయమే పడుతుంది.

ఈ హైవే ప్రయాణంలో అత్యంత సవాల్‌తో కూడిన అడ్డంకి `డేరియన్ గ్యాప్`. పనామా -కొలంబియా మధ్య ఉన్న ఈ 100 నుండి 160 కిలోమీటర్ల దట్టమైన అటవీ ప్రాంతంలో ఎలాంటి తారు రోడ్డు ఉండదు. కేవలం బురద మార్గాలు, ప్రమాదకరమైన అడవి మాత్రమే ఉండే ఈ ప్రాంతాన్ని కార్లలో దాటడం అసాధ్యం. దీంతో సాహసికులు తమ వాహనాలను పక్కన పెట్టి.. సముద్ర మార్గంలో బోట్లు లేదా విమానాల ద్వారా ఈ అడ్డంకిని దాటి ఆ తర్వాత తమ ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. బోట్ లో త‌మ వాహ‌నాల‌ను కూడా తీసుకుని వెళుతుంటారు కొంద‌రు.

ఇలాంటి ఎన్నో సవాళ్లు, అడ్డంకులు ఎదురైనప్పటికీ సాహస యాత్రికులకు పాన్-అమెరికన్ హైవే అనేది ఒక జీవితకాలపు అద్భుతమైన అనుభవం. రెండు ఖండాల సంస్కృతులు, సరిహద్దులు, ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళారా చూసే అవకాశం ఈ రోడ్డు ప్రయాణం ద్వారా కలుగుతుంది. డ్రైవింగ్ ప్రియులకు ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్ లాంటిది. అయితే ఈ ప్రయాణం చేసే వారు ముందుగానే ప్లాన్ చేసుకుని.. డేరియన్ గ్యాప్ దాటేందుకు అవసరమైన షిప్పింగ్ ఏర్పాట్లు .. సరైన సీజన్‌ను ఎంచుకోవడం ఎంతో ముఖ్యం. ద‌ట్ట‌మైన అడ‌వుల గుండా ప్ర‌యాణించేందుకు సుర‌క్షిత‌మైన ఏర్పాట్లు కూడా చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News