గణనాధా...నిమజ్జనం సంగతేంటి స్వామీ ?
స్వామి వస్తే సంబరాలు అంబరాన్ని దాటాల్సిందే. అసలే వేడుకలు అంటే వినయకుడికి మహా ప్రీతి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్భాటాలు అన్నీ కూడా మండపం చుట్టూ ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.
జన నాధుడు గణ నాధుడు భువి నుంచి దివికి వస్తున్నాడు. తన మాతా పితలు పార్వతి దేవి మహా శివుని ఆశీస్సులు తీసుకుని భూగోళానికి పయనం అయ్యాడు. భూతలం మీద తన కోసం వేచి ఉన్న భక్త కోటిని తరింపచేయడానికి వినాయకుడు ఆఘమేఘాల మీద తన ఎలుక వాహనం ఎక్కి మరీ వేగంగానే వచ్చేస్తున్నాడు. ఇక భూతలం మీద స్వామి వారికి సకల సపర్యలు చేసేందుకు భక్తులు సర్వం సిద్ధం చేసుకుంటూ తీరిక లేకుండా ఉన్నారు. స్వామి వారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ తయారీ కూడా జోరుగా సాగుతోంది. అలాగే స్వామి వారికి ఇష్టమైన పత్రిని సమకూర్చుకుంటున్నారు. స్వామి వారిని కొలువు తీర్చేందుకు బ్రహ్మాండమైన వేదికను నిర్మిస్తూ అందులో అలంకరణ సామగ్రిని కూడా సిద్ధం చేస్తున్నారు. భాద్రపద మాసం శుక్ల పక్ష చవితి ఘడియలలో స్వామి ప్రతీ గణపతి మండపంలో పూర్తి భక్తిప్రపూరితమైన వాతావరణంలో కొలువు తీరడమే ఆలస్యం అన్నట్లు అంతా సిద్ధం అయిపోయింది.
తొమ్మిది రోజులూ ఇక్కడే :
స్వామి వస్తే సంబరాలు అంబరాన్ని దాటాల్సిందే. అసలే వేడుకలు అంటే వినయకుడికి మహా ప్రీతి. సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్భాటాలు అన్నీ కూడా మండపం చుట్టూ ఏర్పాటుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ దీపాలంకరణ కూడా చెప్పనక్కరలేదు, నిజానికి అలంకార ప్రియుడు అని ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని అంతా అంటారు, కానీ వినాయక మండపాలు చూస్తే కనుక గణేషుడి వైభవానికి వైభోగానికి సరి సాటి ఎవరు అన్న మాట తప్పకుండా వస్తుంది, కేవలం తొమ్మిది రోజుల కోసం చేసే ఏర్పాట్లు అక్కడి వేదికలకు సమకూర్చే డిజైన్లు ఇవన్నీ చూస్తూంటే రెండు కళ్ళూ చాలవు అన్నది నిజం. ఇంతలా గణనాథుడి ఆగమనం కోసం భక్త కోటి సుస్వాగతం పలుకుతున్న సందర్భంలో అంతా ఒక్క విషయం మాత్రం మరచిపోయారు. అదే గణపతి నవ రాత్రుల తరువాత జల ప్రవేశానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామా లేదా అన్నది.
ఎటు చూసినా కటకట :
భూగోళంలో భారత దేశంలో ఇపుడు చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఉత్తర భారతంలో ఈశాన్య రాష్ట్రాలలో కొన్ని చోట్ల భారీ ఎత్తున వర్షాలు కురుస్తూ వరదలను తెచ్చిపెడుతున్నాయి. దాంతో అక్కడ గణనాథుడికి మండపాలు సైతం స్వామి కూర్చోకుండామే ముందే జలమయం అవుతున్న సన్నివేశం కనిపిస్తోంది. అంతలా ఆకాశం అక్కడ చిల్లు పడుతూంటే దక్షిణాదిన వేరే వాతావరణం ఉంది. ఇంకా చెప్పాలీ అంటే అన్నింటి కంటే ఆంధ్ర దేశం ఇంకా ప్రత్యేకంగా ఉంది. ఎల్ నినో భారత దేశంలో సగ భాగం ఆవరించి ఉన్నా దాని తీక్షణ దృక్కులు మాత్రం ఆంధ్ర దేశం మీదనే పెట్టినట్లుగా ఉంది. అందుకే వానలు పెద్దగా లేవు, నీటికి కటకట లాడుతున్న నేపథ్యం ఉంది. విశాఖ లాంటి నగరాలలో గొంతు ఎండిపోతోంది. అల్పపీడనం పుణ్యమాని ఒకటి రెండు రోజులు ఆ మాత్రం వానలు కురిసినా పాతాళానికి ఇంకిన భూగర్భ జలాలను వెలికి తీసే సత్తువ వాటికి లేదు. ఇక చెరువులు గుంటలు ఏర్లు అన్నీ కూడా ఎండిపోయిన నేపథ్యం ఉంది. దాంతో వినాయక చవితి వేళకు ఎంతో సందడిగా చేసుకోవాల్సిన వేడుకకు సర్వం సమాయత్తం అయినా నీరు లేని ప్రతీ ఊరు మాత్రం బావురుమంటోంది.
నిమజ్జమం పెద్ద పరీక్షగా :
సాధారణంగా వినాయకుడి నిమజ్జనం ఊళ్ళలో చెరువులలో చేస్తూంటారు. అది కూడా అద్భుతంగా జరుగుతుంది. మళ్ళీ ఏడాదికి వద్దువు గానీ అంత వరకూ గంగమ్మ ఒడిలో చల్లగా సేద తీరు అని భక్తులు స్వామిని ఎంతో ఆధ్యాత్మిక మనసు నిండా నింపుకుని సాగనంపుతారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి ఉందా అంటే ఎక్కడా కానరావడం లేదు, తాగేందుకు కూడా గుక్కెడు నీళ్ళకు అల్లాడుతున్న నేపధ్యంలో స్వామి వారి విగ్రహాల నిమజ్జనానికి ఎలా అన్నదే నిర్వాహకులను ముందుగా వేధిస్తున్న ప్రశ్న. ఇక పోటీలు పడి మరి పాతిక నుంచి యాభై డెబ్బై అడుగుల విగ్రఘాలను ప్రతీ చోటా ఏర్పాటు చేశాక కానీ అసలు విషయం ఎవరికీ బోధపడలేదు, ఇపుడు ఇంతటి నిలువెత్తు స్వామిని నిమజ్జనం ఎలా తండ్రీ అని అంతా తలలు పట్టుకుంటున్నారు.
తల్లి గంగమ్మను ఇలకు పంపి :
అయితే లోకాలు ఏలే స్వామి వారు కదా ఆయనకు అన్నీ తెలుసు అని కూడా భక్త కోటి సంతృప్తి పడుతోంది. స్వామి వస్తారు అనగానే అల్పపీడనంతో కొన్ని వానలు కురిసాయి. ఇదే తీరున వరుణుడు కరుణించి మరిన్ని వానలు నిండుగా కురిపిస్తే నవ రాత్రులూ పూర్తి అయ్యే నాటికి చెరువులు గుంటలూ ఎంతో కొంత నిండుతాయని ఆస్తిక జనులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భక్తితో కొలుస్తే స్వామి అన్నీ చూఉసుకుంటాడని తనకు నిమజ్జనానికి అవసరమైన నీరే కాదు భక్త జనులకు ప్రాణాధారం అయిన నీటిని కూడా సమృద్ధిగా సమకూరుస్తారు అని అంటున్నారు. ఈసారి వినాయకుడికి భక్తులు మొక్కేది ఒకే ఒక్క కోరికగా ఉంది. అదే వర్షాలు కురిపించి స్వామీ అని. పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ అన్నాడు మహా కవి శ్రీనాధుడు. అలా వినాయకా తల్లి గంగమ్మను ఇలకు పంపి సర్వం సుభిక్షం చేయమని అంతా ఒక్కటే మొక్కుతున్నారు.