గెలుపు భారాన్ని పెద్దల మీద పెట్టిన షర్మిల !
షర్మిల పీసీసీ చీఫ్ గా అయ్యాక సీనియర్ నేతలు అంతా పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు అని ప్రచారం సాగింది.
ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ని గెలిపించే బాధ్యతను ఆ భారాన్ని పార్టీలోని సీనియర్ నేతలకు పీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల అప్పగించారు. తాజాగా కమిటీలను కూడా దీనికి సంబంధించి నియమించారు. దానికి మానిటరింగ్ కమిటీ అని పేరు పెట్టారు. ఈ కమిటీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ఉనికి బలంగా చాటాలని షర్మిల వ్యూహ రచన చేశారు. ఇదిలా ఉంటే పంచాయతీల నుంచి కార్పోరేషన్ల దాకా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ ని తిరిగి పొందాలని ఆమె యోచిస్తున్నారు అని అంటున్నారు. ముఖ్యంగా పంచాయతీలలో హస్తం పార్టీ గుర్తు జనాలకు తెలుసు అని భావిస్తున్నారు. దాంతో గ్రామీణ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి ఇది సరైన తరుణం అని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
సీనియర్లు అంతా కమిటీలో :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు రాష్ట్ర కేంద్ర మంత్రులుగా పనిచేసిన వారిని తెచ్చి మానిటరింగ్ కమిటీని షర్మిల ఏర్పాటు చేశారు. వారిని అక్కడ కీలకం చేశారు. ఈ మానిటరింగ్ కమిటీకి చైర్మన్ గా సీనియర్ నాయకుడు మాజీ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డిని నియమించారు. అలాగే కన్వీనర్ గా కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కి స్థానం కల్పించారు. మానిటరింగ్ కమిటీ సభ్యులు పీసీసీ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, కిల్లి కృపారాణి అలాగే మస్తాన్ వలి తులసి రెడ్డి సిరివెళ్ల ప్రసాద్ గారె ఉషా నాయుడు వంటి వారితో ఏర్పాటు చేశారు.
సమిష్టిగానే ముందుకు :
షర్మిల పీసీసీ చీఫ్ గా అయ్యాక సీనియర్ నేతలు అంతా పార్టీకి కొంత దూరంగా ఉంటున్నారు అని ప్రచారం సాగింది. అలాగే ఆమె ఒంటరిగానే జనంలోకి వెళ్తున్నారు అని ఏకపక్ష విధానాలు అమలు అవుతున్నాయని కూడ విమర్శలు వినిపించాయి. అయితే ఇపుడు అలాంటి వాటికి తావు ఇవ్వకుండా సీనియర్ నేతలు అందరినీ కలుపుకుంటూ వారికే ముఖ్య బాధ్యతలను అప్పగించడం ద్వారా షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని అంటున్నారు. ఎంతో అనుభవం కలిగిన వారు వివిధ ప్రాంతాలు సామాజిక వర్గాలకు చెందిన వారు అంతా మానింటరింగ్ కమిటీలో ఉండడం వల్ల కాంగ్రెస్ కి ఎంతో కొంత బలం తెచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇప్పటికే జిల్లాల స్థాయిలో నియోజకవర్గాల స్థాయిలో కూడా అభ్యర్ధుల ఎంపిక విషయంలో పార్టీ చురుకుగానే ముందుకు అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
ఎక్కువ సీట్లలో గెలుపు :
ఇపుడు ఏపీలో ఉన్న పరిస్థితుల్లో అధికార కూటమి ఒక వైపు ఉంది. అలాగే విపక్షంలో వైసీపీ గట్టిగా ఉంది. అయినా సరే తమ ఓటు బ్యాంక్ తమకు ఉన్న అవకాశాలు అవకాశాలను చూసుకుంటూ క్షేత్ర స్థాయి నుంచి బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది. అందుకే కేంద్ర నాయకత్వం కూడా దిశా నిర్దేశం చేస్తోంది అని అంటున్నారు. అందుకే సమిష్టి నాయకత్వంతో ముందుకు సాగాలని కోరుతోందని అంటున్నారు. దానికి తగినట్లుగానే పీసీసీ చీఫ్ షర్మిల కూడా సీనియర్లతో ముందుకు అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. మరి కాంగ్రెస్ ఏపీలో స్థానిక ఎన్నికల్లో ఈ రకమైన కూర్పుతో ఏ విధమైన ఫలితాలను అందుకుంటుందో చూడాల్సి ఉంది.