'ఆటో డ్రైవర్ల సేవలో..' హైలెట్స్ ఇవే.. తెలుసా?
అయితే.. ఈ కార్యక్రమంలో అనేక సంచలనాలు కనిపించాయి. అవన్నీ.. సభకు వచ్చిన వారినే కాకుండా..లైవ్‌లో చూసిన వారిని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి.;
ఏపీలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన ఆటో డ్రైవర్ల సేవలో .. పథకాన్ని తాజాగా శనివారం ఉదయం సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అయితే.. ఈ కార్యక్రమంలో అనేక సంచలనాలు కనిపించాయి. అవన్నీ.. సభకు వచ్చిన వారినే కాకుండా..లైవ్‌లో చూసిన వారిని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాయి.
1) ఓజీ-ఓజీ నామస్మరణతో సభా వేదిక మార్మోగింది: సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురించి ఎక్కడ ప్రస్తావించినా.. సభకు వచ్చిన వారి నుంచి ఓజీ-ఓజీ అంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు వినిపించాయి.
2) ఓజీ సినిమా చూశారా? అంటూ.. సీఎం చంద్రబాబు ప్రశ్నించడంతో అందరూ.. ఔనంటూ.. పెద్ద పెట్టున నినదించారు. ఈ నినాదాల హోరుతో సభా ప్రాంగణం హోరెత్తడంతో సీఎం చంద్రబాబు మాటలు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఆయన రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయారు. అయినా.. అప్పటికీ ఓజీ నినాదాల జోరు తగ్గకపోవడం.. పవన్ స్వయంగా జోక్యం చేసుకుని.. చేయి గాల్లోకి ఎత్తడంతో అప్పుడు శాంతించారు.
3) వేదికపై ఉన్న నాయకులు, కార్మిక సంఘాల నేతలు, ఎమ్మెల్యే, ఎంపీ కూడా.. కాఖీదుస్తులనే ధరించారు. ఖాకీ దుస్తులు.. సేవకు గుర్తు అంటూ.. చంద్రబాబు వ్యాఖ్యానించడంతో ఆటో డ్రైవర్లు పొంగిపోయారు.
4) ఆటో డ్రైవర్ల సేవలో.. కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తూ.. సీఎం చంద్రబాబు ప్రారంభించగానే.. అందరి ఫోన్లలో టింగ్ టింగ్ అంటూ.. మెసేజ్‌లు మార్మోగాయి. దీనిని ప్రస్తావిస్తూ.. సీఎం చంద్రబాబు.. మీకు నిధులు వచ్చాయా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. సెల్ ఫోన్లు పైకెత్తి చూపించాలన్నారు. దీంతో సభలోని అందరూ.. సెల్ ఫోన్లు పైకెత్తి తమకు వచ్చిన సందేశాలను చూపించారు.
5) ఆటో డ్రైవర్లకు.. ప్రత్యేకంగా యాప్ ను తీసుకువస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ సమయంలోను.. తర్వాత.. ప్రత్యేకంగా వారి కోసం ఒక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు.. ఆటో డ్రైవర్లు.. తమ తమ సీట్లలో నుంచి పైకి లేచి చంద్రబాబుకు నమస్కారాలు చేయడంతోపాటు, రెండు వేళ్లు గాలిలోకి ఊపుతూ.. తమ సంతోషం వెలిబుచ్చారు.
6) పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నప్పుడు.. ఆసాంతం ఓజీ.. ఓజీ.. నినాదాలే వినిపించాయి.
7) మరోసారి వైసీపీకి అవకాశం ఇస్తారా? అని చంద్రబాబు ప్రశ్నించగానే.. ఇచ్చేది లేదంటూ.. చేతులను గాల్లో అడ్డంగా ఊపారు. అదేసమయంలో కూటమికి మీరు మద్దతు ఇస్తున్నారా? అంటే.. ఔనంటూ గాల్లోకి చేతులు ఊపారు. ఇలా.. అనేక విశేషాలు చోటు చేసుకున్నాయి.
8) ఓ మహిళా ఆటో డ్రైవర్ ప్రసంగిస్తూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. తమ కుటుంబానికి జరుగుతున్న మేలును తలుచుకుని కన్నీరు పెట్టుకున్నారు. సీఎం జోక్యం చేసుకుని.. ఇవి ఆనంద బాష్పాలు అంటూ.. ఆమెను నవ్వించే ప్రయత్నం చేశారు.