సీఎం రేవంత్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉద్య‌మ కేసుల ఎత్తివేత‌

24 గంట‌ల్లో ఆయా కేసుల వివ‌రాలు.. అప్ప‌టి ప‌రిస్థితి.. కేసుల తీవ్ర‌త‌, ఏయే సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారో సంపూర్ణ వివ‌రాల‌ను త‌మ‌కు పంపించాల‌ని డీజీపీ ఆదేశించారు;

Update: 2023-12-09 02:31 GMT

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యంతీసుకునే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని వేల మందిపై న‌మోదైన తెలంగాణ ఉద్య‌మ కేసుల‌ను గుండుగుత్త‌గా ఎత్తివేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏయే జిల్లాల్లో ఎన్నెన్ని కేసులుఉన్నాయి? ఏయే వ‌ర్గాల‌పై కేసులు న‌మోద‌య్యాయి? వీటిలో సీరియ‌స్ కేసులు ఎన్ని? వంటి స‌మ‌గ్ర వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఇవ్వాల‌ని రాష్ట్ర డీజీపీ ర‌వి గుప్తాను సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో డీజీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పీలు, క‌మిష‌నర్ల‌కు ఇదే సందేశం పంపించారు.

24 గంట‌ల్లో ఆయా కేసుల వివ‌రాలు.. అప్ప‌టి ప‌రిస్థితి.. కేసుల తీవ్ర‌త‌, ఏయే సెక్ష‌న్ల కింద కేసులు పెట్టారో సంపూర్ణ వివ‌రాల‌ను త‌మ‌కు పంపించాల‌ని డీజీపీ ఆదేశించారు. 2014 జూన్ రెండో తేదీ వరకు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న కేసుల వివరాలు అందజేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. 2009 మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి 2014 జూన్ రెండో తేదీ వరకు నమోదైన అన్ని కేసుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు.

దీంతో తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో న‌మోదైన కేసుల‌ను ఎత్తి వేయాల‌న్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంద‌ని అంటున్నారు. సీఎం రేవంత్ ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌ర్నాడే.. ప్ర‌జాభ‌వ‌న్‌లో ప్ర‌జా ద‌ర్బార్ నిర్వ‌హించ‌డం.. ఆ వెంట‌నే శ‌నివారం నుంచి మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌.. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌డం.. వంటి కీల‌క అంశాల దిశ‌గా రేవంత్ వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యం మ‌రింత‌గా తెలంగాణ స‌మాజాన్ని ఆక‌ట్టుకుంటుండ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు ఏంటంటే.. తెలంగాణను తీసుకువ‌చ్చాన‌ని, అనేక ఉద్య‌మాలు చేశాన‌ని.. చెప్పుకొన్న గ‌త ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని ప‌దేళ్లు పాలించినా.. ఉద్య‌మ కేసుల‌ను ఎత్తి వేయ‌డం కానీ.. ఉద్య‌మాల్లో పాల్గొన్న‌వారిని అభినందించ‌డం కానీ చేయ‌లేద‌ని.. ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News