లైకుల కోసం లొల్లి.. ప్రాణాలకు గండం!
ప్రస్తుతం సమాజంలో రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. లైకులు, షేర్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతూ యువత పెడదోవ పడుతోంది.;
ప్రస్తుతం సమాజంలో రీల్స్ పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. లైకులు, షేర్ల కోసం ప్రాణాలను పణంగా పెడుతూ యువత పెడదోవ పడుతోంది. దిల్లీలో మైనర్ బాలుడు రీల్ చేస్తూ సాహిల్ అనే యువకుడి ప్రాణాలు తీస్తే, యూపీలో ఒక తల్లి ఉరి వేసుకున్నట్లు నటిస్తూ తన నాలుగేళ్ల బిడ్డ ముందే శవమైంది. క్షణికానందం కోసం చేసే ఈ విన్యాసాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. అసలు ఈ రీల్స్ మాయలో పడి మనం ఏం కోల్పోతున్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అంటున్నారు నిపుణులు ..వివరాలలోకి వెళితే ..
లైకుల కోసం ,ప్రాణాలు గాలిలోకి:
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాలనే ఆరాటం అందరిలోనూ పెరిగిపోయింది. ముఖ్యంగా కుర్రాళ్లలో ఈ రీల్స్ మేనియా వెర్రితలలు వేస్తోంది. దిల్లీలో జరిగిన ఘటనే దీనికి నిదర్శనం. ఒక మైనర్ బాలుడు, తన సోదరి వీడియో తీస్తుండగా స్టైల్‌గా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న బైక్ ను బలంగా ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలో వాళ్ళు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న బాలుడికి లైసెన్స్ లేదు. రీల్స్ మోజులో పడి ఎదురు ఏముందో చూసుకోకుండా,మరోకరి ప్రాణం తీయటం ఎంత నేరం. కేవలం వ్యూస్ కోసం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, రన్నింగ్ బస్సుల్లో విన్యాసాలు చేయడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇలాంటి పనులు చేసేటప్పుడు మన ప్రాణాలే కాదు, ఎదుటివారి ప్రాణాలు కూడా పోతాయని ఆలోచించలేనంత గుడ్డిగా ఈ రీల్స్ మాయలో మునిగిపోతున్నారు.
నటన కాస్తా నిజమై.. చిన్నారి కళ్ల ముందే తల్లి విషాదం:
ఇక రీల్స్ వ్యామోహం ఎంత భయంకరంగా ఉందంటే, చివరకు చావుతో కూడా ఆటలాడుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన సంఘటన వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఉరి వేసుకున్నట్లు వీడియో తీసి పోస్ట్ చేయాలని ఆశపడిన ఓ మహిళ, తన నాలుగేళ్ల కూతురికే ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పింది. ఆ పసిపాప వీడియో తీస్తుండగా, తల్లి చీరతో ఉరి వేసుకున్నట్లు నటించే క్రమంలో నిజంగానే కాలు జారి ప్రాణాలు కోల్పోయింది. ఆ చిన్నారికి అది నటనో లేక నిజమో తెలియక ఏడుస్తూ ఉండిపోయింది. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలనే పిచ్చి, ఒక బిడ్డకు తల్లిని లేకుండా చేసింది. ఈ సంఘటనలు చూస్తుంటే మనం సాంకేతికంగా ముందుకు వెళ్తున్నామా లేక వివేకాన్ని కోల్పోతున్నామా అనిపిస్తుంది.
అవగాహన ముఖ్యం.. అప్రమత్తంగా ఉందాం:
నిజానికి సోషల్ మీడియా అనేది మన నైపుణ్యాన్ని చాటుకోవడానికి ఉండాలి కానీ, మన ప్రాణాలతో చెలగాటం ఆడటానికి కాదు. ప్రతి ఇంట్లో తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఎలాంటి వీడియోలు తీస్తున్నారో గమనించాలి. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రోత్సహించడం నేరమని గుర్తించాలి. క్షణికమైన పేరు కోసం, లైకుల కోసం ప్రాణాలను రిస్కులో పెట్టే పనులు మానుకోవాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటేనే ఇలాంటి దారుణాలను అరికట్టగలం. వీడియో తీయడం తప్పు కాదు, కానీ ఆ వీడియో మీ చివరి వీడియో కాకూడదని గుర్తుంచుకోండి. లైకులు మళ్ళీ వస్తాయి, కానీ ప్రాణాలు తిరిగిరావు అన్నది గుర్తు పెట్టుకోవాలి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.