రివేరా మరణం.. గదిలో బొమ్మ మాయం.. అన్నాబెల్లేపై భయానక చర్చ స్టార్ట్!

దీనిపై జూలై 16న పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసులు నివేదిక విడుదల చేశారు. ఇందులో... స్ట్రాబన్ టౌన్ షిప్ లోని హోటల్ లో రివేరా మృతదేహాన్ని తొలుత ఆ హోటల్ స్టాఫ్ గుర్తించినట్లు తెలిపారు.;

Update: 2025-07-22 03:00 GMT

అన్నాబెల్లె బొమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బొమ్మలో ఆత్మలు ఉంటాయని ప్రచారం ఉంది. ఎన్నో హర్రర్ సినిమాల్లో ఈ బొమ్మ ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తుంటుంది. ఈ సమయంలో తాజాగా మరోసారి ఈ బొమ్మ వార్తల్లో నిలిచింది. అందుకు కారణం... పారానార్మలిస్ట్ డాన్ రివేరా మరణించిన గదిలో నుంచి ఈ బొమ్మ మిస్ అయ్యిందని చెబుతున్నారు.

అవును... అమెరికన్ పారానార్మల్ పరిశోధకుడు డాన్ రివెరా మరణం చుట్టూ ఉన్న రహస్యం ఒక ఆసక్తికర మలుపు తిరిగింది. ఇందులో భాగంగా... అతను మరణించిన గదిలో అన్నాబెల్లె బొమ్మలేదని పెన్సిల్వేనియా అధికారులు నిర్ధారించారు. దీంతో... ఈ పారానార్మల్ విషయాలను నమ్మేవారి సమాజంలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై నెట్టింట చర్చలు మొదలయ్యాయి.

కనెక్టికట్‌ లోని న్యూ ఇంగ్లాండ్ సొసైటీ ఫర్ సైకిక్ రీసెర్చ్ (ఎన్.ఈ.ఎస్.పీ.ఆర్.)లో ప్రధాన పరిశోధకుడిగా ఉన్న 54 ఏళ్ల రివెరా.. అమెరికాలోని పెన్సిల్వేనియాలో గల గెట్టిస్‌ బర్గ్‌ లో డెవిల్స్ ఆన్ ది రన్ టూర్ కోసం అన్నాబెల్లెతో కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో జూలై 13 ఆదివారం ఉదయం ఆయన తన హోటల్ గదిలో చనిపోయి కనిపించాడు.

దీనిపై స్పందించిన ఆడమ్స్ కౌంటీ కరోనర్ ఫ్రాన్సిస్ డట్రో... ఆదివారం నాడు తాను సంఘటనా స్థలానికి చేరుకున్న సమయంలో అన్నాబెల్లె గదిలో లేదని చెప్పారు. ఆ బొమ్మ ఎప్పుడూ ఆయనతోనే ఉంటుందని అంటున్నారు. దీంతో... రివేరా మరణం, బొమ్మ మాయం.. అంశాలు పారానార్మల్‌ ను నమ్మేవారిని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి!

దీనిపై జూలై 16న పెన్సిల్వేనియా రాష్ట్ర పోలీసులు నివేదిక విడుదల చేశారు. ఇందులో... స్ట్రాబన్ టౌన్ షిప్ లోని హోటల్ లో రివేరా మృతదేహాన్ని తొలుత ఆ హోటల్ స్టాఫ్ గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో అసాధారణమైన లేదా అనుమానాస్పదమైన విషయాలు ఏమీ కనిపించలేదని తెలిపారు. పోస్టుమార్టం నివేదిక 8-10 వారాల్లో రావొచ్చని అంటున్నారు.

ఆ రోజు ఉదయం రివేరా తన సహోద్యోగులతో గడిపిన కాసేపటికి... తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి తన గదికి తిరిగి వెళ్లారని చెబుతున్నారు. అయితే ఎప్పటికీ తిరిగి రాలేదని అంటున్నారు. అయితే... కొంతమందికి ఇది విషాదకరమైన యాదృచ్చిక ఘటన అనిపించినా... అన్నాబెల్లె కథను నమ్మేవారికి మాత్రం మరిచిపోలేనంత భయానకంగా అనిపిస్తోందని చెబుతున్నారు.

ఈ విషాదంపై ఎన్‌.ఈ.ఎస్‌.పీ.ఆర్‌. దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే డెవిల్స్‌ ఆన్‌ ది రన్‌ మాత్రం ఆగదని స్పష్టం చేసింది. పైగా ఈ బొమ్మతో ఇప్పటిదాకా ప్రాణాలు పోయిన దాఖలాలు లేవని చెబుతున్నారు. చాలాకాలంగా అన్నాబెల్లె బొమ్మను రివేరానే చూసుకుంటున్నారని అంటున్నారు.

Tags:    

Similar News