డెడ్ బాడ్ డోర్ డెలవరీ కేసు.. ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో షాక్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైవర్ హత్య కేసుపై మళ్లీ సమగ్ర విచారణకు నిర్ణయించింది. దీనిపై కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేసింది.;
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుకు మరో షాక్ తగిలింది. అనంత బాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసును మరో మారు విచారించాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని ఎమ్మెల్సీ వేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో డ్రైవర్ హత్య కేసుపై సిట్ విచారణకు ఉన్నత న్యాయస్థానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. 2022లో జరిగిన హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో అరెస్టు అయిన అనంతబాబు ప్రస్తుతం బెయిలుపై ఉన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రైవర్ హత్య కేసుపై మళ్లీ సమగ్ర విచారణకు నిర్ణయించింది. దీనిపై కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ పిటిషన్ పై విచారణ జరిపిన రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు సానుకూలంగా స్పందించింది. డ్రైవర్ హత్య కేసుపై సిట్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 90 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనంతబాబు బెయిలు రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై ఆందోళన చెందిన అనంతబాబు స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే రాజమండ్రి కోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. ఫలితంగా ఎమ్మెల్సీ అనంతబాబు మరోమారు విచారణ ఎదుర్కోనున్నారు. గత ప్రభుత్వంలో ఈ హత్యోదంతం చోటుచేసుకోగా, బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని ప్రస్తుత కూటమి ప్రభుత్వం భావిస్తోంది. డ్రైవర్ హత్యపై పున:విచారణ చేపడతామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఆ మేరకు హతుడి తల్లి ఫిర్యాదుతో కేసును రీ ఓపెన్ చేసేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకున్నారు. ఈ పరిణామం వైసీపీకి రాజకీయంగా ఇరకాటమే అంటున్నారు. హత్యోదంతం వెలుగుచూసిన వెంటనే వైసీపీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేశారు. అయితే కొన్నాళ్లకే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. దీంతో అనంతబాబుపై ఉన్న కేసు వైసీపీని రాజకీయంగా డామేజ్ చేసిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కేసును మళ్లీ విచారించాలని ప్రభుత్వం నిర్ణయించడంపై వైసీపీ స్పందన ఎలా ఉండబోతోందో చూడాల్సివుంది.