లోకేష్ ముందే మంత్రి ఆనం అసహనం!
కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ హాజరయ్యారు. నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను ఆయన ప్రారంభించారు.;
సీనియర్ మోస్ట్ నేత నెల్లూరు జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నాయకుడు అయిన ఆనం రామనారాయణరెడ్డి తనలోని అసహనాన్ని బయటపెట్టుకున్నారా అన్న చర్చ వస్తోంది నెల్లూరులో జరిగిన పాఠశాల ప్రారంభోత్సవం
కార్యక్రమానికి విద్యా శాఖ మంత్రి హోదాలో నారా లోకేష్ హాజరయ్యారు. నెల్లూరులో ఆధునీకరించిన వీఆర్ పాఠశాలను ఆయన ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం పట్ల లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.
ఇక ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి ఖర్చు పెట్టినంతమాత్రాన అది మునిసిపల్ స్కూల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మంత్రి నారాయణ తన సొంత ఖర్చులతో ఈ స్కూల్ ని అభివృద్ధి చేసి లోకేష్ ద్వారా దానిని ప్రారంభించడం ఆనం వారికి ఎక్కడో అసూయ కలిగించింది అని అంటున్నారు.
అంతే కాదు సీనియర్ గా తాను ఉన్నా కీలక శాఖలతో ప్రభుత్వంలో విశేషమైన ప్రాధాన్యతతో మంత్రి నారాయణ ఉన్నారు అన్న ఆవేదన బాధ కావచ్చు. కానీ జరిగినది మంచి కార్యక్రమం. పైగా వీఆర్ పాఠశాల ఎంతో చరిత్ర కలిగినది. అందులో ఎం వెంకయ్యనాయుడు, ఎస్పీ బాలు వంటి వారు ఎందరో ప్రముఖులు చదువుకున్నారు
చాన్నాళ్ళుగా మూతపడి ఉన్న ఆ పాఠశాలను సొంత ఖర్చుతో సాటి మంత్రి ఆధునీకరిస్తే మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకోవడమేంటని ఆనం మీద విమర్శలు వస్తున్నాయి. అది కూడా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఎదుటనే ఆయన ఇలా చేయడం తో టీడీపీ హైకమాండ్ కి తన అసంతృప్తి తెలియచేయడానికేనా అన్న చర్చ కూడా వస్తోంది.
ఇక ఆనం రామనారాయణరెడ్డికి దేవాదాయ శాఖ ఇచ్చారు. మరి ఆయన కీలక శాఖలు ఏమైనా కోరుకున్నారా లేక తనకు వచ్చిన శాఖ పట్ల అసంతృప్తితో ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఏది అయినా ఏడాది కూటమి పాలన ముగిసింది. ఇపుడు తనకు అప్పగించిన శాఖలో అభివృద్ధి చూపించాల్సిన మంత్రి గారు ఈ విధంగా మాట్లాడటం తగునా అన్న చర్చ వస్తోంది.
అయితే ఆనం వారి మాటలు ఆయనలోని అసూయను సంకుచితత్వాన్ని బయట పెట్టాయి కానీ దాని మీద మంత్రి నారాయణ అయితే ఏ విధంగానూ ప్రతి విమర్శ కానీ వ్యాఖ్య కానీ చేయలేదు. ఇక లోకేష్ ఈ విషయం మీద ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఇపుడు తెలియదు తరువాతనే అని అంటున్నారు. మొత్తానికి వైసీపీలో అయిదేళ్ళ పాటు ఉండి మంత్రి పదవి దక్కని పెద్దాయన టీడీపీలో చేరి మంత్రిగారుగా వెలుగొందుతున్నారు. మరి ఇపుడు ఆయన నోరు చేసి ఇలా వ్యవహరించడం సమంజసమేనా అన్న చర్చ సాగుతోంది.