పెళ్లింట విషాదం.. రొట్టెల కోసం గొడవ.. ఇద్దరు యువకుల దారుణ హత్య!
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్, అతని స్నేహితులు అది అవమానంగా భావించడంతో వివాదం త్వరగా తీవ్రమైంది.;
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన ఒక పెళ్లి వేడుక విషాదకరంగా ముగిసింది. తందూరీ రొట్టెల కోసం జరిగిన చిన్న పాటి వాగ్వాదం కాస్త చినికిచినికి గాలివానలా తయారై ఇద్దరు యువకుల దారుణ హత్యకు దారితీసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతులు 17 ఏళ్ల ఆశిష్, 18 ఏళ్ల రవి. వీరిద్దరూ వరుసకు సోదరులవుతారు. వారు పెళ్లికి హాజరయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెళ్లిలో భోజనాలు పెట్టే వద్ద రొట్టెల కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఆశిష్, రవిలకు వరుడి బంధువు రోహిత్, అతని స్నేహితుల గుంపుతో చిన్న గొడవ జరిగింది.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్, అతని స్నేహితులు అది అవమానంగా భావించడంతో వివాదం త్వరగా తీవ్రమైంది. తరువాత, రాత్రి 1 గంట ప్రాంతంలో ఆశిష్, రవి తమ స్నేహితులతో కలిసి వేదిక నుంచి బయలుదేరుతుండగా రోహిత్ అతని అనుచరులు వారిని వెంబడించి దాడి చేశారు. నిందితులు ఇనుప రాడ్లు, హాకీ స్టిక్‌లు, లాఠీలతో ఉన్నారని అడ్డగించారని తెలుస్తోంది. ఆశిష్, రవి స్నేహితులు తప్పించుకోగా ఈ ఇద్దరు పట్టుబడ్డారు.
రక్తపు మడుగులో పడి ఉన్న యువకులను గమనించిన స్థానికులు వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి గాయాల తీవ్రతను చూసి, వైద్యులు వారిని మెరుగైన చికిత్స కోసం మొదట రాయ్‌బరేలీలోని ఎయిమ్స్ కు, ఆపై లక్నోకు తరలించారు. అలా తరలిస్తుండగా ఆశిష్ మార్గమధ్యంలోనే మరణించాడు. రవి ఆసుపత్రికి చేరుకున్న తర్వాత మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ ఇద్దరి మృతితో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఆశిష్ తండ్రి శివ బహదూర్ మాట్లాడుతూ.. "నా కొడుకు పెళ్లికి వెళ్ళాడు. తిరిగి రాలేదు. అదంతా కేవలం కొన్ని రొట్టెల కోసమా?" అని విలపించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.