అమెరికా అధ్యక్షుడు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు?

ప్రపంచంలో ఏకైక అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి.

Update: 2024-04-27 07:22 GMT

ప్రపంచంలో ఏకైక అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌ లో జరగనున్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ మరోసారి డెమోక్రటిక్‌ పార్టీ తరఫున బరిలోకి దిగుతున్నారు. మరోవైపు రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో జో బైడెన్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని బాంబుపేల్చారు. 1972లో జరిగిన ఒక ప్రమాదంలో తన భార్య, కుమారుడు మృతి చెందారని తెలిపారు. ఆ సమయంలో తనకు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయన్నారు.

తనకు అప్పట్లో తాగుడు అలవాటు కూడా లేదని జో బైడెన్‌ తెలిపారు. అయితే భార్య, కుమారుడు దూరం కావడంతో తట్టుకోలేక మద్యానికి అలవాటుపడ్డానన్నారు. ఈ క్రమంలో ఓసారి మద్యం తాగుతూ డెలావేర్‌ మెమోరియల్‌ బ్రిడ్జి వద్దకు వెళ్లినప్పుడు ఆత్మహత్య ఆలోచనలు కలిగాయని జో బైడెన్‌ వెల్లడించారు. తాను అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందన్నారు.

ఈ క్రమంలో తనకు తన ఇద్దరు కుమారులు గుర్తొచ్చారని జో బైడెన్‌ తెలిపారు. తన ఇద్దరు కుమారుల భవిష్యత్తు గుర్తొచ్చిందని చెప్పారు. వారి కోసమే జీవించాలని ఆ క్షణంలో నిర్ణయించుకున్నానన్నారు. దీంతో వెంటనే ఆత్మహత్య ఆలోచనల నుంచి బయటపడ్డానని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న పిచ్చి ఆలోచనలు చేయొద్దని హితవు పలికారు.

కాగా 1972లో తొలిసారి జో బైడెన్‌ సెనేటర్‌ గా గెలుపొందారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఒక రోడ్డు ప్రమాదంలో బైడెన్‌ సతీమణి, ఆయన 18 నెలల కుమారుడు మృత్యువాత పడ్డారు.

కాగా ఈ ఇంటర్వూలో తన చిన్ననాటి విషయాలను కూడా వివరించారు. అలాగే తాను న్యాయవాదిగా ఉన్నప్పుడు వాదించిన కేసుల గురించి కూడా ప్రస్తావించారు. అలాగే ఎన్నికల్లో తన ప్రత్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ ను ఆయన రౌడీగా పేర్కొన్నారు. అదేవిధంగా నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడుతున్నప్పుడు అరెస్టు కూడా అయ్యానని తెలిపారు.

Tags:    

Similar News