అమరావతికి శుభదినం... ఆంధ్రులకు పర్వదినం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మహోనంత ఘట్టం నేడు ఆవిష్కృతం అవుతోంది.;

Update: 2025-05-02 07:09 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో మహోనంత ఘట్టం నేడు ఆవిష్కృతం అవుతోంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నముమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు.

అవును... గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం 58 రోజుల వ్యవధిలో రైతుల నుంచి 34 వేలకు పైగా ఎకరాల్ని భూసమీకరణ చేయగా.. సుమారు పదేళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం నేడు మొదలు కానుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాయలసీమ, ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరుల నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు తరలిస్తుండటంతో రాజధాని ప్రాంతంలో సరికొత్త సందడి వాతావారణం నెలకొంది. మరోపక్క.. రాజధాని పరిధిలోని తుళ్లూరు రైతులు, మహిళలు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

ఈ విధంగా రాష్ట్రానికి నడిబొడ్డున, అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అమరావతిని నిర్మిస్తూనే.. వివిధ ప్రాంతాల్ని ఏకకాలంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు అమలుచేస్తోంది. ఇందులో భాగంగా.. విశాఖ, తిరుపతిలను మెగాసిటీలుగా.. విశాఖను ఆర్థిక రాజధానిగా.. రాయలసీమను ఆటోమొబైల్ జోన్ గా ప్రకటించింది.

రైతుల మహత్తర పోరాటం... అమరావతి చరిత్రలో ఓ అధ్యాయం!:

రాష్ట్రానికి మూడు రాజధానుల్ని ప్రకటిస్తూ 2019 డిసెంబర్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్.. అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో... దానికి నిరసనగా డిసెంబర్ 18 నుంచి రాజధాని రైతులు ఉద్యమించారు. అన్ని సమస్యలను అధిగమిస్తూ 1,631 రోజులు పోరాటం చేశారు. వారి పోరాటాన్ని కోవిడ్ తో పాటు తుపానులు, ప్రకృతి విపత్తులు ఆపలేకపోయాయి.

దేశ చరిత్రలో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాల్లో ఒకటిగా నిలిచిన అమరావతి రైతుల పోరాటాల్లో నిరాహార దీక్షలు, మౌనపోరాటాలు, పాదయాత్రలు, న్యాయపోరాటాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతినే ఏకైన రాజధానిగా కొనసాగించాలని, నిర్ధిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు 2022 మర్చి 3న తీర్పు చెప్పింది.

ఈ సందర్భంగా ‘ఎక్స్’ వేదికగా స్పందించిన చంద్రబాబు... ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవానికి విచ్చెస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి మనఃపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని నిర్మాణాన్ని సాకారం చేసేందుకు కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు.

ఇదే సమయంలో... ఏపీ ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభించేందుకు విచ్చేస్తున్న మోడీకి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News