హాస్యనటుడు అలీ తిరిగి 'ఫ్యాన్' కిందకు రాబోతున్నారా?

గత ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ హాస్యనటుడు అలీ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారారు.;

Update: 2025-10-22 14:55 GMT

గత ఏడాది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖ హాస్యనటుడు అలీ మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారారు. ఆయన తిరిగి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా?.. ఆయన వైసీపీ లోకి తిరిగి ప్రవేశించి క్రియాశీల రాజకీయ ప్రమేయాన్ని తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. అందుకు కారణం నెట్టింట హల్ చల్ చేస్తోన్న ఆయన తాజా ఫోటో.

అవును... గత కొంతకాలంగా రాజకీయ వేదికలకు దూరంగా ఉంటున్న అలీ.. సినిమాల్లో బిజీగా ఉంటూ ముందుకు సాగుతున్నారు. మళ్లీ ఎలక్షన్ సమయానికి గానీ ఆయన పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ రాదనే చర్చా నడిచింది. ఈ నేపథ్యంలో... వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తాజాగా అలీ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన పొలిటికల్ రీఎంట్రీ పై ఊహాగానాలు మొదలయ్యాయి.

2019 ఎన్నికలకు ముందు అలీ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఆ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేయాలని భావించారని చెబుతారు. కానీ.. ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయితే.. వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా మాత్రం ప్రచారం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అలీకి ఎమ్మెల్సీ, రాజ్యసభలో ఏదో ఒక పదవి వస్తుందని ప్రచారం జరిగింది.

అయితే.. ఆ రెండూ దక్కలేదు కానీ.. చివరకు ఆయనకు ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ సలహాదారు పదవి లభించింది. ఇదే క్రమంలో... 2024 ఎన్నికల్లోనూ అలీ వైసీపీ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. అయితే ఆ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. అనంతరం.. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని అలి ప్రకటన చేశారు!

అయితే కాస్త గ్యాప్ తర్వాత ఆయన టాపిక్ రాజకీయాల్లో వినిపించడానికి కారణం.. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అలీ కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వంశీని అలీ శాలువాతో సత్కరిస్తున్నట్లు చూపిస్తున్న ఈ ఫోటోను వైసీపీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని.. రాజకీయాలకు, వైసీపీ సంబంధం లేదని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. పైగా.. వంశీకి కూడా సినిమా పరిశ్రమలో మంచి సంబంధాలు ఉన్నాయని.. వారి సమావేశం కేవలం వ్యక్తిగత అనుబంధానికి ప్రతిబింబం మాత్రమేనని వారు అంటున్నారు. ఏది ఏమైనా.. కొన్ని రోజులు ఆగితే అసలు విషయం తెలియొచ్చనేది మరికొందరి అభిప్రాయం!

Tags:    

Similar News