విమానం కూలడానికి కారణం... టాటా ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు!
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే.;
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రమాదానికి గల కారణాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా... చాలా మంది రెండు ఇంజిన్లు ఫెయిల్ అయ్యి ఉండొచ్చనే అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం ఫిట్ నెస్ గురించి తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదానికి గల కారణం పక్షులు కాదని.. ఇంజిన్ లో సమస్యలుగానే అనిపిస్తుందంటూ చర్చ మొదలైంది. ఈ సందర్భంగా ఎయిరిండియా విమాన ప్రమాదం ఇంజిన్ వైఫల్యం కారణం అనే ఊహాగానాలను ఎన్ చంద్రశేఖరన్ కొట్టిపారేశారు.
ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ప్రమాదానికి గల కారణాలపై చాలా ఊహాగానాలు, చాలా సిద్ధాంతాలు ఉన్నాయి కానీ.. తనకు తెలిసిన వాస్తవం ఏమిటంటే.. ఈ విమానం క్లీన్ హిస్టరీని కలిగి ఉంది అని చెప్పారు. ఈ విమానంల్లోని రెండు ఇంజిన్లు బాగానే ఉన్నాయని.. కుడి ఇంజిన్ కొత్తదని, దాన్ని 2025 మార్చిలోనే అమర్చామని తెలిపారు.
ఇక ఎడమ ఇంజిన్ విషయానికొస్తే.. దీన్ని చివరిసారిగా 2023లో సర్వీస్ చేయబడిందని.. దాని నెక్స్ట్ మెయింటినెన్స్ 2025 డిసెంబర్ లో జరగాల్సి ఉందని అన్నారు. ఇదే సమయంలో.. ఈ విమానాన్ని నడుపుతున్న పైలట్, ఫస్ట్ ఆఫీసర్.. ఇద్దరూ కూడా చాలా అద్భుతమైన, అనుభవమనున్న పైలెట్లు, గొప్ప నిపుణులు అని పేర్కొన్నారు.
ఇందులో భాగంగా... కెప్టెన్ సబర్వాల్ కు 11,500 గంటలకు పైగా అనుభవం కలిగి ఉన్నారని తెలిపారు. ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కు 3,400 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో.. ఈ ప్రమాదంపై అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకూ ఎలాంటి నిర్దారణకు రాకూడదని చంద్రశేఖరన్ కోరారు.
ఇదే సమయంలో... ఎయిరిండియాకు డీజీసీఏ మెయింటినెన్స్ కు సంబంధించిన రెడ్ ఫ్లాగ్ జారీ చేసిందనే వాదనలను సైతం చంద్రశేఖరన్ తోసిపుచ్చారు. విమానం, ఇంజిన్, పైలట్ రికార్డులను తాను స్వయంగా పరిశీలించి సమీక్షించినట్లు తెలిపారు. తన బృందంతో కూడా చర్చించినట్లు వెల్లడించారు. ఇందులో ఎలాంటి రెడ్ ఫ్లాగ్స్ లేవని తెలిపారు.