సౌదీలో సాంకేతిక విప్లవం..హజ్ యాత్రలో AI రోబోట్ పాత్ర!

జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఈ యాత్రలో భక్తులకు సరైన మార్గనిర్దేశం అవసరం.;

Update: 2025-05-26 03:55 GMT

జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ప్రతి ముస్లిం కోరుకుంటారు. ఈ యాత్రలో భక్తులకు సరైన మార్గనిర్దేశం అవసరం. ఈసారి సౌదీ అరేబియా దీనికోసం ఒక వినూత్న పరిష్కారాన్ని కనుగొంది. ఈ యాత్రను టెక్నాలజీతో అనుసంధానించే అద్భుతమైన ప్రయత్నం చేసింది. మక్కాలోని పవిత్ర మసీదులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తో కూడిన ఒక రోబోట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది హజ్ యాత్రికులకు సహాయం చేస్తుంది. ఆధ్యాత్మిక సంప్రదాయం, లేటెస్ట్ టెక్నాలజీ కలిసిన ఈ అద్భుత కలయిక. యాత్రికులకు మరింత సులభమైన మార్గాన్ని ఇది అందిస్తుంది.

సౌదీ ప్రెస్ ఏజెన్సీ ప్రకారం..ఈ రోబోట్ పేరు 'మనారత్ అల్-హర్మైన్'. దీనిని గ్రాండ్ మసీదు, మదీనాలోని మసీద్-ఎ-నబవి ధార్మిక వ్యవహారాల ప్రెసిడెన్సీ ప్రవేశపెట్టింది. ఈ రోబోట్ ఇప్పుడు అప్ డేటెడ్ వెర్సన్‌లో ఉంది. దీనిలో కొత్త టెక్నాలజీను జోడించడమే కాకుండా, దీని డిజైన్‌ను మక్కా, మదీనాలోని ఇస్లామిక్ వాస్తుశిల్పం స్ఫూర్తితో రూపొందించారు. ఈ వర్చువల్ అసిస్టెంట్ హజ్ యాత్రికులకు వారి ధార్మిక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో సహాయపడుతుంది.

ఈ AI రోబోట్ స్పెషాలిటీ ఏమిటంటే.. ఇది నేరుగా మత గురువులు (ముఫ్తీలు) తో వీడియో కాల్ ద్వారా యాత్రికులను కలుపుతుంది. అంటే, ఎవరికైనా ఏదైనా ధార్మిక సందేహం ఉంటే, వారు ఈ రోబోట్ ద్వారా నేరుగా ఇస్లామిక్ పండితులతో మాట్లాడవచ్చు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా హజ్ వంటి రద్దీగా ఉండే పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ మార్గనిర్దేశం లభిస్తుంది.

మనారత్ అల్-హర్మైన్ రోబోట్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్‌ను ప్రత్యేకంగా ఇస్లామిక్ వాతావరణానికి అనుగుణంగా తయారు చేశారు. దీని స్క్రీన్, కెమెరా, ఆడియో ఫీచర్లు వినియోగదారునికి సులభమైన ఇంటర్‌ఫేస్ ద్వారా మార్గనిర్దేశం అందిస్తాయి. హజ్ అనుభవాన్ని డిజిటల్‌గా కూడా మెరుగుపరచాలనే సౌదీ అరేబియా ప్రయత్నంలో ఇది ఒక భాగం.

ఈ సాంకేతిక ఆవిష్కరణ సౌదీ ప్రభుత్వం విజన్ 2030 లో భాగం. ఈ విజన్‌లో పర్యాటకం, ఆధ్యాత్మికత, సాంకేతికతను ఒకే చోట తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ముస్లింలు ప్రపంచం నలుమూలల నుంచి మక్కాకు వస్తారు. అలాంటి వారికి ఈ రోబోట్ కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా ఒక మంచి మార్గదర్శకుడు లాగా దారి కూడా చూపిస్తుంది.

ఈ సంవత్సరం హజ్ యాత్ర జూన్ 4 నుంచి జూన్ 9 మధ్య జరుగుతుంది. ఇప్పటికే హజ్ యాత్రికులు రావడం ప్రారంభించారు. ఈ పవిత్ర యాత్రలో మనారత్ అల్-హర్మైన్ రోబోట్ వారికి సాంకేతిక సహాయకుడిగా అందుబాటులో ఉంటుంది. ఈ చొరవ ఆధ్యాత్మికత, ఆవిష్కరణలు ఎలా కలిసి వెళ్ళగలవో చూపుతుంది. ఈ లోకంలోనే కాదు పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా టెక్నాలజీ సహాయపడగలదని ఇది చూపిస్తుంది.

Tags:    

Similar News