ఏఐ దెబ్బకు కొత్త కుబేరులు ఎంతమందంటే?
రంగం ఏదైనా ఇప్పుడు అన్నిచోట్ల వినిపిస్తున్న మాట ఏఐ. మొన్నటివరకు దీని గురించి వినటమే.. ఇప్పుడు దీని ప్రభావం నేరుగా కనిపిస్తోంది.;
రంగం ఏదైనా ఇప్పుడు అన్నిచోట్ల వినిపిస్తున్న మాట ఏఐ. మొన్నటివరకు దీని గురించి వినటమే.. ఇప్పుడు దీని ప్రభావం నేరుగా కనిపిస్తోంది. ప్రజల జీవితాల్లోకి వచ్చేసిన ఈ సరికొత్త సాంకేతికత.. ప్రపంచ గమనాన్ని తీవ్రంగా మార్చేయనుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే.. ఈ కొత్త సాంకేతికతను నమ్మి.. దాన్నే తమ వ్యాపారంగా మార్చుకున్న పలువురు ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా అవతరిస్తున్న పరిస్థితి. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో ఈ విషయం స్పష్టమైంది.
ప్రపంచ వ్యాప్తంగా సంపదను క్రియేట్ చేయటంతో ఏఐ కీలకంగా మారింది. అంతేకాదు.. చరిత్రలో ఎప్పుడూ లేనంత వేగంగా సంపదను క్రియేట్ చేయటంతో ఏఐ కొత్త రికార్డును క్రియేట్ చేసిన పరిస్థితి. హురున్ జాబితా చరిత్రలో.. ఎప్పుడూ లేనంత వేగంగా.. రికార్డు స్థాయిలో 700 మంది కొత్త వ్యక్తులు తాజా జాబితాలో చోటు దక్కించుకున్నట్లుగా హురున్ వెల్లడించింది. వీరంతా ఏఐ కారణంగా కుబేరులు కావటం గమనార్హం. 700 మంది కొత్తగా జాబితాలో చోటు దక్కించుకున్న దానికి మరింత సింఫుల్ గా చెప్పాలంటే.. గత ఏడాదిలో ప్రతి రెండు రోజులకు ఒక కొత్త కుబేరుడు అవతరించినట్లుగా చెప్పాలి.
ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. కొత్తగా హురున్ జాబితాలో చేరిన వారిలో సగం మంది చైనీయులు కావటం గమనార్హం. ఎన్ విడియా అధిపతి జెన్సన్ హువాంగ్ సంపద 34 శాతం పెరిగింది. దీంతో ఎన్ విడియా మార్కెట్ విలువ 5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవటంతో టాప్ 10 ప్రపంచ కుబేరుల్లో ఆయన తొమ్మిదో స్థానానికి చేరుకున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్.. సెర్గీ బ్రిన్ వరుసగా మూడు.. ఐదు స్థానాలకు దూసుకెళ్లింది కూడా ఏఐ పుణ్యమే. జెమినై 4ఏఐ మోడల్.. గూగుల్ క్లౌడ్ అధిపత్యంతో ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ 4 లక్షలకోట్ల డాలర్లకు అధిగమించింది.
ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ సంపద 32 శాతం పెరిగి.. 267 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఓపెన్ ఏఐకు చెందిన శామ్ ఆల్ట్ మన్ సంపద మూడు రెట్లు అధికం కావటం గమనార్హం. ఇక.. ప్రపంచ టెక్నాలజీలో సరికొత్త సంచలనంగా మారిన ఆంథ్రోపిక్ ఏకంగా ఏడుగురు కొత్త సంపన్నుల్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 380 బిలియన్ డాలరలు. దీని వ్యవస్థాపకులు డారియో.. డానియోలా అమోడెయ్ తో పాటు మరో ఐదుగురు సహ వ్యవస్థాపకులు ఒక్కొక్కరు 3.7 బిలియన్ డాలర్ల సంపదను సొంతం చేసుకున్నారు. హుమనాయిడ్ రోబోటిక్స్ కంపెనీ ఫిగర్ ఏఐ వ్యవస్థాపకుడు బ్రెట్ అడ్ కాక్ సంపద పది రెట్లు పెరిగింది.
హురున్ జాబితాలో అతి తక్కువ వయసున్న వారిగా బ్రెండన్ పుడీ.. ఆదర్శ్ హిరేమత్.. సూర్య మిధాలు నిలిచారు. వీరంతా పాతికేళ్ల లోపు వారే కావటం విశేషం. వీరు ఏఐ రిక్రూట్ మెంట్ స్టార్టప్ మెర్కర్ ను ఏర్పాటు చేశారు. వీరి సంపద ఒక్కొక్కిరిది 2.4 బిలియన్ డాలర్లు. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే.. దగ్గరదగ్గర రూ.22వేల కోట్లు కావటం గమనార్హం. అదీ ఏఐ మేజిక్ అంటే.