ట్రాఫిక్ పోలీసుల కోసం ఏసీ హెల్మెట్లు..ఇది ఎలా పనిచేస్తుంది?

దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై ట్రాఫిక్ పోలీసులు ఎండ వేడిమికి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు.;

Update: 2025-04-10 12:34 GMT

ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటుతున్నాయంటే మామూలు విషయం కాదు. సామాన్యులకే అల్లాడిపోతుంటే, నిప్పులు కురిసే రోడ్లపై నిలబడి ట్రాఫిక్ను కంట్రోల్ చేసే పోలీసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? వారి కష్టానికి కాస్త ఉపశమనం కలిగించేందుకు టెక్నాలజీ రంగం సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అదే 'ఏసీ హెల్మెట్'! ఢిల్లీ పోలీసులు త్వరలోనే తమ సిబ్బందికి ఈ చల్లని హెల్మెట్లను అందించనున్నారు. ఇంతకీ ఈ హెల్మెట్లు ఎలా పనిచేస్తాయి? ఎక్కడ పుట్టాయి? తెలుసుకుందాం పదండి!

దేశ రాజధాని ఢిల్లీలో ఇకపై ట్రాఫిక్ పోలీసులు ఎండ వేడిమికి బెంబేలెత్తాల్సిన అవసరం లేదు. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఏసీ హెల్మెట్లు రానున్నాయి. ఈ హెల్మెట్లు బయటి టెంపరేచర్‌ను ఏకంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించి, వారికి హాయినిస్తాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, చెన్నై, వడోదర వంటి నగరాల పోలీసులు ఈ టెక్నాలజీని ఉపయోగించి మంచి ఫలితాలు పొందారు.

ఈ హెల్మెట్లలో ఏం మ్యాజిక్ ఉంది?

ఈ ఏసీ హెల్మెట్లు మామూలు హెల్మెట్లలా కాకుండా ప్రత్యేకమైన డిజైన్‌తో వస్తాయి. వీటిలో ఒక చిన్న వెంటిలేటర్ అమర్చబడి ఉంటుంది. ఇది బయటి వేడి గాలిని ఫిల్టర్ చేసి, చల్లటి గాలిని హెల్మెట్ లోపలికి పంపుతుంది. దీనికి పవర్ అందించడానికి ఒక చిన్న లీ-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను పోలీసుల నడుముకు తగిలిస్తారు. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ఒక రెడ్ లైట్ వెలుగుతుంది, అప్పుడు ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్మెట్ ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 2-3 గంటల వరకు పనిచేస్తుంది. బరువు కూడా కేవలం 200 గ్రాములు మాత్రమే ఉండటంతో పోలీసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతేకాదు, సూర్యకిరణాల నుంచి కళ్లను కాపాడుకోవడానికి ఒక ప్లాస్టిక్ షీల్డ్ కూడా ఉంటుంది. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ. 13,000 నుంచి రూ. 15,000 వరకు ఉంది.

ఈ చల్లని ఆలోచన ఎవరిది? ఎక్కడ పుట్టింది?

ప్రపంచంలో మొట్టమొదటి ఏసీ హెల్మెట్ ఎవరు తయారు చేశారనే దానిపై కచ్చితమైన సమాచారం లేదు. కొన్ని రిపోర్ట్‌ల ప్రకారం, 2023లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ తమ ఫుట్‌బాల్ ప్లేయర్ల కోసం ఇలాంటి హెల్మెట్లను రూపొందించింది. అవి దాదాపు 5 గంటల వరకు చల్లటి గాలిని అందించాయి. ఇంకొన్ని రిపోర్ట్‌ల ప్రకారం, 2021లో దుబాయ్‌కి చెందిన ఎన్‌ఐఏ లిమిటెడ్ అనే కంపెనీ, ఇండియాకు చెందిన జార్ష్ లిమిటెడ్‌తో కలిసి మొదటి ఏసీ సేఫ్టీ హెల్మెట్‌ను తయారు చేసింది. అయితే, ఫెహెర్ రీసెర్చ్ అనే సంస్థే మొదట హెల్మెట్‌లో కూలింగ్ సిస్టమ్‌ను పెట్టిందని కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఇండియాలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పోలీసుల కోసం వీటిని ప్రయోగాత్మకంగా వాడుతున్నారు. మన దేశంతో పాటు దుబాయ్‌లో కూడా ఈ హెల్మెట్లు పోలీసులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి.

Tags:    

Similar News