ఎవరీ అభిషేక్ సింగ్? జల్లెడ పడుతున్న పోలీసులు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని బ్రేక్ చేయటం..ఈ సందర్భంగా పదకొండు మందిని అదుపులోకి తీసుకోవటం.. అందరూ డ్రగ్స్ సేవించిన వైనాన్ని రికార్డు చేయటం తెలిసిందే.;
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి చెందిన మొయినాబాద్ ఫాంహౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని బ్రేక్ చేయటం..ఈ సందర్భంగా పదకొండు మందిని అదుపులోకి తీసుకోవటం.. అందరూ డ్రగ్స్ సేవించిన వైనాన్ని రికార్డు చేయటం తెలిసిందే. ఇందులో ముగ్గురు మినహా మిగిలిన ఎనిమిది మంది స్టేషన్ బెయిల్ తో విడుదల కావటం తెలిసిందే. ఈ పార్టీలో వినియోగించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు అందజేశారు? లాంటి ప్రశ్నలకు రోహిత్ రెడ్డి కారు డ్రైవర్ చెప్పిన సమాచారం ఇప్పుడు కీలకమైంది.
తాను అభిషేక్ సింగ్ అనే వ్యక్తి నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లు చెప్పటంతో ఇప్పుడు ఫోకస్ మొత్తం అతడ్ని పట్టుకునే అంశం మీద ఫోకస్ పెడుతున్నారు. అయితే.. అతడి ఆచూకీ గుర్తించటం కష్టంగా మారినట్లు చెబుతున్నారు. అభిషేక్ సింగ్ అన్న పేరు తప్పించి మిగిలిన ఆధారాలు ఏమీ పోలీసులకు లభించలేదు. కాకుంటే.. అతడి ఫోన్ నెంబరును పోలీసులు సేకరించారు. అయితే.. దీంతో పెద్దగా వివరాలు లభించలేదన్న మాట వినిపిస్తోంది.
అభిషేక్ సింగ్ ఆచూకీ కోసం.. పదకొండు మంది బ్యాంకు ఖాతాల్న తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర బ్యాంకు ఖాతాల లావాదేవీల ఆధారంగా అతడి ఆచూకీ లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు రియల్ ఎస్టట్.. పబ్ తో పాటు వివిధ వ్యాపారాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. వీరి ఆర్థిక లావాదేవీలు భారీగా ఉన్నాయని.. వీటిల్లో నుంచి కేసుకు సాయం చేసే అంశాల్నిగుర్తించటం కాస్త కష్టమైన అంశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ సింగ్ ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నా ఫలితం లేని పరిస్థితి. ఇతగాడు వీరికి ఎలా పరిచయమయ్యాడు? ఎవరెవరితో నేరుగా సంబంధాలు ఉన్నాయి? అభిషేక్ సింగ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అతడికి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తాయి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది. ఇతగాడి ఆచూకీ లభిస్తే.. ఈ కేసుకు పెద్ద బ్రేక్ త్రూ దొరికినట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్న రోహిత్ రెడ్డి, రితేశ్ రెడ్డి, నమిత్ శర్మ కస్టడీ పిటిషన్ పై కోర్టు తీర్పు ఈ రోజు రానుంది. ఒకవేళ.. పోలీసుల కస్టడీకి కోర్టు అనుతిస్తే.. పోలీసులు విడిగా విచారణ చేసే వీలుంది. అప్పుడు మరిన్ని వివరాలు వెల్లడయ్యే వీలుంది. అయితే.. అందుకు కోర్టు అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది.