సంచలనం : ఇండియా కూటమి నుంచి ఆప్ ఔట్!
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ రోజు సాయంత్రం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.;
విపక్ష ఇండియా కూటమితో ఆమ్ ఆద్మీ పార్టీ తెగతెంపలు చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ సారథ్యంలోని దాదాపు 40 పార్టీల కూటమి రెండేళ్ల క్రితం ఏర్పడిన విషయం తెలిసిందే. అప్పటి యూపీఏ స్థానంలో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా) అన్న పేరుతో కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి నుంచి ఎన్నికలకు ముందే బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జనతాదళ్ యునైటెడ్ తప్పుకోగా, ఎన్నికల అనంతరం మరికొన్ని పార్టీలు దూరంగా ఉంటూ వస్తున్నాయి. ఇందులో ప్రధానమైనది ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ. ఇండియా కూటమితో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, పొత్తులు గత ఎన్నికల వరకే పరిమితమని తాజాగా ఆప్ పార్టీ ప్రకటించింది.
సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నందున ఇండియా కూటమి పార్టీల నేతలు ఈ రోజు సాయంత్రం ఆన్‌లైన్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ ఆన్‌లైన్ భేటీకి తాము దూరంగా ఉంటున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ప్రకటించారు. దీంతో ఇండియా కూటమితో ఆప్ పూర్తిగా సంబంధాలు తెంచుకున్నట్లేనంటున్నారు. నిజానికి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఇండియా కూటమితో ఆప్ దూరంగా ఉంటూ వస్తోంది. ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఒంటిరిగా పోటీచేసింది. హరియాణాలో ఆప్ విడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలు భారీగా దెబ్బతిన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి.
అదేవిధంగా తాజాగా జరిగిన పంజాబ్, గుజరాత్ ఉప ఎన్నికల్లోనూ ఆప్ పొత్తు లేకుండానే పోటీ చేసింది. మరోవైపు ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడంపై ఆప్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఆ కారణంగానే కూటమి కట్టిన నుంచి తన అసమ్మతిని తెలియజేస్తూనే ఉంది. ఇక ఆప్ నిష్క్రమణతో ఇండియా కూటమి అస్థిత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే శిశసేన (యూబీటీ) కూడా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. తాజాగా మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవిస్ ను కలుసుకోవడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. దీంతో ఇండియా కూటమి నుంచి ఒక్కొ పార్టీ బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చిన ఆప్ ఒంటరిగానే రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.