బ‌ట్ట‌త‌ల‌పై ఓపెన్ గా నిజాన్ని ఒప్పుకున్నాడు!

ఒకప్పుడు యువతను పాటలతో, స్టైలిష్ లుక్స్‌తో ఊపేసిన స్టార్ రాపర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆశ్చర్య కరమైన నిజాన్ని పంచుకున్నారు

Update: 2026-05-28 03:00 GMT

పాప్- రాప్ సంగీత ప్రపంచంలో తనదైన శైలితో సంచలనం సృష్టించిన సింగర్ హనీ సింగ్. ఒకప్పుడు యువతను పాటలతో, స్టైలిష్ లుక్స్‌తో ఊపేసిన స్టార్ రాపర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆశ్చర్య కరమైన నిజాన్ని పంచుకున్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా కనిపించాలనే ఒత్తిడిని పక్కన పెట్టి తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న శారీరక మార్పుల గురించి బహిరంగంగా మాట్లాడటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సెలబ్రిటీలు సాధారణంగా శారీరక లోపాలను .. ఇబ్బందులను కెమెరాల ముందుకు రాకుండా దాచడానికి ప్రయత్నిస్తుంటారు.

కానీ హనీ సింగ్ మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా తాను పూర్తిగా బట్టతలతో ఉన్నానని ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ప్రస్తుతం తలపై కనిపిస్తున్న జుట్టు నిజమైనది కాదని కేవలం విగ్గు సహాయంతోనే ఇండస్ట్రీలో నెట్టుకొస్తున్నానని ఆశ్చర్యపరిచారు. ఆయన చూపించిన ఈ నిజాయితీ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. జుట్టు రాలడానికి గల అసలు కారణాన్ని కూడా హనీ సింగ్ ఎంతో ధైర్యంగా వివరించారు. గతంలో ఆయన తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్య బైపోలార్ డిజార్డర్ బారిన పడిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో మానసిక సమతుల్యతను తిరిగి సాధించడం కోసం సుదీర్ఘ కాలం పాటు భారీ మోతాదులో మందులు వాడాల్సి వచ్చిందన్నారు. ఆ పవర్‌ఫుల్ మందుల తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ కారణంగానే జుట్టు పూర్తిగా ఊడిపోయిందని వెల్లడించారు. చిత్ర పరిశ్రమల్లో బాహ్య సౌందర్యానికి- హెయిర్ స్టైల్స్‌కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి గ్లామర్ ప్రపంచంలో టాప్ పొజిషన్‌లో ఉన్న ఒక సెలబ్రిటీ తన లుక్‌ను పూర్తిగా కోల్పోవడం అనేది మానసికంగా ఎంతో కుంగదీసే అంశం. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒకవైపు మానసిక అనారోగ్యం, మరోవైపు అందువ‌ల్ల వ‌చ్చే శారీరక మార్పులను తట్టుకుని మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం సాధారణ విషయం కాదు.

ఈ సవాలును హనీ సింగ్ ఎదుర్కొన్న విధానం అభినందనీయం. తన లోపాన్ని దాచకుండా ప్రపంచానికి చాటిచెప్పడం ద్వారా హనీ సింగ్ సమాజంలో ఓసరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా బట్టతల ... విగ్గుల గురించి మాట్లాడటానికి న‌టులు వెనుకాడుతుంటారు. అలాంటిది ఒక గ్లోబల్ స్టార్ అలాంటి విషయాన్ని ఒప్పుకోవడం వ‌ల్ల బాడీ పాజిటివిటీ పై అవగాహన పెరుగుతుంది. అనారోగ్య సమస్యల వల్ల ..మందుల ప్రభావం వల్ల ఇలాంటి ఇబ్బందులు పడుతోన్న ఎంతో మంది సాధారణ ప్రజలకు సింగ్ ఇచ్చిన క్లారిటీ నైతిక భరోసాను ఇస్తుందని చెప్పొచ్చు.

హనీ సింగ్ం రూపం మారినప్పటికీ ఆయనలోని సంగీత సృజనాత్మకత, రాపింగ్ నైపుణ్యం ఏమాత్రం తగ్గలేదని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. శారీరక లోపాలను అధిగమించి ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతున్న ఈ స్టార్ రాపర్ నిజాయితీ, ఆయనపై అభిమానుల్లో ఉన్న గౌరవాన్ని , క్రేజ్‌ను మరింత రెట్టింపు చేస్తుంది.

Tags:    

Similar News