షారూఖ్‌నే కాదు చిరంజీవిని మర్చిపోతారు!
అయితే జీవించి ఉన్నా లేకపోయినా ఏ స్టార్ ఎక్కువగా ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నారు? అనేది చాలా ముఖ్యం.;
పాత నీరు వెళ్లి కొత్త నీళ్లు వస్తుంటాయి. ఇది సినిమా రంగానికి వర్తిస్తుంది. ఈ నియమం ప్రకారం.. సినీరంగంలో పాతతరం తారలు మటుమాయమై ఆ స్థానంలో కొత్త వాళ్లు వస్తూనే ఉంటారు. జనరేషన్ మారే కొద్దీ స్టార్లు మారిపోతూనే ఉంటారు. అయితే జీవించి ఉన్నా లేకపోయినా ఏ స్టార్ ఎక్కువగా ప్రజల హృదయాలలో నిలిచి ఉన్నారు? అనేది చాలా ముఖ్యం.
నేటి జెన్ జెడ్ కిడ్స్ `రాజ్ కపూర్ ఎవరు?` అని ప్రశ్నించినా ఆశ్చర్యపోనవసరం లేదు. రణబీర్ కపూర్ గురించి తెలిసినంతగా ఆయన తాత గురించి ఎవరికి తెలుసు? హిస్టరీని వెతికి గుర్తు పెట్టుకునేంత రిస్కు కూడా నేటితరం చేయరు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవిని గుర్తుంచుకున్నా కానీ, ఐదారు తరాలు మారిన తర్వాత చిరంజీవి ఎవరు? అని అడిగే పరిస్థితి కూడా దాపురించవచ్చు. స్పీడ్ యుగంలో పూర్వీకులను గుర్తు పెట్టుకుని పూజించేంత సంస్కారం ఎక్కడిది?
మొత్తానికి ఈ తరహా భవిష్యత్ గురించి, మారుతున్న కాలం గురించి సరిగ్గా అంచనాలు వెలువరించడంలో నటుడు, బిజినెస్ మేన్ వివేక్ ఒబెరాయ్ తర్వాతే... ఇటీవల అతడు వ్యాఖ్యానిస్తూ.. మనమంతా దేవుడుగా ఆరాధించే, షారూఖ్ ఖాన్ ఎవరో కూడా ప్రజలు మర్చిపోతారని వ్యాఖ్యానించాడు. నేటితరం గుర్తుంచుకున్నా కానీ, భవిష్యత్ తరాల పిల్లలు షారూఖ్ ఎవరు? అని ప్రశ్నించినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నాడు. నేటితరం పిల్లలకు 1960లలో ఉన్న స్టార్లు ఎవరో తెలియదని వివేక్ అన్నారు. 2050లో పిల్లలు ఎలా ఉంటారో దీనిని బట్టి ఊహించుకోవాలని అన్నారు. వారంతా షారూఖ్ ఖాన్ ఎవరు? అని ప్రశ్నిస్తారని అన్నారు.
ఒబెరాయ్ చెప్పినది కేవలం బాలీవుడ్ స్టార్లకే వర్తించదు. ఇటు టాలీవుడ్ దిగ్గజ హీరోలకు కూడా వర్తిస్తుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు వంటి దివంగత స్టార్లను ఈ జనరేషన్ గుర్తుంచుకుంటుంది. కానీ మరో ఐదారు తరాల తర్వాత అప్పటి జెన్ జెడ్ కిడ్స్ వీళ్లను గుర్తుంచుకుంటారా? అనేది సందేహమే. మనం దేవుళ్లు అని పిలుచుకునేవాళ్లను భవిష్యత్ జెన్ జెడ్ కిడ్స్ గుర్తుంచుకుంటారా? అన్నది చెప్పలేం. చరిత్ర చివరికి మనల్ని అందరినీ శూన్యంలోకి నెట్టేస్తుందని ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. అయితే వివేక్ భవిష్యవాణి విన్న తర్వాత కొందరు షారూఖ్ ఫ్యాన్స్ చాలా ఫీలైనా కానీ, ఫ్యాక్ట్ ఏమిటన్నది చాలా మంది అర్థం చేసుకున్నారు. తరాలు మారే కొద్దీ పాత తరం తారలు కనుమరుగవుతారని చాలామంది అంగీకరిస్తున్నారు.
వివేక్ ఒబెరాయ్ ప్రస్తుతం `మస్తీ 4` ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఇందులో రితేష్ దేశ్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి మూడు భాగాల తరహాలోనే ఇందులోను మత్తెక్కించే గ్లామరస్ బ్యూటీస్ కి కొదవేమీ లేదు.