వేడి వేడి దోసెల‌తో మెగా సంక్రాంతి స్పెష‌ల్ పార్టీ

మెగా ఫ్యామిలీలో దోసెలు వేయడంలో చాలామంది పోటీప‌డుతున్నారు. అయితే వీళ్లంద‌రిలో ఎవ‌రు బెస్ట్ ? అంటే.. మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెబుతుంటారు.;

Update: 2026-01-15 16:41 GMT

మెగా ఫ్యామిలీలో దోసెలు వేయడంలో చాలామంది పోటీప‌డుతున్నారు. అయితే వీళ్లంద‌రిలో ఎవ‌రు బెస్ట్ ? అంటే.. మెగాస్టార్ చిరంజీవి గారే అత్యుత్తమమైన వారు అని అందరూ చెబుతుంటారు. ఆయన వేసే దోసెలకి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది.. అదే `చిరు దోస`. పంజాగుట్ట‌ `చ‌ట్నీస్` వాళ్లు పేటెంట్ హ‌క్కులు అడిగితే చిరు ఇవ్వ‌లేద‌ని కూడా చెబుతుంటారు.

స్పెషల్ రెసిపీతో దోసెలు వేయ‌డంలో చిరు త‌ర్వాతే. చిరంజీవి ఓసారి మైసూర్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో మార్గం మ‌ధ్య‌లో ఓ కాకా హోట‌ల్ కి వెళ్లారు. ఆ హోటల్‌లో తిన్న దోసె నచ్చి దాని రెసిపీ గుట్టు అడిగారు. కానీ అది చెప్పేందుకు హోట‌ల్ య‌జ‌మాని నిరాక‌రించాడు. దాంతో అదే విధంగా దోసెను తన ఇంట్లోనే స్వయంగా తయారు చేయడం నేర్చుకున్నారు. ఇది సాధారణ దోసెలా కాకుండా చాలా ఫ్లఫీగా, నూనె లేకుండా వేస్తారు.

అంతేకాదు.. చిరంజీవి దోసెను గాలిలోకి ఎగరేసి తిరగేసే విధానం చూసి అభిమానులు ముచ్చటపడిపోతుంటారు. గతంలో ఆయన తన తల్లి అంజనాదేవి గారి కోసం దోసె వేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఒకసారి చిరంజీవి, వరుణ్ తేజ్ కలిసి దోసెలు వేస్తున్నప్పుడు.. వరుణ్ దోసె పర్ఫెక్ట్‌గా వచ్చిందని, సరదాగా అసూయతో చిరంజీవి గారు ఆ దోసెను చెరిపేసిన వీడియో అప్పట్లో బాగా నవ్వులు పూయించింది.

సంక్రాంతి స్పెష‌ల్ దోసెలు:

ఇప్పుడు సంక్రాంతి వేడుకల్లో కూడా మెగా ఫ్యామిలీ అంతా కలిసి దోసెలు వేస్తూ సందడి చేశారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధ‌ర‌మ్, నిహారిక‌ వంటి యంగ్ హీరోలు కూడా దోసెలు వేసి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఇంటిల్లిపాదీ గార్డెన్ లో లైవ్ గా దోసెలు వేస్తుంటే, వేడి వేడిగా ఆర‌గిస్తుంటే ఆ దృశ్యం చూడ‌టానికే నోరూరిస్తోంది క‌దూ?

మెగాస్టార్ స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి సురేఖ గారు కూడా దోసెలు బాగా వేస్తారు. చిరంజీవి తాను నేర్చుకున్న ఈ స్పెషల్ దోసె టెక్నిక్‌ను తన భార్యకు , కొడుకు రామ్ చరణ్‌కు కూడా నేర్పించారు. అందుకే మెగా ఫ్యామిలీలో `బెస్ట్ దోసె మేకర్` ఎవరంటే అందరూ ముందుగా మెగాస్టార్ పేరే చెబుతారు. మెగా దోసె రెసీపీ ఏమిటో తెలుసుకోవాలంటే ఒక‌సారి దాని రుచి చూడాల్సిందే.

ఈసారి సంక్రాంతి వేడుక‌ల‌కు వేదిక ఎక్కడ?

సాధారణంగా చిరంజీవి స‌హా మెగా కుటుంబం బెంగళూరు శివార్లలోని దేవనహళ్లి లో ఉన్న విలాసవంతమైన ఫామ్ హౌస్‌లో సంక్రాంతి వేడుకలను వైభ‌వంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది (2026) భోగి - సంక్రాంతి వేడుకల కోసం మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి హైదరాబాద్ నివాసంలో సందడి చేసినట్లు తెలుస్తోంది.




Tags:    

Similar News