ఆ చిల్లు బుగ్గ‌ల్లో లావ‌ణ్యను- ఆ అల్ల‌రిలో వ‌రుణ్‌ని చూస్తారు!

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు మొదటిసారిగా వాయువ్ లుక్ తో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.

Update: 2026-09-11 01:57 GMT

ఎవరైనా ప‌సిబిడ్డ‌ ఈ భూమ్మీదికి రాగానే `ఎవరి పోలిక? మమ్మీలా ఉన్నాడా? డాడీలా ఉన్నాడా?` అంటూ ముచ్చటించుకోవడం సహజం. ఇప్పుడు మెగా వారసుడు వాయువ్ తేజ్ ముఖాన్ని మొదటిసారి చూసిన తర్వాత మెగా అభిమానులు కూడా సరిగ్గా ఇదే రీతిలో తెగ మురిసిపోతున్నారు. 10 సెప్టెంబర్ 2025న జన్మించిన తమ ముద్దుల కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా.. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులు మొదటిసారిగా వాయువ్ లుక్ తో ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు. జెన్ జీ మెగా ప్రిన్స్ నవ్వుతున్న ముఖం ఎంతో క్యూట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తుండటంతో నెట్టింట ఈ ఫోటోలు వైరల్ గా దూసుకెళుతున్నాయి.



 


తమ కుమారుడి మొదటి పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోష‌న‌ల్ సందేశం అందరి హృదయాలను గెలుచుకుంది. ``నా ప్రియమైన బాబు.. నువ్వు నా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చేశావు. నిన్ను మొదటిసారి నా కళ్లతో చూడకముందే నీతో ప్రేమలో పడ్డాను. నీకు తండ్రిని కావడం నా జీవితంలోనే అత్యంత అందమైన ఘట్టం`` అంటూ వరుణ్ తన ఆనందాన్ని షేర్ చేసారు. నవంబర్ 2023లో వివాహబంధంతో ఒకటైన ఈ జంట... రెండేళ్ల తర్వాత తమ జీవితంలోకి అడుగుపెట్టిన చిన్నారితో తండ్రిగా.. తల్లిగా కొత్త అనుభూతిని ఆస్వాధిస్తున్నారు.



 


చిన్నారి వాయువ్ ముఖం చూసిన అభిమానులు అత‌డి పోలికలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా వాయువ్ నవ్వుతున్నప్పుడు పడే సొట్ట బుగ్గలు (డింపుల్స్) అచ్చం వాళ్ల అమ్మ లావణ్య త్రిపాఠిలా ఉన్నాయని.. కళ్లు - ముఖకవళికలు చిన్ననాటి వరుణ్ తేజ్‌లా ఉన్నాయని నెటిజన్లు పోలుస్తున్నారు. ఈ వేడుక సందర్భంగా ఉపాసన కామినేని కొణిదెల, నిహారిక కొణిదెల, సుస్మిత కొణిదెలతో పాటు పి.వి. సింధు, సంగీత దర్శకుడు థమన్, లక్ష్మీ మంచు, వితిక షేరు, రీతికా నాయక్ వంటి పలువురు సినీ, క్రీడా ప్రముఖులు కామెంట్ సెక్షన్ ద్వారా వాయువ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ఈ తీపి క్షణాలను ఆస్వాధిస్తూనే వరుణ్ తేజ్ తన సినీ కెరీర్‌ను కూడా ఎంతో ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన `కొరియన్ కనకరాజు` అనే ఇండో-కోరియన్ హారర్ కామెడీ చిత్రంలో వ‌రుణ్‌ కథానాయకుడిగా అలరించారు. రాయలసీమకు చెందిన యువకుడికి దయ్యం పట్టడం.. తద్వారా కోరియన్ భాష మాట్లాడుతూ యాక్షన్ సీన్స్ చేయడం అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం `భారీ` (Bhari) పనుల్లో బిజీగా ఉన్నారు. యదు వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో వాలీబాల్ క్రీడ ఆధారంగా తెరకెక్కుతోందని గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తుండగా.. ధనుష్ భాస్కర్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కెరీర్‌లో విభిన్నమైన సినిమాలు చేస్తూనే.. కుటుంబంతో ఇలాంటి అరుదైన సెల‌బ్రేష‌న్స్ చేసుకోవ‌డం వ‌రుణ్ కే చెల్లింది. ఇది మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

Tags:    

Similar News