పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్స్ టెన్షన్!
థియేట్రికల్ రిలీజ్‌కు ముందు, ఆ తర్వాత వచ్చే బిజినెస్ లెక్కలకు నిర్మాతలకు దిమ్మ తిరిగిపోతుంది.
టాలీవుడ్ సహా భారతీయ సినీ పరిశ్రమలో ఎంతటి భారీ బడ్జెట్ సినిమాలైనా? ఓటీటీ బిజినెస్ విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు సినిమా మొదలవ్వడమే ఆలస్యం.. భారీ ఆఫర్లతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిర్మాతల దగ్గరకు వచ్చేవి. కానీ మారిన పరిణామాలు, మందగించిన ఓటీటీ మార్కెట్ కారణంగా ఇప్పుడు పెద్ద సినిమాల నిర్మాతలకు ఓటీటీ డీల్స్ పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. థియేట్రికల్ రిలీజ్‌కు ముందు, ఆ తర్వాత వచ్చే బిజినెస్ లెక్కలకు నిర్మాతలకు దిమ్మ తిరిగిపోతుంది.
సినిమా విడుదలకు ముందే ఓటీటీ ఒప్పందాలు చేసుకుంటే ఒక రకమైన ముప్పు పొంచి ఉంటోంది. ముందుగా అనుకున్న విడుదల తేదీకి కట్టుబడి ఉండకపోవడం, షూటింగ్ లేదా రీ-షూట్‌ల వల్ల రిలీజ్ డేట్ మారడం జరిగితే ఓటీటీ సంస్థలు కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయి. ఆలస్యమైన ప్రతి నెలా ఒప్పందంలో పేర్కొన్న మొత్తంలో భారీగా కోత విధించడమో లేదా డీల్‌ను రద్దు చేసుకోవడమో చేస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
ఒకవేళ థియేటర్ రిలీజ్ తర్వాతే ఓటీటీ డీల్ మాట్లాడుకుందామని ఆగితే అక్కడ మరో పెద్ద ప్రమాదం పొంచి ఉంది. బాక్సాఫీస్ వద్ద సినిమా ఫలితం తేడా కొడితే ఆ ప్రభావం నేరుగా ఓటీటీ డిమాండ్‌పై పడుతోంది. ఇటీవల విడుదలైన `టాక్సిక్` చిత్రానికే ఈ పరిస్థితి ఎదురైంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు 200 కోట్లకు పైగా ఆఫర్ చేయగా నిర్మాతలు ఆగారు. కానీ థియేటర్లలో ఫలితం ప్రతికూలంగా రావడంతో ఆ తర్వాత ఓటీటీ సంస్థలు సగం ధరకు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాని దారుణ పరిస్థితి నెలకొంది.
ఈ విపరీతమైన ఒత్తిడిని త్వరలో విడుదల కాబోతున్న పలు ప్రతిష్టాత్మక చిత్రాలు ఎదుర్కొంటున్నాయి. ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న `ఫౌజీ`, నాని నటిస్తోన్న `పారడైజ్` చిత్రాలకు ఓటీటీ హక్కుల విషయంలో చర్చలు సాగుతున్నాయి. ప్రొడక్షన్ ఆలస్యం కాకుండా చూసుకోవడం అదే సమయంలో సరైన ధరకు డీల్ క్లోజ్ చేయడం నిర్మాతలకు పెద్ద సవాలుగా మారింది.
మెగాస్టార్ చిరంజీవి సోషియో-ఫాంటసీ చిత్రం `విశ్వంభర`, నాగచైతన్య ప్రాజెక్ట్ `వృషకర్మ`, సాయితేజ్ `సంబరాల ఏటిగట్టు` వంటి చిత్రాలు కూడా ఈ ప్రెజర్‌ను ఫేస్ చేస్తున్నాయి. భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలు థియేట్రికల్ రన్‌తో పాటు ఓటీటీ వర్జిన్‌ను ఎలా రికవర్ చేయాలనే దానిపై బిజినెస్ స్కేల్స్ వేసుకుంటున్నాయి. చిన్న తేడా వచ్చినా రికవరీ కష్టమవుతుందనే భయం వెంటాడుతోంది.
ఒకప్పుడు నిర్మాతలకు సేఫ్ జోన్‌గా కనిపించిన ఓటీటీ మార్కెట్ ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. రిలీజ్ డేట్ ఖచ్చితత్వం, బాక్సాఫీస్ సక్సెస్ గ్యారెంటీ అనే రెండింటి మధ్య నలిగిపోతున్న పెద్ద చిత్రాల నిర్మాతలు ఈ ఓటీటీ టెన్షన్ నుంచి బయటపడేందుకు సరికొత్త బిజినెస్ మోడల్స్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.