రామాయణం: అప్పట్లో భాగస్వాములతో కుదరలేదా!
దీనిపై రెడ్డిట్ వేదికగా సినీ ప్రియుల విశ్లేషణలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఈ అంశంపై పలు ఆసక్తికరమైన చర్చలు జరిగాయి..
కొన్ని కాంబినేషన్లు అనూహ్యంగా వర్కవుట్ అవుతాయి. కానీ కొన్నిటికి ఎంత ప్లాన్ చేసినా అవి వర్కవుట్ కావు. అలాంటి కాంబినేషన్ గురించి ఇప్పుడు `రామాయణం` రిలీజ్ సమయంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. దంగల్ ఫేం నితీష్ తివారీ దాదాపు 9 ఏళ్ల క్రితం గీతా ఆర్ట్స్ తో కలిసి పురాణేతిహాసం `రామాయణం`పై ట్రయాలజీ తీయాలని కలలు గన్నారు. అప్పట్లోనే మహేష్, రామ్ చరణ్ లాంటి తెలుగు హీరోలు శ్రీరాముడిగా నటిస్తారని కూడా ఊహాగానాలు సాగాయి. ఈ సిరీస్ కోసం 500 -600 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుందని కూడా గుసగుసలు వినిపించాయి. మూడు భాగాలుగా తెరకెక్కించాలంటే ఒక్కో భాగానికి కనీసం 200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసారు. నాటి వివరాల్లోకి వెళితే...
2017 మే నెలలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (గీతా ఆర్ట్స్).. బాలీవుడ్ నిర్మాత మధు మంతెన.. ప్రైమ్ ఫోకస్-DNEG అధినేతి నమిత్ మల్హోత్రా సంయుక్తంగా `రామాయణం` ఇతిహాసాన్ని ట్రయాలజీ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నితేష్ తివారీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఆ సమయంలో టాలీవుడ్‌లో రామ్ చరణ్ లేదా మహేష్ బాబులలో ఒకరిని శ్రీరాముడి పాత్ర కోసం అల్లు అరవింద్ పరిశీలిస్తున్నారనే వార్తలు గట్టిగా వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కింగ్ సైజ్ ఇమేజ్, గీతా ఆర్ట్స్ హోమ్ బ్యానర్ కావడం ..`మగధీర` వంటి చిత్రాల్లో చూపించిన రాయల్ అప్పీల్ వల్ల రామ్ చరణ్ శ్రీరాముడిగా నటిస్తారనే ప్రచారం విపరీతంగా సాగింది.
ప్రాజెక్ట్ ఎందుకు ఆలస్యమై ఆగిపోయింది?
అయితే సినిమా ప్రారంభ దశలో హిందీ-తెలుగు కాస్టింగ్ - బడ్జెట్ షేరింగ్ విషయంలో నిర్మాతల మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చాయని గుసగుసలు వినిపించాయి. క్రియేటివ్ డిఫరెన్సెస్ గురించి చర్చ సాగింది. అదే సమయంలో కోవిడ్-19 పాండమిక్ కల్లోలంగా మారింది. 2020లో వచ్చిన కరోనా మహమ్మారి వల్ల ప్రణాళికలన్నీ తలకిందులయ్యాయి.
ఆ తర్వాత నితేష్ తివారీ ప్లానింగ్ మారింది. ఈ చిత్రాన్ని 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో (రెండు భాగాలుగా) అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని భావించారు. దాంతో గీతా ఆర్ట్స్ - మధు మంతెన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోగా నమిత్ మల్హోత్రా - ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్.. కేజీఎఫ్ స్టార్ యష్ తో కలిసి పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. దాంతో రామ్ చరణ్ స్థానంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణాసురుడిగా నూతన కాస్టింగ్ రూపుదిద్దుకుంది.
దీనిపై రెడ్డిట్ వేదికగా సినీ ప్రియుల విశ్లేషణలు కూడా ఆసక్తిని రేకెత్తించాయి. ఈ అంశంపై పలు ఆసక్తికరమైన చర్చలు జరిగాయి..
కొందరు నెటిజన్లు రామ్ చరణ్ శ్రీరాముడిగా నటించి ఉంటే సౌత్ ఆడియన్స్ కనెక్టివిటీ - మాస్ అప్పీల్ వేరే లెవల్‌లో ఉండేదని అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు RRR లో అల్లూరి సీతారామరాజుగా (శ్రీరాముడి గెటప్‌లో) రామ్ చరణ్‌ను ఇప్పటికే చూశాం కాబట్టి... మళ్లీ ప్యూర్ డివైన్ క్యారెక్టర్‌లో చూస్తే ఓవర్‌లాప్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషించారు. మరికొందరు రెడ్డిటర్లు మహేష్ అయితే శ్రీరాముడిగా వందశాతం యాప్ట్ అని కూడా విశ్లేషించారు.
గీతా ఆర్ట్స్ ఉన్నంత వరకు ఇది తెలుగు-హిందీ ద్విభాషా ప్రాజెక్ట్‌గా ఉండేదని, కానీ అల్లు అరవింద్ తప్పుకున్నాక ప్రాజెక్ట్ పూర్తి బాలీవుడ్ లేదా గ్లోబల్ సెంట్రిక్‌గా మారిందని చర్చించారు. హిందీ నటుడైన రణ్‌బీర్ కపూర్‌ను శ్రీరాముడిగా ఎంపిక చేయడంతో పాన్-గ్లోబల్ స్కేల్‌లో ప్రమోట్ చేయడానికి మేకర్లకు సులువవుతుందని.. కానీ రామ్ చరణ్ ఉండి ఉంటే సౌత్ మార్కెట్‌లో కంబైన్డ్ కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చేవని రెడ్డిట్ యూజర్లు కామెంట్ చేశారు. కొన్నాళ్ల పాటు బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ డ్రైవ్ కొనసాగింది. కానీ చివరికి నమిత్ మల్హోత్రా తన భారీ విజన్ ని నెరవేర్చుకునేందుకు రాకింగ్ స్టార్ యష్ - నితీష్ తివారీలతో కలిసి ప్రయాణాన్ని కొనసాగించడం ఇప్పుడు రామాయణం చిత్రం రెండు భాగాలుగా ప్రజల ముందుకు వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. చరణ్, మహేష్ మిస్ చేసుకున్నా కానీ, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా ఏ మేరకు మెప్పిస్తున్నారో వేచి చూడాల్సి ఉంది.