ట్రెండీ టాక్‌: ఆ ఇద్ద‌రి కాంబోలో సినిమా ఎందుకు సాధ్యం కాలేదు?

జాతీయ ప‌త్రిక‌లు ఆరోజుల్లోనే `బిగ్గ‌ర్ దేన్ బ‌చ్చ‌న్!` అంటూ మెగాస్టార్ చిరంజీవిపై క‌థ‌నం రాసాయి! అంటే ఒక తెలుగు స్టార్ గొప్ప‌త‌నానికి ఎంత‌టి గుర్తింపు ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు.

Update: 2026-10-28 17:30 GMT

భార‌తీయ సినీప‌రిశ్ర‌మ‌లో ఇద్ద‌రు దిగ్గ‌జ హీరోలు మెగాస్టార్ చిరంజీవి- విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్. అమితాబ్, ర‌జ‌నీకాంత్ కంటే భిన్న‌మైన ఇమేజ్ ఉన్న స్టార్లు కూడా. లెజెండ‌రీలైన‌ అమితాబ్, ర‌జనీ అభిమానం చూర‌గొన్న న‌టులు ఆ ఇద్ద‌రూ. భార‌తీయ సినిమా రంగంలో న‌లుగురు దిగ్గ‌జ హీరోలుగా వీరికి స‌మాంత‌ర‌మైన‌ గుర్తింపు ఉంది. కేవ‌లం ఏదో ఒక భాష‌కే వీరి ప్ర‌తిభ ప‌రిమితం కాలేదు. అన్ని భాష‌ల‌లోను స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఇలాంటి దిగ్గ‌జ హీరోలు ఏం చేస్తున్నా అభిమానుల‌తో పాటు, ప్ర‌జ‌లు ఎంతో ఆస‌క్తిగా గ‌మ‌నిస్తారు.

జాతీయ ప‌త్రిక‌లు ఆరోజుల్లోనే `బిగ్గ‌ర్ దేన్ బ‌చ్చ‌న్!` అంటూ మెగాస్టార్ చిరంజీవిపై క‌థ‌నం రాసాయి! అంటే ఒక తెలుగు స్టార్ గొప్ప‌త‌నానికి ఎంత‌టి గుర్తింపు ద‌క్కిందో అర్థం చేసుకోవ‌చ్చు. అందుకే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హోస్టింగ్ చేస్తున్న మెగావ‌ర్స్- నెట్ ఫ్లిక్స్ షోలో ఎవ‌రెవ‌రు అతిథులుగా పాల్గొంటారు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అమితాబ్ బ‌చ్చ‌న్, ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ వంటి స్టార్లు మెగాస్టార్ కి ఒక్క ఫోన్ కాల్ ట‌చ్ లో ఉంటారు గ‌నుక ఆ న‌లుగురు దిగ్గ‌జాలు ఈ షోకోసం విచ్చేస్తే అది ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌ని కూడా ఊహిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ మెగాస్టార్ చిరంజీవికి చాలా త్వ‌ర‌గా అందుబాటులోకి వ‌చ్చార‌నే స‌మాచారం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అమితాబ్, ర‌జ‌నీకాంత్, క‌మ‌ల్ హాస‌న్ రేంజు స్టార్లు ఒక షో కోసం అందుబాటులోకి రావాలంటే అది అంత సులువైన విష‌యం కాదు. వారి ఇత‌ర షెడ్యూల్స్ ని మ్యానేజ్ చేస్తూ చిరు షో కోసం అతిథులుగా రావాల్సి ఉంటుంది. దానికి చాలా ముంద‌స్తు ప్ర‌ణాళిక, క‌స‌ర‌త్తు అవ‌స‌రం అవుతుంది. ప్ర‌స్తుతానికి క‌మ‌ల్ హాస‌న్ చిరుకు అందుబాటులో ఉన్నార‌నే టాక్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

నిజానికి బుల్లితెర‌పైనే కాదు.. చిరు- క‌మ‌ల్ హాస‌న్ క‌లిసి ఒక సినిమా చేయాల‌ని అభిమానులు చాలా కాలంగా ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఆ ఇద్ద‌రికీ గురువు అయిన బాల‌చంద‌ర్ అప్ప‌ట్లో `ఇది క‌ద కాదు` చిత్రంతో వారిని క‌లిపారు. కానీ ఇప్పుడు అలాంటిది సాధ్యం కాలేదు. ఆ ఇద్ద‌రూ ఎవ‌రి దారిలో వారు అగ్ర హీరోలుగా దూసుకెళ్లారు. ఆ ఇద్దరినీ క‌లిపి సినిమా తీయాల‌నే ఆలోచ‌న ఎవ‌రూ చేయ‌లేక‌పోయారు. అంత‌టి స‌త్తా ఉన్న ద‌ర్శ‌కులు ఉన్నా కానీ.. ప్ర‌య‌త్నాలు ఫెయిల‌య్యాయ‌ని క‌థ‌నాలొచ్చాయి. 1979లో కె. బాలచందర్ తెరకెక్కించిన `ఇది కథ కాదు` చిత్రం తర్వాత కాల‌గ‌మ‌నంలో ఎవ‌రికి వారు పెద్ద స్టార్లు అయ్యారు. చిరంజీవి టాలీవుడ్‌లో `మాస్ అండ్ కమర్షియల్ కింగ్`గా ఎదిగితే.. కమల్ హాసన్ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఇద్దరూ తమ తమ భాషల్లో అగ్ర స్థానాలకు చేరుకోవడంతో.. వారిద్దరినీ కలిపి సినిమా తీయాలనే ఆలోచన ఎంతోమందికి వచ్చినా ఆ దిశగా అడుగులు పడలేదు.

ఇలాంటి భారీ మల్టీస్టారర్ సాధ్యపడకపోవడానికి ప్రధాన కారణం ఇద్దరి స్టార్‌డమ్‌లను సమంగా బ్యాలెన్స్ చేయడమే. ఇద్దరు అగ్ర నటులకు సమానమైన స్క్రీన్ టైమ్, కథలో ప్రాధాన్యత- పవర్‌ఫుల్ ఎలివేషన్లు ఇవ్వడం ఏ దర్శకుడికైనా పెద్ద సవాలే. మణిరత్నం, గౌతమ్ మీనన్ వంటి దిగ్గజ దర్శకులు పలు సందర్భాల్లో వీరి కాంబోలో మల్టీస్టారర్ తీయాలని భావించినా సరైన స్క్రిప్ట్ కుదరకపోవడం వల్ల ఆ ప్రయత్నాలన్నీ ప్రాథమిక దశలోనే ఆగిపోయాయి. ఏ ఒక్కరి పాత్ర కొద్దిగా తగ్గినా అభిమానుల అంచనాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ప్రయోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేకపోయారు.

అయితే వెండితెరపై నెరవేరని ఈ అరుదైన కల కలయిక ఇప్పుడు బుల్లితెర-ఓటీటీ వేదికగా సాకారం కాబోతుండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్ `మెగా వర్స్` టాక్ షోతో ఇది సాధ్య‌మ‌వ్వ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒకప్పుడు సాధ్యం కాని మల్టీస్టారర్ సినిమా అనే మ్యాజిక్.. మారుతున్న నేటి పాన్-ఇండియా ట్రెండ్‌లో భవిష్యత్తులో బిగ్ స్క్రీన్‌పై కూడా నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ ప్రియులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిరు టాక్ షో విష‌యానికి వ‌స్తే.. బాలకృష్ణ `అన్‌స్టాపబుల్` వంటి షోల బాటలోనే ఈ `మెగా వర్స్` టాక్ షో మొదటి సీజన్‌లో మొత్తం 15 ఎపిసోడ్‌లు ఉండనున్నాయి. క‌మెడియ‌న్లు బ్రహ్మానందం, సునీల్, సత్యలతో ఒక వినోదాత్మక ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా.. త్వరలోనే కమల్ హాసన్‌తో ఎపిసోడ్ చిత్రీకరించనున్నారని స‌మాచారం.

Tags:    

Similar News