బలమైన పునాది పై అంతే బలంగా బన్నీ గోడలు!
మలయాళ చిత్రసీమలో తెలుగు నటుడు అల్లు అర్జున్ సాధించిన విజయం, పొందిన ప్రజాదరణ భారతీయ సినిమాలో ప్రత్యేకమైన అధ్యాయం.
మలయాళ చిత్రసీమలో తెలుగు నటుడు అల్లు అర్జున్ సాధించిన విజయం, పొందిన ప్రజాదరణ భారతీయ సినిమాలో ప్రత్యేకమైన అధ్యాయం. ఏ ఇతర తెలుగు హీరోకూ సాధ్యం కాని రీతిలో కేరళలో బన్నీకి తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అక్కడ బన్నీ అభిమానులు ప్రేమగా `మల్లు అర్జున్` అని పిలుచుకుంటారు. ఆ రకంగా అక్కడ పడిన బలమైన పునాది ఆధారంగా మాలీవుడ్‌లో బన్నీ తన మార్కెట్‌ను ..పరిధిని మరింత విస్తృతం చేసేందుకు సమగ్రమైన వ్యూహంతో అడుగులు వేస్తున్నారు.
మలయాళంలో బన్నీకి లభించిన ఆదరణ ఒక్కరోజులో వచ్చింది కాదు. ఆయన తొలి చిత్రాలు `ఆర్య`, `బన్నీ`, `హ్యాపీ` సమయం నుంచే కేరళ ప్రేక్షకులు బన్నీ డ్యాన్సులు, స్టైల్, యాక్టింగ్‌కు ఫిదా అయ్యారు. బన్నీ సినిమాలు డబ్బింగ్ అయి అక్కడ విడుదలైన ప్రతిసారీ ప్రత్యక్ష మలయాళ చిత్రాలకు సమానంగా వసూళ్లు సాధించాయి. అలా దశాబ్ద కాలానికి పైగా అక్కడ ఏర్పడిన బలమైన ఫ్యాన్ బేస్, బన్నీకి మాలీవుడ్‌లో తిరుగులేని స్ట్రాంగ్ పునాదిగా నిలిచింది.
ఈ బలమైన పునాది పైనే ఇప్పుడు బన్నీ మరింత ఎత్తుకు ఎదిగేలా బలమైన గోడలను నిర్మించే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా బన్నీ మాలీవుడ్ పరిశ్రమలోని ప్రముఖులతో సత్సంబంధాలు నెరపడంపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్కడ ఎప్పటికప్పుడు రూపొందుతున్న కొత్త తరహా చిత్రాలను పరిశీలిస్తున్నారు. అక్కడి నిర్మాతలతో, నటీనటులతో , సాంకేతిక నిపుణులతో టచ్‌లో ఉంటున్నారు. ఇది బన్నీ సుదీర్ఘ ప్రణాళికకు నిదర్శనంగా నిలుస్తోంది.
మలయాళ సినిమాల్లోని కథాబలం, అక్కడి నటీనటుల సహజ సిద్ధమైన నటన , దర్శకుల మేకింగ్ శైలిని బన్నీ బహిరంగంగానే ప్రశంసిస్తున్నారు. అక్కడి కళాకారుల ప్రతిభను గుర్తించి సోషల్ మీడియా వేదికగా లేదా వేడుకల్లో వారిని ప్రశంసించడం ద్వారా అక్కడి చిత్రసీమతో బన్నీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటు న్నారు. ఈ విధమైన గౌరవం , సహకారం మాలీవుడ్ వర్గాల్లో బన్నీ పట్ల ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేస్తోంది.
మాలీవుడ్ చిత్రసీమలోని ప్రతిభావంతులైన దర్శకులు, రచయితలతో భవిష్యత్తులో నేరుగా ప్రాజెక్టులు చేసే అవకాశాలను కూడా బన్నీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పాన్-ఇండియా స్థాయికి ఎదిగిన తరుణంలో మాలీవుడ్ దర్శకుల ప్రత్యేకమైన కథా కథన శైలిని తన మాస్ ఇమేజ్‌కు జోడిస్తే సరికొత్త రికార్డులు సృష్టించవచ్చని బన్నీ యోచిస్తున్నారు. ఈ రకమైన ఆలోచనలు బన్నీ భవిష్యత్ సినిమాల విస్తృతికి ఎంతో దోహదపడతాయన్నది కాదనలేని నిజం.
మొత్తానికి బన్నీ కేరళ ప్రేమను సరిగ్గా సద్వినియోగం చేసుకుంకున్నారు. అక్కడ సరైన సంబంధాలు , ఆత్మీ యతతో తన స్థానాన్ని మరింత మెరుగు పరుచుకుంటున్నారు. పునాది ఎంత బలంగా ఉందో? దానిపై నిర్మిస్తున్న ఈ గోడలు కూడా అంతే బలంగా మారి మాలీవుడ్‌లో బన్నీ ప్రయాణాన్ని సుదీర్ఘ కాలం పాటు తిరుగులేనిదిగా నిలబెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.