ఈవారంతో 'ఇరుముడి'కి బ్రేక్ పడేనా?

రవితేజ ఇరుముడి సినిమా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం నుంచి మూడో వారం వరకు వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది.

Update: 2026-09-10 17:30 GMT

రవితేజ ఇరుముడి సినిమా మూడు వారాలు పూర్తి చేసుకుంది. మొదటి వారం నుంచి మూడో వారం వరకు వసూళ్ల జోరు కొనసాగుతూనే ఉంది. ఊర్ల నుంచి ట్రాక్టర్ల మీద, బండ్ల మీద వచ్చి మరీ సినిమాలు చూస్తున్నారు. కాలనీల నుంచి ఆటోల్లో జనాలు వచ్చి థియేటర్ల వద్ద క్యూ కట్టారు. దాంతో ఇరుముడి సినిమా మూడు వారాలు ముగిసే వరకు దాదాపుగా రూ.230 కోట్ల వసూళ్లు నమోదు చేసింది. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు చెబుతున్న దాని ప్రకారం ఇండియాలో ఇప్పటివరకు రూ.180 కోట్లు వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవర్సీస్‌లోనూ సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. రవితేజ కెరీర్‌ హైయెస్ట్‌ గ్రాసర్‌గా ఈ సినిమా నిలిచింది. గడచిన పదేళ్ల కాలంలో ఏ సినిమా మూడో వారంలో సాధించని వసూళ్లు ఇరుముడి సినిమా సాధించింది. ఈ ఒక్కటే కాకుండా చాలా రికార్డ్‌లను ఇరుముడి సొంతం చేసుకుంది.

ఇరుముడి కలెక్షన్స్‌ రూ.250 కోట్లు...

ఈ మధ్య కాలంలో ఎంత సూపర్‌ హిట్‌ మూవీ అయినా మొదటి వారంలో సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లు సాధించి, రెండో వారంకు డ్రాప్‌ కావడం మనం చూస్తున్నాం. ఎంత పెద్ద స్టార్‌ సినిమా అయినా విడుదలైన రెండు వీకెండ్స్ వరకు వసూళ్లు రాబడుతున్నాయి. మూడో వీకెండ్‌ వరకు థియేటర్లలో ఉన్నా కూడా పెద్దగా ప్రభావం చూపించడం లేదు. ఇతర హీరోల పోటీతో పాటు, పలు కారణాల వల్ల మూడో వారం థియేటర్లకు జనాలు రావడం లేదు. కానీ ఇరుముడి సినిమాకు మూడు వారాలు థియేటర్ల వద్ద క్యూ కనిపించింది. ఈ వీకెండ్‌ కి సైతం కచ్చితంగా పెద్ద ఎత్తున వసూళ్లు నమోదు కావడం ఖాయం. మైత్రి మూవీ మేకర్స్ వారి అంచనా మేరకు రూ.250 కోట్ల క్లబ్‌లో సినిమా చేరుతుందని అంటున్నారు. అందుకు గాను ఈ వీకెండ్‌లో ఇరుముడి సినిమా స్ట్రాంగ్‌గా నిలబడాలి. ఈ వారం విడుదల అయిన సినిమాలను బట్టి ఇరుముడి ఈ వారం వసూళ్లు ఆధారపడి ఉంటాయి.

కార్తీ సర్దార్‌ 2 రిలీజ్‌...

నేడు సర్దార్‌ 2 తో కార్తీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రేపు ఆనంద్‌ దేవరకొండ 'ఎపిక్‌' మూవీ సైతం విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో కార్తీకి ఉన్న మార్కెట్‌ నేపథ్యంలో సర్దార్‌ 2 సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తే మంచి వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. ఇక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా, రొమాంటిక్ టచ్‌తో రాబోతున్న ఎపిక్‌ సైతం భారీ అంచనాలు మోస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు హిట్‌ టాక్‌ వచ్చినా, ప్రేక్షకులు కనెక్ట్‌ అయినా ఇరుముడి సినిమా వసూళ్లకు బ్రేక్ పడే అవకాశం ఉంది. మరో వైపు ఇరుముడి ఓటీటీ అప్‌డేట్‌ వచ్చింది. సెప్టెంబర్‌ చివరి వారంలో ఇరుముడి సినిమా స్ట్రీమింగ్‌ మొదలు అయ్యే అవకాశం ఉంది. కనుక మరో వారంలో ఓటీటీ లో రాబోతుంది కనుక థియేటర్లకు ఏం వెళ్తాం అనుకునే వారు కూడా ఉంటారు. అందుకే నాలుగో వారంలో వసూళ్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

ఆనంద్‌ దేవరకొండ ఎపిక్‌ రిలీజ్‌..

ఈ వారం విడుదల అయ్యే సినిమాల ఫలితాలను బట్టి ఇరుముడి చివరి వారం కలెక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే ఓటీటీ లో నాలుగో వారం వచ్చే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు కాస్త ఆసక్తి తగ్గవచ్చు. అయితే బాక్సాఫీస్‌ వద్ద మంచి సినిమాలు ఏమీ లేకుంటే ఇరుముడి వైపే మళ్లీ ప్రేక్షకులు మొగ్గు చూపిన ఆశ్చర్యం లేదు. కనుక నేడు, రేపు విడుదల అయ్యే సినిమాల ఫలితాలను బట్టి ఇరుముడి నాలుగో వారం కలెక్షన్స్ ఉంటాయి. ఇప్పటికే ఇరుముడి అనుకున్న దాని కంటే దాదాపు రెండు మూడు రెట్లు ఎక్కువ వసూళ్లు సాధించింది. కనుక ఇంకా ఎంత వచ్చినా అది బోనస్‌గానే మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతలు భావిస్తారు. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ఇప్పటికే మంచి లాభాలను దక్కించుకున్నారు. ఈ మధ్య కాలంలో ఈ స్థాయి లాభాలను తెచ్చి పెట్టిన సినిమా ఇరుముడి మాత్రమే అని బయ్యర్లు బలంగా చెబుతున్నారు.

Tags:    

Similar News