'కరుప్పు' మేకర్స్ Vs త్రిష.. అసలేం జరిగింది? ఎవరిది తప్పు?
సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్ల బాధ్యతగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో, అదే అంశంపై మరోసారి చర్చ మొదలైంది.;
సినిమా షూటింగ్ పూర్తయ్యాక ప్రమోషన్స్ లో పాల్గొనడం హీరోహీరోయిన్ల బాధ్యతగా మారిపోయిన ప్రస్తుత రోజుల్లో, అదే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. తాజాగా కరుప్పు సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా చోటుచేసుకున్న వివాదం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ వ్యవహారంలో త్రిష కృష్ణన్, మూవీ టీమ్ మధ్య చిన్న మాటల యుద్ధం పెద్ద చర్చకు దారి తీసింది.
సూర్య హీరోగా, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కరుప్పు మే 14వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రమోషన్స్ వేగం పెంచిన మేకర్స్ ఇటీవల గ్రాండ్ గా ఆడియో లాంచ్ నిర్వహించారు. అయితే ఆ కార్యక్రమానికి హీరోయిన్ త్రిష హాజరుకాకపోవడం వివాదానికి కారణమైంది. మొదట్లో త్రిష ప్రమోషన్స్ కు దూరంగా ఉంటోందనే విమర్శలు వచ్చాయి.
షూటింగ్ పూర్తయితే చాలు.. ప్రమోషన్స్ కు రావడం లేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లు ఇలా చేయడం సరైన పద్ధతి కాదని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. త్రిష తన సోషల్ మీడియా రిప్లై ద్వారా అసలు విషయాన్ని పరోక్షంగా బయటపెట్టారు. సినిమా టీమ్ ఆమెకు ఆడియో లాంచ్ కు అధికారికంగా ఆహ్వానం పంపలేదని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు.
ఇటీవల విడుదలైన త్రిష ఫస్ట్ లుక్ వీడియోకు ఒక అభిమాని 'సినిమాలో త్రిష ఉందన్న విషయం మర్చిపోయాను' అని కామెంట్ చేయగా, దానికి త్రిష 'నేనూ మర్చిపోయాను.. ఇప్పటికైనా గుర్తు చేసినందుకు థాంక్స్' అంటూ వ్యంగ్యంగా రెస్పాండ్ అయ్యారు. ఆ ఒక్క కామెంట్ తోనే వివాదం మళ్లీ ముదిరింది. దీనిపై ఒక సూర్య ఫ్యాన్ ప్రశ్నించగా, త్రిష మరోసారి కౌంటర్ ఇచ్చారు.
'నా ఇన్విటేషన్ బహుశా మెయిల్ లో మిస్ అయి ఉంటుందిలే' అంటూ తాను ఇన్విటేషన్ అందుకోలేదని క్లియర్ గా చెప్పారు. దీంతో కథ మొత్తం మలుపు తిరిగింది. ఇక సోషల్ మీడియా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొందరు త్రిషకు మద్దతుగా నిలుస్తూ, 'పిలవకుండా ఎలా వస్తుంది? పోస్టర్లలో పేరు పెట్టడం మాత్రమే సరిపోదు' అంటున్నారు. మరోవైపు, కొందరు మాత్రం స్టార్ హీరోయిన్ గా ముందే కోఆర్డినేట్ చేసుకోవాలంటూ ఆమెపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
దీంతో మొత్తం విషయంలో ఎవరిది తప్పు అన్నది చూస్తే.. మొదటిగా కమ్యూనికేషన్ లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సినిమా యూనిట్ నుంచి సరైన ఇన్విటేషన్ వెళ్లకపోయి ఉంటే, అది మేకర్స్ బాధ్యత. అదే సమయంలో త్రిష కూడా పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో వ్యంగ్యంగా స్పందించడం వల్ల వివాదం మరింత పెరిగింది. ఏదేమైనా చిన్న అపార్థం పెద్ద చర్చగా మారింది. సినిమా రిలీజ్ ముందు ఇలాంటి వివాదాలు ప్రమోషన్ కు యూజ్ అవుతాయని వాదన కూడా వినిపిస్తోంది. కానీ నిజంగా చూస్తే క్లియర్ కమ్యూనికేషన్ ఉంటే పరిస్థితి వచ్చేది కాదన్నది నెటిజన్ల అభిప్రాయం.