మెగాస్టార్ సొంత‌ ఇల్లు వ‌దిలేయ‌డానికి మాఫియా బెదిరింపులే కార‌ణ‌మా?

ఇప్పుడు అత‌డు, అత‌డి కుటుంబీకులు ఉన్నట్టుండి ఇల్లు మారేందుకు సిద్ధమవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Update: 2026-06-27 22:30 GMT

బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ తన నివాసమైన బాంద్రాలోని `గెలాక్సీ అపార్ట్‌మెంట్స్`ను వీడనున్నారనే వార్త ఇప్పుడు సినీప‌రిశ్ర‌మ‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయ‌న ద‌శాబ్ధాలుగా సెంటిమెంట్ గా భావించే ఈ అపార్ట్ మెంట్ ని అక‌స్మాత్తుగా వ‌దిలేయ‌డానికి కార‌ణ‌మిమిటి? అంటూ ఒక‌టే చ‌ర్చ మొద‌లైంది. నిజానికి మాఫియా బెదిరించి రెండేళ్లు గడిచిపోయిన త‌ర్వాత ఇప్పుడే అత‌డు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

1974 నుండి గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోనే నివసిస్తున్న సల్మాన్ కి అది సెంటిమెంట్ ఇల్లు. పై అంత‌స్తుల్లో త‌ల్లిదండ్రులు నివ‌శిస్తుంటే, ఒక సింగిల్ బెడ్ రూమ్ లో స‌ల్మాన్ ఒక్క‌డే ఉంటున్నాడు. ఇప్పుడు అత‌డు, అత‌డి కుటుంబీకులు ఉన్నట్టుండి ఇల్లు మారేందుకు సిద్ధమవ్వడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. స‌రిగ్గా రెండేళ్ల క్రితం గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు బహిరంగంగా తుపాకీ కాల్పులు జరిపిన త‌ర్వాత వెలువడిన నిర్ణ‌య‌మిది. ఆ ప్రమాదం తర్వాత సల్మాన్ ఖాన్‌కు ప్రభుత్వం Y ప్ల‌స్ కేటగిరీ భద్రతను కల్పించింది. కాల్పులు జరిగిన ఇంతకాలానికి సల్మాన్ ఇల్లు మారడానికి అసలు కారణం ఏమిటనేది మిస్టరీగా ఉన్నా.. భద్రతా కారణాలే ప్రధానమని అంచ‌నా వేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ కుటుంబం కోసం బాంద్రాలోని చింబై ప్రాంతంలో ఒక సరికొత్త ఆరు అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించేందుకు మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ (MCZMA) నుండి తాజాగా అనుమతులు లభించాయ‌ని తెలిసింది. సల్మాన్ తల్లి సల్మా ఖాన్ పేరిట ఉన్న ఈ స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్, స్టిల్ట్ పార్కింగ్‌తో పాటు ఆరు అంతస్తులతో సకల వసతులు, హై-సెక్యూరిటీతో కూడిన సరికొత్త `సీసైడ్` హోమ్‌ను నిర్మించబోతున్నారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించ తలపెట్టిన ఇల్లు ప్రధాన రహదారికి దూరంగా, అత్యంత ప్రశాంతమైన వీధిలో ఉండటం వల్ల సల్మాన్ కుటుంబానికి ప్రైవసీతో పాటు మెరుగైన భద్రత లభిస్తుందని భద్రతా నిపుణులు భావిస్తున్నారు.

ముంబై అండర్ వరల్డ్ బెదిరింపులతో అడ్రస్ మార్చిన ప్రముఖులు

ముంబై అండర్ వరల్డ్ మాఫియా లేదా గ్యాంగ్‌స్టర్ల నుండి బెదిరింపులు ఎదురైన‌ప్పుడు ప‌లువ‌రు బాలీవుడ్ స్టార్లు, నిర్మాతలు తమ ఇళ్లను వదిలి అద్దె ఇళ్లకు లేదా అడ్రస్ లేకుండా రహస్య ప్రాంతాలకు వెళ్లిపోవడం కొత్తేమీ కాదు. 90వ దశకంలో డి-కంపెనీ (దావూద్ ఇబ్రహీం), అబూ సలేం వంటి మాఫియా డాన్ల నుండి విపరీతమైన వసూళ్ల బెదిరింపులు ఎదురైనప్పుడు రాకేష్ రోషన్, కరణ్ జోహార్ వంటి ఎందరో అగ్ర నిర్మాతలు, దర్శకులు తమ నివాసాలను తాత్కాలికంగా మార్చేశారు. ప్రాణభయంతో కొందరు నిర్మాతలు తమ ఆఫీసులను అద్దె భవనాలకు మార్చడమే కాకుండా, విదేశాలలో అజ్ఞాతంలోకి వెళ్లిన సందర్భాలు కూడా బాలీవుడ్ చరిత్రలో ఉన్నాయి. అంతెందుకు సంచ‌ల‌నాల ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌కు కూడా ముంబై మాఫియా నుంచి బెదిరింపులు వ‌చ్చాయ‌ని క‌థ‌నాలొచ్చాయి.

సల్మాన్ కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన‌ వివరాలు..

సల్మాన్ ఖాన్ కొత్త ఇంటి నిర్మాణ బాధ్యతలను `సచ్ డెవలపర్స్` సంస్థ దక్కించుకుంది. సుమారు 1,014 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్న‌ ఈ ప్రాజెక్ట్‌కు గత ఏడాది అక్టోబర్‌లోనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ఇప్పుడు కోస్టల్ జోన్ క్లియరెన్స్ కూడా రావడంతో పనులు వేగవంతం కానున్నాయి. అయితే ఈ నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను కఠినంగా అమలు చేయనున్నారు. అక్కడ ఉన్న ఏ ఒక్క పాత చెట్టును నరకకూడదని... దానికి బదులుగా స్థానిక జాతులకు చెందిన సరికొత్త మొక్కలను ఆవరణ చుట్టూ నాటాలని అధికారులు షరతు విధించారు. ఈ కొత్త ఇల్లు పూర్తయిన తర్వాత సల్మాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను శాశ్వతంగా వదిలేస్తారా లేదా అనేది అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

సౌత్ ఇండస్ట్రీలో బెదిరింపులు- ఇళ్లు మారిన తారల వ్యవహారాలు

ఇలాంటి అండర్ వరల్డ్ బెదిరింపుల కారణంగా ఇళ్లు మారిన బాపతు వ్యవహారాలు సౌత్ లో లేక‌పోయినా ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఇలాంటి అరుదైన ఘ‌ట‌నల‌ను చూసాం. గతంలో తమిళనాట వివాదాస్పద కథాంశాలతో సినిమాలు తీసిన కొందరు దర్శకులకు, నటులకు మతపరమైన లేదా రాజకీయ గ్రూపుల నుండి ప్రాణబెదిరింపులు వచ్చాయి. మ‌ణిర‌త్నం వంటి ద‌ర్శ‌కులు ఇల్లు వ‌దిలి వెళ్లాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తాయి. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోనూ కొన్నేళ్ల క్రితం కొంతమంది ప్రముఖ నటులు, నిర్మాతలు భూవివాదాలు లేదా లోకల్ ఫ్యాక్షన్ గ్యాంగ్‌ల నుండి బెదిరింపులు ఎదుర్కొన్నప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా తమ సొంత ఇళ్లను వదిలి జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ వంటి హై-సెక్యూరిటీ గేటెడ్ కమ్యూనిటీ నివాసాలకు, సీక్రెట్ ఫ్లాట్లకు మారిన దాఖలాలు ఉన్నాయి.

Tags:    

Similar News