ఫ్లాప్ వస్తే సీక్వెల్ తీయడమే బెటరా? ప్రతిసారీ సేఫేనా?
అయితే రీసెంట్ గా అజయ్ భూపతి.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరకెక్కించిన 'శ్రీనివాస మంగాపురం' ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది.
ఒక సినిమా ఫ్లాప్ అయితే తర్వాత మూవీ విషయంలో దర్శకులు మరింత జాగ్రత్త పడతారు. కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రావాలా.. లేదంటే గతంలో హిట్ అయిన మూవీకి సీక్వెల్ తీసి మళ్లీ సక్సెస్ అందుకోవాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టాలీవుడ్ లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న స్టోరీ మళ్లీ తీసుకొస్తే అంచనాలు పెరుగుతాయి.
దీనికి దర్శకుడు అజయ్ భూపతి తీసుకున్న నిర్ణయం ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది. అజయ్ భూపతి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చే సినిమాలు 'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం'. విభిన్నమైన స్టోరీలతో ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 'మంగళవారం' సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుని, సీక్వెల్ కోసం వెయిట్ చేసేలా చేసింది. ఇప్పుడు 'మంగళవారం 2' వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
అయితే రీసెంట్ గా అజయ్ భూపతి.. జయకృష్ణ ఘట్టమనేని హీరోగా తెరకెక్కించిన 'శ్రీనివాస మంగాపురం' ప్రేక్షకులను అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా రిజల్ట్ నిరాశపరిచిన నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి 'మంగళవారం 2'పై పడింది. అయితే ఆ సీక్వెల్ ను 'శ్రీనివాస మంగాపురం' రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రకటించలేదు. అంతకుముందే ఆ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. కానీ 'శ్రీనివాస మంగాపురం' నిరాశపరచడంతో అజయ్ భూపతి ఫ్లాప్ తర్వాత సీక్వెల్ ట్రెండ్ ఫాలో అయినట్లు అయింది.
నిజానికి ఓ సినిమా ఫ్లాప్ అయినప్పుడు దర్శకుడి మార్కెట్ పై కాస్త ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో గతంలో విజయం సాధించిన సినిమా బ్రాండ్ యూజ్ చేసుకోవడం ఒక వేగా కనిపిస్తుంది. మొదటి భాగం నచ్చిన ప్రేక్షకులు రెండో భాగంపైనా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దీంతో సినిమా అనౌన్స్మెంట్ నుంచే హైప్ వస్తుంది.
నిర్మాతలకు కూడా బిజినెస్ పరంగా అవకాశాలు పెరగవచ్చు. కానీ మొదటి భాగం విజయానికి కారణమైన ఎలిమెంట్స్ ను గుర్తించి, వాటికి మించిన కథను సిద్ధం చేయాలి.
పాత బ్రాండ్, పాత్రలు లేదా గతంలో వచ్చిన విజయాన్ని నమ్ముకుంటే సరిపోదు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటారు. కథలో బలం లేకపోతే భారీ అంచనాలే సినిమాకు ఇబ్బందిగా మారవచ్చు. 'మంగళవారం 2' విషయంలోనూ ఇదే ఆసక్తి కనిపిస్తోంది. మొదటి భాగం నుంచి ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకుంటూనే కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అజయ్ భూపతికి సవాలుగా మారనుంది. ఆ సినిమా కోసం ఆయన స్వయంగా నిర్మాణ బాధ్యతలు తీసుకుంటున్నారని, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఏదేమైనా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం అంటే విజయం ఖాయమని కాదు. అదే సమయంలో ఒక ఫ్లాప్ తర్వాత కొత్త కథతో సినిమా చేయడం డేంజర్ కూడా కాదు. చివరకు ప్రేక్షకులను ఆకట్టుకునేది కంటెంట్ మాత్రమే. సీక్వెల్ కు ఉన్న క్రేజ్ సినిమాను థియేటర్లకు తీసుకురావచ్చు. కానీ ప్రేక్షకులను చివరి వరకు మెప్పించాల్సిన బాధ్యత మాత్రం దర్శకుడిపైనే ఉంటుంది. అందుకే ప్రతిసారీ ఆ ట్రెండ్ సేఫ్ జోన్ అవుతుందని మాత్రం చెప్పలేం.