సైలెంట్‌గా గ్లోబల్ ఇమేజ్‌ని మార్కెట్ మాయాజాలంగా మార్చేస్తున్న రాజమౌళి!
ఈ వేడుకలో తన కలల ప్రాజెక్ట్ `వారణాసి` గురించి రాజమౌళి ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసారు.
భారతీయ చలనచిత్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి నిశ్శబ్దంగా తన గ్లోబల్ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే వరల్డ్ ఫేమస్ ఫిలింఫెస్టివల్స్ లో రాజమౌళి సందడి కొత్తేమీ కాదు కానీ.. ఈసారి బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో ఘనంగా నిర్వహించిన 50వ సావో పాలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో జక్కన్న ప్రత్యక్షమై అక్కడి అంతర్జాతీయ సినీ ప్రియులను అబ్బురపరిచారు. విశ్వ వేదికపై ప్రపంచ సినిమాకు ఆయన అందించిన విశేష సేవలకుగానూ ప్రతిష్టాత్మక `లెక్సియోన్ లియోన్ కాకాఫ్` అవార్డుతో రాజమౌళిని గౌరవించారు. ఈ వేడుకలో ఆర్ఆర్ఆర్ చిత్రంతో పాటు ఆయన తదుపరి దృశ్యకావ్యం `వారణాసి`కి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ప్రదర్శించగా.. అక్కడి ప్రేక్షకుల నుంచి రాజమౌళికి అద్భుతమైన `స్టాండింగ్ ఒవేషన్` లభించింది.
ఈ వేడుకలో తన కలల ప్రాజెక్ట్ `వారణాసి` గురించి రాజమౌళి ఆసక్తికరమైన సమాచారాన్ని షేర్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మూవీ చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, కేవలం మరో 10 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందనే వార్తతో అభిమానుల్లో అంచనాలు పెంచేశారు. వాస్తవానికి పురాణేతిహాసం రామాయణంలోని ఎపిసోడ్స్ ని చూపిస్తున్నా కానీ...ఇందులో ఫిక్షన్ ప్రధానంగా హైలైట్ అవుతుంది. అలాగే పైకి సైన్స్ ఫిక్షన్ తరహాలో అనిపించినా.. ఇది పౌరాణిక అంశాలతో ముడిపడి ఉన్న ఒక అత్యున్నత ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం భారీ హంగులే కాకుండా తండ్రీకొడుకుల అపారమైన అనుబంధం.. యువతీయువకుల మధ్య సాగే మధురమైన ప్రేమకథ కూడా ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని వెల్లడించారు.
`వారణాసి` చిత్రం కేవలం పౌరాణిక కథల యథాతథ అనుకరణ కాదని.. భారతీయ ఇతిహాసాలలోని ఆత్మను తీసుకుని అంతర్జాతీయ ప్రమాణాలతో అల్లిన ఒక వినూత్న కథనమని రాజమౌళి వివరించారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నిజమైన విప్లవ వీరుల ఆధారంగా కల్పిత కథను ఆవిష్కరించినట్లే... ఇందులోనూ పౌరాణిక మూలాలను ఆధారం చేసుకుని ఒక భారీ అడ్వెంచర్ డ్రామాను రూపొందిస్తున్నారు. ఎలాంటి ముందస్తు అవగాహన లేని అంతర్జాతీయ ప్రేక్షకుడు కూడా ఈ కథలోని భావోద్వేగాలకు సులభంగా కనెక్ట్ అయ్యేలా కథనాన్ని సిద్ధం చేశారు. మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ తారాగణంతో ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.
ఈ చిత్రంలో అత్యంత కీలకమైన విశేషం ఏమిటంటే.. రామాయణ నేపథ్యంతో వచ్చే ఒక ఘట్టంలో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ లుక్‌లో మహేష్‌ను చూడగానే తనకు ఒళ్లు గగుర్పొడిచే అనుభూతి కలిగిందని రాజమౌళి పెన్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థులతో చిట్ చాట్ లో గుర్తుచేసుకున్నారు. మహేష్ బాబు తన అంచనాలను మించి 200 శాతం అంకితభావంతో నటించారని.. దాదాపు 60 రోజుల పాటు చిత్రీకరించిన ఈ సుదీర్ఘ సీన్ సినిమాలోనే అత్యంత భావోద్వేగమైన, దృశ్యపరంగా అద్భుతమైన ఘట్టంగా నిలవబోతోందని ప్రశంసల వర్షం కురిపించారు.
గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపుదిద్దుకుంటున్న `వారణాసి` చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో భారీగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఐదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం వస్తున్న ఈ చిత్రం.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ పటంలో మరో మెట్టు పైకి తీసుకెళ్లడం ఖాయమని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, సినీ ప్రియులు కొనియాడుతున్నారు. హాలీవుడ్ స్థాయి మేకింగ్, భారతీయ పౌరాణిక మూలాలతో రాజమౌళి సృష్టిస్తున్న ఈ సరికొత్త ప్రపంచం అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా జెండాను మరోసారి సగర్వంగా ఎగరవేయడానికి సిద్ధమవుతోంది.