టీనేజర్స్ దారుణం: కేవలం 35వేల సుఫారీకే స్టార్ హీరో హత్యకు కుట్ర!
టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా జూహూలోని ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వెళ్తారనే పక్కా సమాచారంతో ఈ ప్లాన్ అమలు చేశారు.
బాలీవుడ్ యువనటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని ముంబైలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్‌తో సంబంధం ఉన్నవారే టార్గెట్‌గా సాగుతున్న ఈ దారుణ కాంట్రాక్ట్ వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు అనిల్ పండిట్ ఈ కుట్రకు సూత్రధారిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా రెండు నెలల ముందు నుంచే ఈ ముఠా నటుడి కదలికలపై నిఘా పెట్టి.. పక్కాగా రెక్కీ నిర్వహించినట్లు విచారణలో బయటపడింది.
ఈ దాడికి పాల్పడిన నిందితులలో ఒకరైన 18 ఏళ్ల రెహాన్‌కు కేవలం రూ.35 వేల నగదుతో పాటు విదేశాల్లో మంచి ఉద్యోగం ఇస్తామని ఆశ చూపినట్లు తేలింది. ఈ కుట్రలో భాగంగా నిందితులు ముగ్గురికి ముందస్తుగా రూ.50 వేలు అందజేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రవాస ఉద్యోగాల ఆశ చూపి.. అమాయక యువకులను నేర ప్రపంచంలోకి లాగుతున్న ఈ పద్ధతి బిష్ణోయ్ గ్యాంగ్ పాత శైలిని తలపిస్తోంది. దర్యాప్తు సంస్థల కళ్లు గప్పేందుకు ఈ డబ్బును చిన్న చిన్న విడతలుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు.
టైగర్ ష్రాఫ్ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా జూహూలోని ఒక ఫుట్‌బాల్ గ్రౌండ్‌కు వెళ్తారనే పక్కా సమాచారంతో ఈ ప్లాన్ అమలు చేశారు. గ్రౌండ్ బయట కారులో వెళుతున్న సమయంలో ఇద్దరు షూటర్లు కాల్పులకు తెగబడగా.. మూడో వ్యక్తి బైక్‌పై సిద్ధంగా ఉన్నాడు. ఏడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే అంధేరి వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద బైక్‌ను వదిలేసి.. అక్కడి నుంచి రైలులో జైపూర్ మీదుగా నేపాల్ పారిపోవడానికి వారు ప్లాన్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు స్పష్టం చేశారు.
ఈ దుర్మాగ్యానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు ముంబై పోలీసులు దాదాపు 20 ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ బృందాలను రంగంలోకి దించారు. సీసీటీవీ పుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో వారిని విజయవంతంగా అడ్డగించారు. హర్యానాకు చెందిన రిహాన్ (18), బీహార్‌కు చెందిన రతిక్ ఉరఫ్ రోషన్ (22)తో పాటు మరో మైనర్‌ను దాడి జరిగిన 24 గంటల్లోనే అరెస్టు చేసి.. తప్పించుకోవాలనే ప్రణాళికను భగ్నం చేశారు. అయితే టీనేజర్లను, అభం శుభం తెలియని యువకులను కేవలం వేల రూపాయల డబ్బు, ఉద్యోగం ఆశ చూపి ఇలాంటి దారుణమైన రొంపిలోకి దించేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రయత్నించడం ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీసింది. ఇంత చిన్న మొత్తానికి అంత పెద్ద సూపర్ స్టార్ ని చంపేస్తారా? అంటూ నెటిజనులు ప్రశ్నిస్తుండగా.. ఇది చాలా దారుణమని ఎక్కువమంది కామెంట్ చేస్తున్నారు.
ఈ కాల్పుల ఘటన తర్వాత సోషల్ మీడియాలో విడుదలైన ఒక ఆడియో క్లిప్ తీవ్ర కలకలం రేపింది. తామే ఈ దాడికి పాల్పడ్డామని.. లారెన్స్ బిష్ణోయ్ తరఫున అనిల్ పండిట్, హర్మన్ సంధు ఈ బాధ్యత వహిస్తున్నట్లు ఆ ఆడియోలో ప్రకటించారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసేవారందరికీ ఇది తొలి - చివరి హెచ్చరిక అని.. తమను ఎదిరిస్తే ఇదే గతి పడుతుందని వారు హెచ్చరించారు. సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురిచేసి చిత్ర పరిశ్రమలో వసూళ్లకు పాల్పడే ఈ ముఠా చర్యలపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.